సాక్షి, విజయవాడ: కర్నూలులో ఉల్లి పంట దిగుబడి ఎక్కువగా ఉందని.. తక్షణమే ఉల్లి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల ఇబ్బందులపై సమాచారం వచ్చిన తక్షణమే స్పందించాలని.. టమాట కూడా ఎంత వస్తే అంత కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. టమాటా ప్రాసెసింగ్‌ను పెద్ద ఎత్తున చేస్తామని పేర్కొన్నారు. బత్తాయి, మామిడి, ఉల్లి, అరటి ,టమాటపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారని కన్నబాబు తెలిపారు.
(ఏపీలో 94 శాతం పింఛన్ల పంపిణీ..)
మూడు స్థాయిల్లో అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు..
ఇప్పటికే మామిడి ఎగుమతి అవుతోందని.. మూడు స్థాయిల్లో అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారని మంత్రి పేర్కొన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటుకు ఆదేశాలిచ్చామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రైతు భరోసా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన రైతులకు రైతు భరోసాలో పేరు లేకుంటే..వెంటనే గ్రామ సచివాలయంలో సంప్రదించాలని మంత్రి సూచించారు.
(‘ఆ విషయాన్ని బాబు ఎందుకు దాచారు’)
రైతులను అయోమయానికి గురిచేయొద్దు..
ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా ఆయన ఆప్తులు ఎవరైనా రైతు భరోసాకు నమోదు చేసుకోవచ్చని.. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. ఇంకా రైతు భరోసా లిస్ట్‌లు సిద్ధం కాకముందే పేర్లు తొలగించామని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు. రైతులను అయోమయానికి గురి చేసే విధంగా అవాస్తవాలను ప్రచారం చేయొద్దని చంద్రబాబుకు హితవు పలికారు.
వారు కూడా నమోదు చేసుకోవచ్చు..
ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో పొగాకు వేలం కేంద్రాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయని..వాటిని ప్రారంభిస్తామని తెలిపారు. కౌలుదారులు కూడా రైతు భరోసాకు పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలులో బస్తాకు 2 కేజీలు ఉచితంగా తీసుకుంటున్నారని సీఎం దృష్టికి వచ్చిందన్నారు. రైతులను దోచుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని మంత్రి కన్నబాబు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment