‘దీపం’పై శ్రద్ధ లేదా? | Minister Paritala Sunita in Review Meeting | Sakshi
Sakshi News home page

‘దీపం’పై శ్రద్ధ లేదా?

Published Mon, Feb 9 2015 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

‘దీపం’పై శ్రద్ధ లేదా?

‘దీపం’పై శ్రద్ధ లేదా?

ఒంగోలు టౌన్: ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రకాశం జిల్లాకు 19217 కేటాయించారు. దీపం మంజూరు గడువు దగ్గర పడుతున్నా ఇంతవరకు ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. మహిళలంతా నన్ను అడుగుతున్నారు. మీకు దీపంపై శ్రద్ధ లేదా. మేం చేయమని చెప్పండి.. ప్రత్యామ్నాయం చూస్తానని’ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో పౌరసరఫరాలశాఖ అధికారులు, పౌరసరఫరాల సంస్థ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలతో ఆదివారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీపం కనెక్షన్లు మంజూరు చేసిన విషయాన్ని కనీసం ప్రజలకు కూడా తెలియకుండా చేశారంటే మీ పనితీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయనపై మండిపడ్డారు. ఎంపీడీవోలు జాబితాలు తయారు చేయాల్సి ఉంటుంది, వారినుంచి వివరాలు వచ్చాయా అని అడిగితే డీఎస్‌ఓ నుంచి సమాధానం రాకపోవడంతో మంత్రి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్ వెంటనే జోక్యం చేసుకుంటూ ఇటీవల తహ శీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించినప్పుడు ఎందుకు దీపం కనెక్షన్ల విషయాన్ని ప్రస్తావించలేదని డీఎస్‌వోను నిలదీశారు. ఈనెల 28వ తేదీ నాటికి జిల్లాకు మంజూరైన దీపం కనెక్షన్లన్నీ గ్రౌండింగ్ అయ్యేలా చూస్తానని జాయింట్ కలెక్టర్ మంత్రికి హామీ ఇవ్వగా, నమ్మమంటారా అంటూ తిరిగి ఆయనను మంత్రి ప్రశ్నించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి వారి బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లోపు నగదు జమ కావాలని ఆదేశించారు.
 
పెట్రోలు బంకుల పేర్లు లేకుండా బుక్ ఎలా చేశారు:

‘జిల్లాలో 190 పెట్రోలు బంకులున్నాయి. ఏ రోజు ఎన్ని తనిఖీ చేస్తున్నారో వివరాలు లేవు. ఆర్‌డీవోలు, ఇతర అధికారులైనా తనిఖీలు చేస్తున్నారా’ అని మంత్రి సునీత ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు చేసి 3 లక్షల 65 వేల రూపాయల ఫైన్ కట్టించినట్లు తూనికలు కొలతల శాఖ అధికారి సమాధానం చెప్పారు. కేసులు బుక్‌చేసి సాయంత్రానికి రిలీజ్ చేస్తున్నారా, ఇప్పటి వరకు ఎక్కడ కేసులు బుక్ చేశారో చెప్పాలని ఆమె నిలదీశారు. ఆ అధికారి నీళ్లు నమలడంపై మంత్రి అసహనం వ్యక్తం చేస్తూ పెట్రోల్ బంకుల పేర్లు లేకుండా కేసులు ఎలా బుక్ చేశారని నిలదీశారు.

జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకులన్నీ తెలుసా అని ఆమె ప్రశ్నించారు. జిల్లాలో కిరోసిన్ కార్డుదారులకు అందకుండా పక్కదారి పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లాలో 19 మంది కిరోసిన్ డీలర్లు ఉన్నారని, నెలకు 1430 లీటర్లు సరఫరా చేస్తున్నారని, వారంతా సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోరా అని మంత్రి అధికారులను నిలదీశారు. జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుంటూ కిరోసిన్ రవాణాకు సంబంధించి సోషల్ ఆడిట్‌కు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

కొంతమంది చౌకధరల దుకాణ దారులు సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని తన దృష్టికి వచ్చిందని, ఇకముందు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సునీత ఆదేశించారు. అదేవిధంగా కొంతమంది తహశీల్దార్లు చౌకధరల దుకాణ దారులను ఇబ్బంది పెడుతున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చాయని, తహశీల్దార్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి సమీక్షించాలని జాయింట్ కలెక్టర్‌కు ఆమె సూచించారు. జిల్లాలో 2012 చౌకధరల దుకాణాలున్నాయని, అందులో 226 ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు.
 
రేషన్ డీలర్లే ప్రచారం చేస్తున్నారు:
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత రేషన్‌కార్డులను తొలగిస్తుందని చౌకధరల దుకాణ దారులే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోమారు ఈ జిల్లాకు వస్తానని, ఇలాంటి ఆరోపణలు పునరావృతం కాకూడదన్నారు. జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో ఒంగోలు ఆర్‌డీఓ కమ్మ శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ మురళి, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఒంగోలు తహశీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement