మూణ్నెళ్ల పద్దు | Minister Perni Nani Comments Over Coronavirus Situations In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మూణ్నెళ్ల పద్దు

Published Sat, Mar 28 2020 3:32 AM | Last Updated on Sat, Mar 28 2020 7:50 AM

Minister Perni Nani Comments Over Coronavirus Situations In Andhra Pradesh - Sakshi

సామాజిక దూరం పాటిస్తూ కేబినెట్‌ సమావేశంలో పాల్గొన్న మంత్రులు. భేటీలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సంబంధించి తొలి త్రైమాసిక (మూడు నెలలు) వ్యయానికి ఆర్డినెన్స్‌ జారీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. శుక్రవారం సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్‌ ఆర్డినెన్స్‌తో పాటు కరోనా వ్యాప్తి నిరోధానికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ఇకపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.   

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా చర్యలు
- కరోనా వైరస్‌ను నిరోధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలు, అవలంభిస్తున్న చర్యలు ఏవిధంగా ఉన్నాయన్న అంశంపై ప్రజల అభిప్రాయం ఎలా
ఉందనేది మంత్రుల ద్వారా సీఎం తెలుసుకున్నారు.
- ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 11 కరోనా పాజిటివ్‌ కేసులు (మంత్రి మాట్లాడే సమయానికి) నమోదయ్యాయి. విశాఖపట్నంలో 3, విజయవాడలో 3, ఇతర ప్రాంతాల్లో మరో 5 కేసులు నమోదయ్యాయి. 
- రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో 100 పడకలతో, జిల్లా స్థాయిలో 200 పడకలతో  ప్రత్యేకంగా ఐసోలేషన్‌ బెడ్స్‌ కలిగిన కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. తీవ్రమైన పరిస్థితి వస్తే రెండవ స్థాయిలో మూడవ స్థాయిలో ఏమి చేయాలో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
- తొలి దశ కింద రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఆసుపత్రుల్లో కోవిడ్‌–19 చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఈ ఆసుప్రతుల్లో 400 వెంటిలేటర్స్‌ ఏర్పాటు చేశాం.
- మార్చి 23వ తేదీ నుంచి ముఖ్యమంత్రి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రధాని ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 14 వరకు దానిని కొనసాగిస్తున్నాం. ప్రాథమిక నిత్యావసరాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. దుకాణాలు తెరిచే ఉంచాం.

సరిపడా మాస్క్‌లు సిద్ధం
కరోనా వ్యాధి సోకిన వారితో పాటు చికిత్స అందించే వారి కోసం మాత్రమే ప్రత్యేకంగా ఎన్‌–95 మాస్కులు వినియోగించేలా 52 వేల మాస్కులు అందుబాటులో ఉంచాం. 10 లక్షల సర్జికల్‌ మాస్కులు కూడా అందుబాటులో ఉన్నాయి. కరోనా బాధితులను పరీక్షించే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి 4 వేల పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ)లను అందుబాటులో ఉంచాం. అత్యవసరమైతే ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం ఉంచిన 52 వేల ఎక్విప్‌మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎన్‌–95 మాస్కులు కావాలని జిల్లాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో మాస్కులు వారికి అందజేస్తాం. మందులు, పరికరాలకు ఆర్డర్స్‌ ఇచ్చాం. ఒకటి రెండు రోజుల్లో వస్తాయి.

స్వీయ నియంత్రణ పాటించాలి
– ఇప్పుడు మనం సామాజిక కర్ఫ్యూ పాటిస్తున్నాం. ప్రతి పౌరుడు స్వీయ నియంత్రణ పాటించాలి. రైతు బజార్లు, ప్రజలు ఎక్కువగా సంచరించే చోట సామాజిక దూరం పాటించాలని సీఎం ఆదేశించారు.
– ప్రజలు గుమిగూడకుండా కూరగాయలు, మందులు, ఆసుపత్రుల వద్ద కనీసం మీటరు దూరం ఉండేలా సామాజిక దూరం పాటించాలి. కొరత లేకుండా అన్ని సరుకుల రవాణా వాహనాలను అనుమతిస్తాం. 
– కరోనాకు మందు లేని నేపథ్యంలో పలు జాగ్రత్తలను తీసుకుంటే ఈ వైరస్‌ను నియంత్రించే అవకాశముంది. – ఇంటి పరిసరాలు, ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులు శుభ్రంగా శానిటైజర్‌తో లేదా సబ్బుతో కడుక్కోవాలి. విదేశాలు, పక్క రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలి. అలాంటి వారు వచ్చినట్లు తెలిస్తే గ్రామ, వార్డు వలంటీర్లకు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లకు తెలియజేయాలి. 
– రెండోసారి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలందరి ఆరోగ్యం గురించి గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు సర్వే సాగిస్తున్నారు. 
– కరోనా మందులేని మహమ్మారి అనిప్రస్తుత పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలి. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిని అందరూ పరిగణనలోకి తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్లు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. 

దయచేసి అందరూ సహకరించాలి
– 14 నుంచి 28 రోజుల పాటు ఈ వ్యాధి లక్షణాలు బయట పడవని, వ్యాధి లేదని ఎక్కడపడితే అక్కడ తిరగద్దు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి ఇబ్బంది లేకుండా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సీఎం, సీఎస్‌ మాట్లాడుతున్నారు. 
– ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. హోం శాఖ మంత్రి, డీజీపీలు ఆయా స్థాయి అధికారులతో మాట్లాడారు. వసతి, భోజన సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చూస్తారు.
– కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ల సీఎంలతో మన సీఎం మాట్లాడతారు. ఆయా రాష్ట్రాల అధికారులతో సీఎస్, డీజీపీ, వైద్య అధికారులు మాట్లాడతారు. ఏ ఇబ్బంది రాకుండా చూడమని కోరుతున్నాం. 
– రాష్ట్రంలోకి వస్తున్న వారి ఆరోగ్య స్థితి ఎలా ఉందో అంచనా కట్టలేని పరిస్థితిలో 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధ పడితేనే అనుమతిస్తాం. దయచేసి అర్థ చేసుకోండి. ఘర్షణ వాతవారణాన్ని సృష్టించవద్దు.

రాష్ట్ర స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు 
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర స్థాయిలో టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాం. ఈ బృందంలో ఐదుగురు మంత్రులు, ముగ్గురు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, 10 మంది ఐఏఎస్‌ అధికారులు ఉంటారు. కరోనా నిరోధానికి సంబంధించి చేపట్టాల్సిన చర్యలను వీరు పర్యవేక్షిస్తారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరిస్తారు. 
– జిల్లా స్థాయిల్లో కలెక్టర్‌ నేతృత్వంలో డిస్ట్రిక్ట్‌ లెవల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాం. ఇందులో స్టేట్‌ లెవల్‌ కమిటీలోని ఐదుగురు మంత్రులతో పాటు జిల్లా మంత్రులు, ఇతర అధికారులు ఉంటారు. 
– నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశాం. ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరంతా కరోనా కట్టడి విషయంలో కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.

కేబినెట్‌ నిర్ణయాలు ఇంకా ఇలా..
– ఆక్వా రంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న సీఎం ఆదేశాలతో మత్స్య రంగం ఎగుమతిదారులతో శనివారం పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆక్వా ఎగుమతిదారులు, సంబంధిత శాఖాధికారులు ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకోనున్నారు.  
– ప్రతి కలెక్టర్‌ వద్ద రూ.2 కోట్ల అత్యవసర నిధి ఏర్పాటు. స్థానికంగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్లు ఈ నిధిని వినియోగించుకోవచ్చు.
– కూడు, గూడు లేకుండా ఇబ్బంది పడుతున్న బిచ్చగాళ్లు, అనాథలతో పాటు వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చి సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం స్థానికంగా ఉండే కళ్యాణ మండపాలను అద్దెకు తీసుకోవాలని నిర్ణయం. ఇందులో భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తాం. దీన్ని పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారి ఉంటారు. సామాజిక బాధ్యత గల దాతలు ఆదుకోవడానికి ముందు రావాలి. ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది.

ఇక్కడా రాజకీయమేనా బాబూ..?
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చలి కాచుకోవడానికి ఇంకొకరొచ్చారనే సామెతను నిజం చేస్తూ 40 ఏళ్ల పరిశ్రమ అని చెప్పుకునే వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని చంద్రబాబు తీరును తప్పుపట్టారు. తొలుత విదేశాల నుంచి వచ్చిన వారు 13 వేలన్నారు కదా.. ఇప్పుడు 28 వేలకు ఎలా పెరిగారని ప్రశ్నించడం ఆయన అవగాహనా రాహిత్యం అన్నారు. మంత్రి నాని ఇంకా ఏమన్నారంటే..

– ఆయన హైదరాబాద్‌లో కాపురం ఉంటున్నారు. అక్కడ ఆయన రాజ ప్రసాదంలో ఉంటున్నందుకు మాకు ఏ బాధ, ఈర్ష లేదు. 
– విదేశాల నుంచి వచ్చిన వారు ఎలా పెరిగారని ఆయన ఏ అధికారినైనా అడిగారా? 
– మర్చి 10వ తేదీన చేసిన సర్వేలో 13 వేల మంది వచ్చారని తేలింది. రెండో విడత సర్వేలో ఆ సంఖ్య 28 వేలకు పెరిగిందని తేలింది. ఈ మధ్య కాలంలో విమాన రాకపోకలను నిషేధిస్తారని ముందే తెలియడంతో హడావుడిగా విదేశాల నుంచి వచ్చారు.
– విదేశాల నుంచి హైద్రాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వచ్చి, మన రాష్ట్రానికి చేరుకున్న వారి సంఖ్య ప్రస్తుతం 28 వేలకు చేరింది. ఇలా ఏపీలోకి రావడం నేరం ఏమీ కాదు. 
– కానీ చంద్రబాబు దిక్కుమాలిన ఆలోచనలతో దిక్కుమాలిన రాజకీయాలు చేస్తుండటం బాధించే విషయం. ఇంత దిగజారి ప్రకటనలు చేయడం దుర్మార్గమైన చర్య. సరిహద్దుల విషయంలోనూ రాజకీయం చేస్తూ మాట్లాడుతున్నారు. 
– కొన్ని చానల్స్‌ కూడా దిగజారి వ్యవహరిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చి, కొన్నాళ్లు ఇతర రాష్ట్రాల్లో ఉండి ఇప్పుడు రాప్ట్రానికి వస్తామంటే ఎటువంటి పరీక్షలు లేకుండా ఎలా తీసుకుంటాం? టీవీ యాజనమానులకు రేటింగ్‌ తప్ప సమాజ హితం పట్టదా? వాళ్లు రాష్ట్రానికి చెందిన వారైనా 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడితేనే రప్పించుకుంటాం. అలా కాదని వారి ఇళ్లకు పంపితే వారి ఇంట్లో వారితో పాటు పక్కంటి వాళ్లకు.. తద్వారా ప్రజలకు ప్రమాదం కాదా? 

గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే కూలీలు, సిబ్బందికి పని చూపించాలి. వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లొచ్చు. అయితే కచ్చితంగా సామాజిక దూరం పాటించాలి. ఇంటికి వెళ్లే సమయంలో శానిటైజర్లు కచ్చితంగా వినియోగించాలి. వ్యవసాయ కూలీలు, కార్మికులు కూడా ఇదే విధానాన్ని పాటించాలి.  

మూడు నెలల వ్యయం 70,994.98  కోట్లు
వచ్చే ఆర్థిక సంవత్సరం 2020–21కు సంబంధించి తొలి త్రైమాసికంలో అన్ని రంగాలకు అవసరమైన రూ.70994,98,38,000 (రూ.70,994.98 కోట్లు) వ్యయానికి వీలు కల్పించే ‘ద్రవ్య వినిమయ–ఓటాన్‌ అకౌంట్‌ ఆర్డినెన్స్‌–2020’కి శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కరోనా వైరస్‌ విస్తరించకుండా లాక్‌డౌన్‌ విధించి, వైద్య సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో శాసనసభ సమావేశాలను నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలో 213 అధికరణంలో క్లాజ్‌–1 ప్రకారం రాబోయే మూడు నెలల్లో రూ.70994,98,38,000కు వ్యయానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  

త్వరలో గవర్నర్‌తో ఆమోదం
సాధారణంగా 2020–2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను మార్చి నెలాఖరుకు ఆమోదించాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహించడం సహేతుకం కాదు. తొలి మూడు నెలలకు అన్ని రంగాలకు వ్యయం చేసేందుకు వీలుగా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆర్టికల్‌ 213 (1) ప్రకారం రాజ్యాంగానికి అనుగుణంగా ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. త్వరలోనే గవర్నర్‌ను కలిసి ఆమోదం తీసుకుంటాం. అనంతరం బడ్జెట్‌కు సంబంధించిన సమాచారం వెల్లడిస్తాం.

ఇప్పటి వరకు విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారు సుమారు 28 వేల మంది ఉన్నారని గుర్తించాం. మార్చి 13న కోవిడ్‌–19 వ్యాప్తి చెందకుండా రెగ్యులేషన్స్‌ జారీ చేశాం. 104 హెల్ప్‌లైన్‌ను 60 లైన్లతో ఏర్పాటు చేశాం. 24 గంటలూ పని చేస్తుంది. ప్రజల నుంచి ఎటువంటి సమాచారం వచ్చినా తీసుకుంటున్నాం.

కరోనా అలర్ట్‌
మనరాష్ట్రంలో ఏటా 7 లక్షల మంది గర్భిణులు ఆస్పత్రికి ప్రసవానికి వస్తున్నారు. 
- కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గర్భిణులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- మొత్తం నాలుగు దఫాలు యాంటీనేటల్‌ చెకప్‌ (అంటే కడుపులో ఉన్న బిడ్డ స్థితిగతులు తెలుసుకునేందుకు) కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. గర్భిణి అని తెలిశాక 12 వారాలకు ఒకసారి, 16–26 వారాల మధ్య మరోసారి, 26–32 వారాలకు ఒకసారి, చివరగా 32 వారాల తర్వాత మరోసారి వెళ్లాలి.
- 26 వారాల తర్వాత ఆస్పత్రికి వెళ్లడం చాలా ముఖ్యం. ఈ దశ బిడ్డ ఎదుగుతున్న దశ. కరోనా సమస్య ఉన్న ఈ సమయంలో వైద్య పరీక్షలకు గానీ మరే ఇతర కారణాలతో బయటకు వెళ్లే గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 
- గర్భిణికి ఈ దశలో శరీరంలో బాగా మార్పులు సంభవిస్తాయి. శరీర ప్రక్రియ నుంచి శ్వాసక్రియ వరకూ మార్పులకు లోనవుతుంది. సాధారణ వ్యక్తి కంటే 30 శాతం ఇమ్యూనిటీ పడిపోతుంది. శ్వాసక్రియ కూడా అంతే. 
- వైద్య పరీక్షలకు వెళ్లే సమయంలో మాస్కులు, శానిటైజర్లు, తీసుకెళ్లాలి.  ఇతరులతో దూరం పాటించాలి. ఆస్పత్రి నుంచి రాగానే దుస్తులు తీసేసి, సబ్బు నీటిలో ఉతకడం, శానిటైజర్‌ రాసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
- భారతదేశంలో గానీ ఇతర దేశాల్లోగానీ గర్భిణికి కరోనా సోకితే బిడ్డ మీద ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంపై ఇంకా పరీక్షలు జరగలేదు. గతంలో జికా వైరస్‌ గర్భిణులకు సోకితే పుట్టిన పిల్లలకు సమస్యలు రావడం గమనించాం
- కరోనా సోకిన గర్భిణులకు ప్రత్యేకించి చికిత్స లేదు.. ఇంట్లోనే ఉండటం, బలవర్ధక ఆహారం తీసుకోవడం, రోజూ 20 నిముషాలు ప్రాణాయామం చేయడం మంచిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement