ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు | Andhra Pradesh Cabinet Meeting And Decisions | Sakshi
Sakshi News home page

ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక నిర్ణయాలు

Published Tue, May 4 2021 5:11 PM | Last Updated on Tue, May 4 2021 5:58 PM

Andhra Pradesh Cabinet Meeting And Decisions - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కట్టడి కోసం బుధవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో పగటి పూట కర్ఫ్యూ అమలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరిగింది. పగటి పూట కర్ఫ్యూ సహా పలు అంశాలను చర్చించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు, ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు...
ఉ.6 గంటల నుంచి మ.12 వరకే షాపులకు అనుమతి. 12 గంటల తర్వాత ప్రజా రవాణతో పాటు ప్రైవేటు వాహనాలు రాకపోకలపై నిషేధం. అంతరాష్ట్ర సర్వీసులు కూడా రద్దు. 

మే 13న రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ. దీనివల్ల 54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 

మే 25న వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా నగదు జమ. దీని వల్ల 38 లక్షల మంది రైతులకు లబ్ధి జరగనుంది.

మే 18న వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా నగదు జమ. వేటకెళ్లే మత్స్యకారులకు రూ.10వేల చొప్పున సాయం.

7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్‌ ఆమోదం. రాష్ట్రవ్యాప్తంగా 44, 639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అంగీకారం. ‘‘పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ విద్యాబోధన ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది. నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నాం’’ అన్నారు మంత్రి. 

పాఠశాల విద్య కోసం ప్రపంచబ్యాంక్‌ నుంచి రూ.1860 కోట్ల అప్పు తీసుకున్నాం అని పేర్ని నాని తెలిపారు. ‘‘2.5 శాతం స్వల్ప వడ్డీతో రుణం తీసుకున్నాం. ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో అరకొర చదువులు చెప్తున్నారు. ఎయిడెడ్‌ సంస్థలు ప్రభుత్వానికి అప్పగిస్తే మంచిది. ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకుని నిర్వహిస్తుంది’’ అని మంత్రి పేర్ని నాని తెలిపారు. 

ప్రైవేట్‌ యూనివర్శిటీల్లో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాకు ఇవ్వాలి. ఆ సీట్లకు ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్పులు ప్రభుత్వమే ఇస్తుంది అన్నారు.

ఏపీలో మూసేసిన సహకార డెయిరీలను అమూల్‌కు లీజుకివ్వడానికి నిర్ణయం. 708 గ్రామాల్లో అమూల్‌ సేవలు.

ఏ కేటగిరి ఆలయాల్లో అర్చకులకు రూ.15వేల గౌరవ వేతనం. బీ కేటగిరి ఆలయాల్లో రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దాంతో పాటు ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేలకు గౌరవ వేతనం పెంపు.. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేలకు గౌరవ వేతనం పెంపుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. 

పట్టా రైతులతో సమానంగా అసైన్డ్‌దారులకు కూడా భూ సేకరణ పరిహారం.

రూ.511.79 కోట్లతో 176 పీహెచ్‌సీల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

ప్రతి ఏజెన్సీ మండలానికి మూడు పీహెచ్‌సీలు.

ప్రతి పాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇద్దరు డాక్టర్లు, 104 వాహనం.

ఏలేరు-తాండవ లింక్ కెనాల్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.

పక్క రాష్ట్రాల నుంచి ఆక్సిజన్‌: పేర్ని నాని
కరోనా కట్టడికి కేబినెట్‌లో విస్తృతంగా చర్చించామన్నారు మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘24 గంటల్లోనే కరోనా టెస్ట్‌ రిపోర్ట్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 26వేల ఆక్సిజన్‌ బెడ్స్‌ ఉన్నాయి. ఇప్పటివరకు కోటి 67వేల మందికి కరోనా పరీక్షలు చేశాం. ప్రతి మండల కేంద్రంలో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. 558 ఆస్పత్రుల్లో కోవిడ్‌ వైద్య సేవలు అందిస్తున్నాం. 100కుపైగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కోవిడ్‌  బాధితుల కోసం 44, 599 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక, ఒడిశా, చెన్నై, విశాఖ నుంచి ఆక్సిజన్‌ తీసుకొస్తున్నాం. రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను కూడా అందుబాటులో ఉంచుతున్నాం’’ అని మంత్రి పేర్ని నాని తెలిపారు. 

‘‘కోవిడ్‌ కట్టడికి ప్రజలు స్వీయనిర్బంధం పాటించాలి. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే మార్గం. 45 ఏళ్లు పైబడ్డ వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటివరకు 81.66 శాతం హెల్త్‌ వర్కర్లకు.. 76 శాతం ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌’’ చేశాం అని మంత్రి తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement