సాక్షి, హైదరాబాద్: వర్షాలు, వరదల కారణంగా తడిసిన, రంగు మారిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు వీలుగా నిబంధనలు సడలించాలని, రైతులను ఆదుకునేందుకు వీటిని ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేయనుంది. వర్షాల నష్టాలపై మంగళవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయించారని మీడియాకు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. తడిసిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేయించడానికి పరిశీలన బృందాన్ని పంపడానికి కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అంగీకరించారని చెప్పారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ద్వారా, మొక్కజొన్న, సోయాబీన్‌ను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని సీఎం కోరతారన్నారు.
బ్యాంకర్ల కమిటీతో మాట్లాడి రుణాలు రీ షెడ్యూల్ చేయించాలని నిర్ణయించారు. ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిలు తక్షణం విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.1.50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని సూచిం చారు. 18 ఏళ్లు నిండిన వారికైతే ఆపద్బందు కింద మరో రూ.50 వేలు అదనంగా ఇప్పించాలని ఆదేశిం చారు. నష్టాలపై మూడు నాలుగు రోజుల్లో పూర్తిసాయి నివేదికలు పంపాలని అధికారులకు సూచించారు.