ఏం.. తమాషాలు చేస్తున్నారా!
అధికారులపై మంత్రి రావెల మండిపాటు
విజయవాడ బ్యూరో: తమాషాలు చేస్తున్నారా.. విద్యార్థులకు అందాల్సిన వస్తువులు సక్రమంగా ఇంతవరకు ఎందుకు అందలేదు. అందరికీ పాఠ్యపుస్తకాలు కూడా ఎందుకు అందలేదు. జూన్ నుంచి కాలేజీలు తెరుస్తారని మీకు తెలియదా? అంటూ సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులపై సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మండిపడ్డారు. శుక్రవారం స్థానిక ఐలాపురం హోటల్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సాంఘిక సంక్షేమ గురుకుల ప్రధానాచార్యుల రాష్ట్రస్థాయి సెమినార్ జరిగింది. సెమినార్‌ను ప్రారంభించిన మంత్రి గురుకుల కాలేజీల బాగోగులపై సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం విద్యార్థులకు ఇవ్వాల్సిన బాక్స్‌లు, బట్టలు, కాస్మొటిక్స్, బెడ్‌షీట్స్ వంటికి సరిగా పంపిణీ జరగలేదని, ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఆర్థిక వ్యవహారాలు ఆలస్యం కావడం వల్ల వెంటనే ఇవ్వలేకపోయినట్లు ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన మంత్రి ఇక మీదట ఇటువంటి సాకులు చెబితే సహించేది లేదన్నారు. గత సంవత్సరం ఫలితాల్లోనూ కొంత వెనుకబాటు కనిపించినట్లు మంత్రి చెప్పారు. ఈ సంవత్సరం ఇంతవరకు పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోవడంపై డిప్యూటీ కార్యదర్శి ఇర్ఫాన్‌ను మంత్రి నిలదీశారు. సోమవారం తగిన ఫైల్స్‌తో తన వద్దకు రావాల్సిందిగా ఇర్ఫాన్‌ను ఆదేశించారు. సెమినార్‌లో గురుకుల విద్యాలయాల అదనపు కార్యదర్శి కె.వి. చైతన్య, సంయుక్త కార్యదర్శి జి రమేష్, డిప్యూటీ కార్యదర్శి ఎండి ఇర్ఫాన్, గురుకుల విద్యాలయాల ఆచార్యులు పాల్గొన్నారు.