విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన
మంత్రి రావెల కిషోర్‌బాబు
పాతగుంటూరు: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. రూ.52 కోట్లతో నాలుగు ప్రాంతాల్లో గురుకుల పాఠశాలల భవనాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని రాజావారితోటలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల వసతి గృహాన్ని బుధవారం ఆయన సందర్శించారు. హిందూ కళాశాల, ఆంధ్రాబ్యాంక్ సమకూర్చిన దుప్పట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ తాడికొండ, గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడు, కాకుమానుల్లో గురుకుల పాఠశాలల భవనాలు నిర్మిస్తామని చెప్పారు. ఒక్కొక్క గురుకుల పాఠశాలకు రూ.13 కోట్లు కేటారుుంచామని తెలిపారు. కోర్టు వివాదం తీరిన వెంటనే కాకుమాను గురుకుల పాఠశాల పనులు చేపడతామన్నారు. తాడికొండలో 10 ఎకరాలు, కాకుమానులో ఏడు ఎకరాల స్థలంలో పాఠశాలలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.
ప్రపంచాన్ని జయించే శక్తి నేటి విద్యార్థులకు ఉందన్నారు. వారు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల బోధన అవసరమన్నారు. విద్యార్థులు బాగా చదువుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా టోల్‌ఫ్రీ నంబర్ 180042513521కు ఫోన్ చేయవచ్చన్నారు. ఆంధ్రాబ్యాంక్ డీజీఎం గిరీష్‌కుమార్, ఏజీఎంలు రత్నకుమారి, సుబ్బారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.