
మంత్రి చెప్పారని..నగదు డ్రా!
- కురుడు పంచాయతీ నుంచి రూ. 15లక్షలు విత్‌డ్రా
- ఎంపీడీవో సొంత ఖాతాలోకి జమ
- విచారణ చేసేందుకూ భయపడుతున్న జిల్లా అధికారులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అధికారం ఉందికదా... ఏం చేసినా చెల్లిపోతుందనుకున్నారో... ఏమో మంత్రిగారు చెప్పారని ఓ పంచాయతీనుంచి మొత్తం రూ. 15లక్షలు డ్రా చేసుకుని తన సొంతఖాతాలో జమచేసుకున్నారు. ఇది సాక్షాత్తూ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళంజిల్లా టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి ఎంపీడీఓ ఘనకార్యం. మంత్రిగారు వెనకున్నారని తెలుసుకున్న జిల్లా అధికారులు దీనిపై విచారణ చేపట్టేందుకు కూడా సాహసించడంలేదు.
టెక్కలి నియోజకవర్గంలో సుమారు 120గ్రామాలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన సర్పంచ్‌లున్నారు. అంతకుమించి వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన సర్పంచ్‌లూ ఉన్నారు. రాజకీయ కక్షతో గత సెప్టెంబర్‌లో మంత్రి అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీకి చెందిన 18మంది సర్పంచ్‌లకు చెక్ పవర్ తప్పించేశారు. పంచాయతీల అభివృద్ధి కోసం తీర్మానాలు చేపట్టి, పనుల వివరాలను స్థానిక అధికారుల ద్వారా జిల్లా అధికారులకు తెలియజేసి నిధుల్ని పక్కాగా వినియోగించుకోవాల్సిన స్థానిక సిబ్బంది ఇదే అదనుగా సర్పంచ్‌లు లేని చోట, చెక్ పవర్ రద్దయిన చోట తమ సత్తా చూపించుకుంటున్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి ఎంపీడీఓ బి.రాజులు కురుడు పంచాయతీ నిధులు రూ.15లక్షల్ని తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నారు.
అసలేమైందంటే...
కురుడు సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీకి చెందిన రొక్కం సూర్యప్రకాశరావు(జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు)కు రాజకీయ కక్షతో గత ఏడాది సెప్టెంబర్‌లో చెక్‌పవర్ రద్దు చేయించారు. అనంతరం మంత్రి కనుసన్నల్లో మార్చిలో రూ. 3లక్షల 25వేల పంచాయితీ నిధులు తప్పించేశారు. తాజాగా జూన్ 11వ తేదీన మంత్రి అనుచరుడు బోర నాగభూషణరావు పేరిట స్థానిక ఎంపీడీవో రాజులు రూ.15లక్షలు డ్రా చేయడమే గాకుండా కోటబొమ్మాళిలోని ఇండియన్‌బ్యాంకులోని తన సొంత ఖాతాలో జమ చేయించుకున్నారు.
ఈ విషయం ట్రె జరీలో సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసింది. 13వ ఆర్థిక సంఘం నిధుల్ని అక్కడి ఎంపీడీవో 004287/846నంబర్ చెక్కు ద్వారా రూ.2లక్షల 90వేలు, 004288/847నంబర్ చెక్కు ద్వారా రూ.2లక్షల 90వేలు, 004289/849నంబర్ చెక్కుద్వారా రూ.2లక్షల 90వేలు, 004290/849 నంబర్ చెక్కు ద్వారా రూ.2లక్షల 30వేలు, 004291/850 నంబర్ చెక్ ద్వారా రూ.2లక్షలతోపాటు జూన్ 11, 2015త తేదీనే చెక్కులతో పాటు ఎల్‌వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా మరో రూ.2లక్షలు డ్రా అయినట్టు జిల్లా ట్రెజరీ అధికారులు సహకార హక్కుచట్టం ద్వారా చేసిన వినతికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
దీనిపై ఎంపీడీవోను అడిగితే ‘మంత్రిగారు డ్రా చేసుకోమన్నారు..డ్రా చేసుకున్నా’అని చెప్పడం గమనార్హం. మంత్రి కుటుంబీకులకు ఈ మొత్తాన్ని చేరవేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని స్థానికులు కొందరు జూన్ 24న జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన జెడ్పీ సీఈవోకు పరిశీలించాల్సిందిగా పంపించారు. జెడ్పీ సీఈవో టెక్కలి డీఎల్‌పీవోకు విచారణ చేయాలని అప్పగించారు. అయినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతీ లేదు. అయితే చేయని పనులు చేయించినట్టు ఇప్పుడు రికార్డులు సృష్టించే పనిలో తెలుగుతమ్ముళ్లు ఉన్నారు. పాత తేదీలతో అంచనాలు తయారు చేయించేసి, ఎంబుక్‌ల నిర్వహణ, పనులు చేపట్టినట్టు రికార్డులు తయారు చేయించడానికి అక్కడి ఇంజినీర్లపైనా ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై జెడ్పీ సీఈవో, టెక్కలి డీఎల్‌పీవో, ఎంపీడీవోలను వివరణ కోరేందుకు సాక్షి పలుమార్లు ప్రయత్నించినా ఫోన్లు ఎత్తడం లేదు.
చర్యలెందుకు తీసుకోవట్లేదు?
పంచాయితీ చట్టానికి విరుద్ధంగా డబ్బులు డ్రా చేయడం, నిధులు మళ్లించే అధికారం ఎంపీడీవోకు ఎవరిచ్చారు. మంత్రి బంధువుగా చెప్పుకుంటున్న ఎంపీడీవో ఇక్కడెన్నో దారుణాలకు ఒడిగడుతున్నా అడిగే నాథుడే లేడు. మొత్తం రూ.15లక్షలు మాయమైతే అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావట్లేదు.
- రొక్కం సూర్యప్రకాశరావు,
సర్పంచ్, కురుడు గ్రామ పంచాయితీ