మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో ఆరాచకం రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆరోపించారు.
చిలకలూరిపేట: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో ఆరాచకం రాజ్యమేలుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆరోపించారు. పార్టీ కార్యాలయం లో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ప్రత్తిపాటి అరాచకాలకు వ్యతిరేకంగా, అర్హులైన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు అందజేయాలని కోరుతూ శుక్ర, శనివారాల్లో నరసరావుపేట సెంటర్‌లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
20వ తేదీ సాయంత్రం ఎన్‌ఆర్‌టీ సెంటర్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. వైఎస్సార్ సీపీకి మద్దతు పలికారన్న కోపంతో స్థానిక కేబుల్ నెట్‌వర్‌కలో 20ఏళ్లుగా ఉన్న వాటాలను బలవంతంగా లాక్కొని భాగస్వాములను బయటకు నెట్టేశారని విమర్శించారు. ప్రైవేటు వ్యాపారాలు చేసుకొనే వారిపై కూడా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారన్నారు. ఒక్కొక్క కనెక్షన్ విలువ నాలుగు వేల రూపాయలు ఉంటుందని మొత్తం రెండు కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి కల్పించారన్నారు. వీరిని బయటకు నెట్టివేసి, కేబుల్ కనెక్షన్లు పీకివేసి, ప్రసారాలు నిలిపివేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రికి కేబుల్ టీవీలో 50 శాతం వాటా ఇవ్వడానికి, మరెవరూ ఈవిషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడానికి ప్రశ్నించేవారిపై ఆరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
రేషన్‌డీలర్లు, మధ్యాహ్నభోజన నిర్వాహకులు, అంగన్‌వాడీలను తొలగించారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా కేబుల్ విషయంలో గాని, ఇతర ఉద్యోగుల విషయంలో జోక్యం చేసుకోలేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రెండు రోజుల పాటు జరిగే రిలే దీక్షల్లో పార్టీ శ్రేణులు, బాధితులు తరలిరావాలని కోరారు.
కేబుల్ ఆపరేటర్ సాలేహ మాట్లాడుతూ తాను 2002 నుంచి ఐదుగురు మిత్రులతో కలిసి కేబుల్ ఆపరేటర్‌గా కొనసాగుతున్నానని, తనకు హెడ్‌ఆన్‌లో ఉన్న 15పైసల వాటాను ఇటీవల తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఆపరేటర్ విడదల కమలేంద్ర మాట్లాడుతూ 2000 సంవత్సరం నుంచి కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని, 13ఏళ్లపాటు టీడీపీలో పనిచేసి ఎన్నికలకు ముందుకు వైఎస్సార్ సీపీలో చేరడం వల్లే కేబుల్‌లో తన వాటా లాక్కొన్నారని వివరించారు. సమావేశంలో కేబుల్ ఆపరేటర్ నర్సిరెడ్డి, పార్టీ పట్టణ కన్వీనర్ ఏవీఎం సుభాని, నాయకులు బైరావెంకటకృష్ణ, కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.