సాక్షి ప్రతినిధి, అనంతపురం : మైనార్టీలకు టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఝలక్ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై హిందూపురం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీకి షాక్ ఇచ్చారు. ‘బేరం’ కుదరడంతో అంబికా లక్ష్మినారాయణను సైకిలెక్కించుకున్నారు. హిందూపురం టీడీపీ టికెట్ తనకే దక్కుతుందని అంబికా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరవుతోన్న చంద్రబాబు.. నరేంద్రమోడీ చరిష్మాతోనైనా అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు అర్రులు చాస్తుండటంపై మైనార్టీలు మండిపడుతున్నారు. ఇది టీడీపీ శ్రేణులను కలవరపరుస్తోంది.
చంద్రబాబు టీడీపీకి సారథ్యం వహిస్తున్నప్పటి నుంచీ మైనార్టీలు ఆ పార్టీకి దూరమవుతూ వస్తున్నారు. ఎన్టీఆర్‌కు 1995 ఆగస్టులో వెన్నుపోటు పొడవడం ద్వారా అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు.. 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో టీడీపీని ఘోర పరాజయం నుంచి కాపాడలేకపోయారు. 1998 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. తన సారథ్యంలో టీడీపీకి విజయం దక్కడం కల్లని భావించిన చంద్రబాబు.. 1999 ఎన్నికల్లో వాజ్‌పేయి మేనియాను అడ్డుపెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావించారు. ఆ క్రమంలోనే తాను మతోన్మాద పార్టీగా అభివర్ణించిన బీజేపీతో 1999 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా వాజ్‌పేయిపై వ్యక్తమైన సానుభూతి వల్ల చంద్రబాబు రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చారు. 2004 ఎన్నికల్లోనూ బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మతోన్మాద బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పిదం చేశామన్నారు. పార్టీకి మైనార్టీలు దూరం కావడం ఓటమికి కారణమైందని, భవిష్యత్‌లో ఆ పార్టీతో జట్టుకట్టేదే లేదని స్పష్టీకరించారు.
2009 ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడం కోసం చంద్రబాబు ఆడని నాటకం లేదు. చేయని వాగ్దానమూ లేదు. వామపక్షాలు, టీఆర్‌ఎస్‌తో కలిసి మహాకూటమిని ఏర్పాటుచేసినా.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనం ముందు నిలవలేకపోయారు. మహాకూటమి పేకమేడలా కూలిపోయింది. పదేళ్లుగా అధికారానికి దూరమైన చంద్రబాబుకు 2014 ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. దేశవ్యాప్తంగా నరేంద్రమోడీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఇదే తరుణంలో రాష్ట్రంలో టీడీపీ ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటోందని పలు సర్వేలు వెల్లడిస్తోండటం చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 1999 ఎన్నికల్లో వాజ్‌పేయి మేనియా తరహాలోనే.. 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ హవాను ఉపయోగించుకుని దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బాబు ఎత్తులు వేస్తున్నారు.
ఆ క్రమంలోనే బీజేపీతో పొత్తుపెట్టుకోవడానికి తహతహలాడుతున్నారు. టీడీపీతో పొత్తును బీజేపీ రాష్ట్రనేతలు వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మాత్రం ప్రయత్నాలను మానడం లేదు. ఒకవైపు బీజేపీతో పొత్తుకు అర్రులు చాస్తూనే.. మరో వైపు కుబేరులను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. 2009 ఎన్నికల్లో హిందూపురం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి, మూడో స్థానంలో నిలిచిన అంబికా లక్ష్మినారాయణ ఆర్థికంగా శక్తిమంతుడు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి విజయం సాధించాలన్న ఎత్తులు వేస్తోన్న చంద్రబాబు.. అంబికాను పార్టీలోకి ఆహ్వానించారు. హిందూపురం టీడీపీ టికెట్ కోసం వారి మధ్య భారీ స్థాయిలో ‘బేర’సారాలు సాగినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
‘బేరం’ కుదరడంతో ఆదివారం అంబికా సైకిలెక్కారు. చంద్రబాబుతో కుదిరిన ఒప్పందం మేరకు తనకే టికెట్ దక్కుతుందని ధీమాగా చెబుతున్నారు. అంబికాను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీకి చంద్రబాబు షాక్ ఇచ్చారనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లోనే బలంగా వ్యక్తమవుతోంది. అంబికాకు పార్టీ తీర్థం ఇవ్వడంపై అబ్దుల్‌ఘనీ సైతం మండిపడుతున్నారు. తనకు టికెట్ ఇవ్వకపోతే రెబల్‌గా బరిలోకి దిగుతానని తన సన్నిహితుల వద్ద స్పష్టీకరిస్తున్నారు.
మైనార్టీలకు చోటేదీ?!
Published Mon, Jan 27 2014 2:53 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement