
సాక్షి, తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటి కుటుంబానికి వారం రోజుల్లో న్యాయం చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న హామీ ఇచ్చారు. 2015 ఆగస్టు 9న, ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో తిరుపతికి చెందిన మునికోటి ఏపీ ప్రత్యేక హోదాకోసం బలిదానానికి సిద్ధపడ్డాడు. ఒంటికి నిప్పంటించుకొని ఆత్మత్యాగం చేశాడు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం తరపున అప్పటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పందించారు. మృతుని కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించించారు.
అయితే ఈ హామీ కూడా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లాగే మరుగున పడిపోయింది. మునికోటి కుటుంబాన్ని ఆదుకోవాలన్న సంగతే మర్చిపోయారు. అయితే ఏళ్లు గడిచినా మునికోటి కుటుంబానికి పరిహారం అందకపోవడంపై సాక్షి మీడియా వరుస కథనాలు ప్రచురించింది. వీటిపై స్పందించిన నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, మునికోటి కుటుంబానికి తగిన న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వారం రోజుల్లో మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని, వారం రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment