
నగరి సమస్యలు పరిష్కరించరా?
► నియోజకవర్గ సమస్యలపై కలెక్టర్‌కి వినతి
► అధికారుల అవినీతి పెచ్చుమీరింది
► జన్మభూమి కమిటీలతో అర్హులకు
► అన్యాయం : ఎమ్మెల్యే రోజా
తిరుపతి తుడా: నగరి నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారని, సమస్యలు పరిష్కరించకపోవడం అన్యాయమని ఎమ్మెల్యే రోజా, కలెక్టర్ సిద్ధార్థ జైన్ దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సిద్ధార్థజైన్‌ను నగరి నియోజక వర్గ రైతులతో పాటు ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరి నియోజక వర్గంలో సమస్యలు తాండవిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజక వర్గ సమస్యలు పరిష్కరించరా? అని ప్రశ్నించారు. విజయపురం తహశీల్దార్ అవినీతి పెచ్చుమీరిందని ఫిర్యాదు చేశారు. భూ ఆక్రమణలకు అక్రమంగా క్వారీల అనుమతులు ఇస్తున్నారని ఆమె చెప్పారు. జన్మభూమి కమిటీలతో గతంలో మాదిరే అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు.
సర్పంచ్‌ల సంతకం లేకుండా జన్మభూమి కమిటీలు పాలనలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. నగరి, పుత్తూరులో ఉన్న వంద పడకల ఆస్పత్రులు అంకారప్రాయంగా మిగిలాయన్నారు. రోగులకు మౌలిక వసతులు, నగరి ఆస్పత్రికి రోడ్డులేదన్నారు. కరెంట్‌బిల్లులు కట్టలేదని, అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ కట్ చేయడంతో చిన్నపిల్లలు ఉక్కపోతతో అల్లాడుతున్నారని చెప్పారు. గాలేరు-నగరి సీతారామపురం ప్రాజెక్ట్ కారణంగా భూములు కోల్పోయిన 14 మంది రైతులకు పరిహారం చెల్లించలేదని చెప్పారు. వీరితో పాటు నగరి - పుత్తూరు ప్రాంతంలో రోడ్లు విస్తరణ కారణంగా ఇండ్లు కోల్పోయిన వారికి ఇంత వరకు పరిహారం ఇవ్వలేదని ఆమె చెప్పారు.
ఇలా నియోజక వర్గంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, అధికారులు స్పందించడం లేదని తెలిపారు. తక్షణం సమస్యలను పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేయడంతో కలెక్టర్ సిద్ధార్థ జైన్ సానుకూలంగా స్పందించారు.