
ప్రశ్నిస్తానన్న మొనగాడు ఎక్కడ?
కాకినాడ: కాపులను సీఎం చంద్రబాబు మోసం చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిలదీశారు. గురువారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా ప్లీనరీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘ప్రశ్నిస్తానన్న మొనగాడు ఎక్కడికి వెళ్లాడు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌ని చెప్పుకున్న పెద్ద మనిషి జీఎస్టీ భారం గురించి ఎందుకు నోరు మెదపడం లేదు. లబ్బర్ సింగో, గబ్బర్ సింగో ఆయనే తేల్చుకోవాలి. ప్రజల శ్రేయస్సే ముఖ్యమనుకుంటే ప్రభుత్వాలను నిలదీయాల’ని అన్నారు.
గిరిజనుల అనారోగ్యంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్.. టీడీపీ ఎమ్మెల్యేనో, బీజేపీ ఎమ్మెల్యేనో అర్థం కావడం లేదని రోజా వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం కొండలు ఎక్కుతారు కానీ గిరిజనులకు నీళ్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. మంత్రి యనమల రామకృష్ణుడిని విషంపూసిన కత్తిగా వర్ణించారు. ప్రజలు ఛీత్కరించినా దొడ్డిదారిన మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు.