జీవధారలు పొంగే ‘తూరుపు’ సీమల్లో ఆవేదనల చీకట్లు అలముకున్నవేళ.. వెలుగులు పంచే సూర్యుడిలా ఆయన అడుగు పెట్టారు. మంచిని పెంచి.. గట్టిమేలు తలపెట్టే మహత్తర సంకల్పంతో అలుపెరుగని పయనం సాగించారు. ముసిముసి నవ్వుల మాటున మరుగుతున్న విషం నింపుకొన్న పాలకులు.. నీతి లేని రీతిలో సాగిస్తున్న పాలనపై రణశంఖం పూరించారు. గోబెల్స్‌ను తలదన్నేలా సాగుతున్న అబద్ధపు ప్రచారపు నివురుగప్పిన జనచైతన్యాన్ని రగుల్కొలిపి, అణగారిన బతుకుల్లో ఆశల అరుణకిరణమై భాసించారు.వ్యథార్థ జీవితాల్లో ‘పండగలా దిగివచ్చిన’ ఆ జనహితుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ‘తూర్పు’ ప్రజలు జేజేలు పలికారు. ఆయన ప్రజాసంకల్ప యాత్ర సాగిన ప్రతిచోటా వరద గోదారిలా ఉప్పొంగారు. గుండె లోతుల్లోంచి పొంగుకొచ్చిన అభిమానాన్ని కురిపించారు. తూర్పు గోదావరే.. ‘మార్పు’ గోదావరి అవుతుందని చాటి చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో మహోజ్జ్వలంగా సాగిన ఈ పాదయాత్రనేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తున్న సందర్భంగాజిల్లాలో సాగిన ఆ జనసారథి అడుగుజాడలివిగో..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అరాచకాలు, అక్రమాలు, అవినీతి వేయితలల రక్కసిలా వికటాట్టహాసం చేస్తున్న వేళ.. పీడిత ప్రజల గుండెల్లో ధైర్యం నింపి, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, భరోసా కల్పించే లక్ష్యంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర గత ఏడాది జూన్ 12 నుంచి ఆగస్ట్ 14 వరకూ జిల్లాలో జరిగింది. తమకోసం అలుపెరుగని పాదయాత్ర సాగిస్తున్న ఆ ధీరుడి వెంట జిల్లాలో వేలాదిగా అడుగులు కదిలాయి. పాదయాత్ర పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు బారులు తీరి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన నడిచిన ప్రతి దారిలోనూ జనగోదారి పరవళ్లు తొక్కింది. ప్రతి బహిరంగ సభకూ ఇసుక వేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. ఆ జన నాయకుడికి జిల్లావ్యాప్తంగా బ్రహ్మరథం పట్టారు.
జిల్లాలో జగన్ సాగించిన ఈ పాదయాత్ర ఓ ప్రభంజనంలా సాగింది. ఓవైపు ఘనస్వాగతం పలికిన జనం.. మరోవైపు తమ సమస్యలు వినే నాయకుడు వచ్చాడంటూ తరలివచ్చిన బాధిత ప్రజలు.. ఇలా ఆయన ఎక్కడ కాలు మోపినా జనకోలాహలమే. సమస్యలతో సతమతమవుతన్న వారందరూ ఆయనకు బాధలు చెప్పుకొని ఉపశమనం పొందారు. అధికారం అండతో పేట్రేగిపోతున్న పాలకుల దుర్మార్గాలను, అవినీతిని, నిర్లక్ష్య పాలనను నడిరోడ్డుపై జగన్ నిగ్గదీసినప్పుడు జనం పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పలికారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతల వరకూ ఏవిధంగా అవినీతికి పాల్పడ్డారో పూర్తి ఆధారాలతో ఆయన చెప్పినప్పుడు అక్రమార్కుల పాలనకు చరమగీతం పాడతామంటూ ప్రతినబూనారు. ఇన్నాళ్లూ తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోయిన బాధితులు అన్నొచ్చాడు.. అండగా ఉంటానని హామీ ఇచ్చాడని ఊరట చెందారు.
జూన్ 12న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్డు కం రైల్ వంతెన మీదుగా రాజమహేంద్రవరం నగరంలోకి ప్రజాసంకల్ప యాత్ర ప్రవేశించింది. అఖండ గోదావరిపై చారిత్రాత్మకంగా నిలిచిపోయేవిధంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం లభించింది. లక్షలాదిగా జనాలు తరలివచ్చి ‘తూర్పు’లోకి తమ ప్రియనేతను తోడ్కొని వచ్చారు. కోనసీమలోని పచ్చని పల్లెలు, తూర్పు డెల్టా, మెట్ట ప్రాంతాల మీదుగా ఆయన తన పాదయాత్ర సాగించారు. ఏజెన్సీకి సమీపాన ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్భేద్యమైన కొండల మధ్య కూడా పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో ఎన్నో ప్రధాన మజిలీలను అధిగమించారు. 2,400, 2,500, 2,600, 2,700 కిలోమీటర్ల మజిలీలను ఈ జిల్లాలోనే దాటి చరిత్ర సృష్టించారు. జిల్లా చరిత్రలో ఈ పాదయాత్ర అరుదైన ఘట్టంగా నిలిచిపోయింది. ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా జిల్లాలో 15 చోట్ల బహిరంగ సభలు జరిగాయి. ప్రతిచోటా జగన్ ప్రసంగాన్ని వినేందుకు జనం పోటెత్తారు. బహిరంగ సభలు జరిగిన ప్రాంతాలన్నీ మునుపెన్నడూ లేనివిధంగా జనంతో కిక్కిరిసిపోయాయి. ఇది జిల్లా రాజకీయాల్లో పెను సంచలనమే అయ్యింది. వెల్లువలా తరలివచ్చిన జనాలను చూసి ప్రభుత్వ నిఘావర్గాలు సహితం ఆశ్చర్యపోయాయంటే ప్రజాసంకల్ప యాత్రలో జనగోదారి ఏవిధంగా ఉప్పొంగిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రధాన మజిలీలివీ..
⇔ జూన్ 12 : పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశం.
⇔ జూన్ 22 : రాజోలు నియోజకవర్గంలో2,400 కిలోమీటర్లు పూర్తి.
⇔ జూన్ 27 : అమలాపురం నియోజకవర్గంలో 200 రోజుల పాదయాత్ర పూర్తి.
⇔ జూలై 9 : మండపేట నియోజకవర్గంలో 2,500 కిలోమీటర్లు పూర్తి.
⇔ జూలై 22 : కాకినాడ రూరల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మత్స్యకారులకు జగన్ ప్రత్యేక హామీలు ఇచ్చారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, డీజిల్‌పై సబ్సిడీ పెంచుతానని, కొత్త బోట్లకూ రిజిస్ట్రేషన్ చేయిస్తామని, ఫిషింగ్ హాలిడే సమయంలో ఇస్తున్న రూ.4 వేలను రూ.10 వేలకు పెంచుతామని, ప్రమాదవశాత్తూ మరణించే మత్స్యకారుని కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, మత్స్యకార మహిళలకు 45 ఏళ్లకే పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు.
⇔ జూలై 28 : జగ్గంపేట నియోజకవర్గంలో 2,600 కిలోమీటర్లు పూర్తి.
⇔ ఆగస్ట్ 7 : చేనేత కార్మిక దినోత్సవం రోజున శంఖవరంలో చేనేత కార్మికులతో మమేకమయ్యారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు.
⇔ ఆగస్ట్ 11 : తునిలో 2,700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి.
Comments
Please login to add a commentAdd a comment