
అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 230వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత సోమవారం ఉదయం శంఖవరం మండలం నెల్లిపూడి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి శ్రీ శాంతి ఆశ్రమం క్రాస్ వరకు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు.
లంచ్ బ్రేక్ అనంతరం మధ్యాహ్నం 02:45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి శంఖవరం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 229వ రోజు ముగిసింది. ఆదివారం ఉదయం పత్తిపాడు నియోజకవర్గంలోని వినాయక్ నగర్ క్రాస్ రోడ్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. జననేత ఆదివారం ప్రజాసంకల్పయాత్రలో 6.4 కిలోమీటర్లు నడిచారు. దీంతో వైఎస్ జగన్ ఇప్పటివరకు 2656.1 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.