కన్నీటి రైతుకు ఏదీ ఊరట?
వ్యవసాయ బడ్జెట్‌పై అసెంబ్లీలో ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్న వ్యవసాయాన్ని గట్టెక్కించే కేటాయింపులు రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్‌లో మచ్చుకైనా కన్పించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి అమరావతిపై ఉన్న శ్రద్ధ పత్తిరైతుపై లేదని విమర్శించారు. శాసనసభలో మంగళవారం వ్యవసాయ బడ్జెట్‌పై ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండేళ్లుగా తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, జీవ నదులు అడుగంటి సాగు పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు.
ఆహారధాన్యాల దిగుబడి గతేడాదికన్నా 22 లక్షల టన్నులు తగ్గడం రైతు దయనీయ పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 500 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్నా, కరువు మండలాలుగా 354 మండలాల్నే గుర్తించడం శోచనీయమన్నారు. బడ్జెట్ సైజు పెరిగిందని చెప్పే ప్రభుత్వం.. వ్యవసాయానికి కేవలం 6.82 శాతమే కేటాయించిందని, నీటిపారుదలకు 7.1 శాతమే ప్రతిపాదించిందని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.