ప్రతిపాదనల పరిస్థితేమిటో? | MLAs Proposals to Center on Bifurcation bill | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనల పరిస్థితేమిటో?

Published Sun, Jan 12 2014 1:35 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

MLAs Proposals to Center on Bifurcation bill

విభజన బిల్లు సవరణలపై నేతల్లో చర్చ
కిరణ్, బాబు సవరణలివ్వకపోవడం ఇబ్బందే!
ఓటింగ్ జరిపినా కేంద్రం, రాష్ట్రపతి పట్టించుకునేనా?
సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతల్లో తర్జనభర్జన

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై ఆయా పార్టీల ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన సవరణలపై కేంద్రం ఏ మేరకు స్పందిస్తుంది? మెజారిటీ సభ్యులు వ్యతిరేకించినంత వూత్రాన బిల్లును వెనక్కు తీసుకుంటుందా? బిల్లులోని కొన్ని అంశాలకే పరిమితవువుతూ సవరణలిస్తే, అది మొత్తం బిల్లును వ్యతిరేకించినట్టు అవుతుందా? మెజారిటీ సభ్యులు సవరణలు ప్రతిపాదిస్తే పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి, పార్లమెంటు నిలిపివేసే అవకాశవుుందా? ఇలాంటి పలు అంశాలపై ప్రజాప్రతినిధుల మధ్య  చర్చలు సాగుతున్నాయి. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మెజారిటీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తే రాష్ట్రపతి దానిపై పునరాలోచన చేస్తారని కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పలుసార్లు చెప్పడం, చర్చలో అందరూ పాల్గొనాలని సూచించడం తెలిసిందే. అయితే ఏకమొత్తంగా బిల్లునే వ్యతిరేకించేలా సవరణలు ప్రతిపాదించే బదులు, కీలకమైనవంటూ 12 క్లాజులపైనే కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు. ఆ క్లాజుల్లోని లోపాలను ఎత్తి చూపుతూ, వాటిని తొలగించాలంటూ సవరణలు ప్రతిపాదించారు.
 
 బిల్లులోని ప్రతి క్లాజునూ తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. టీడీపీ సీమాంధ్ర నేతలు పలు క్లాజులను తొలగించాలని, మరికొన్నింటిని సవరించాలని ప్రతిపాదించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులంతా అభిప్రాయాలతో సరిపుచ్చారు. టీఆర్‌ఎస్‌తో సహా అందరూ  సలహాలు మాత్రమే ఇచ్చారు. కాకపోతే అతి కీలకమైన ఈ అంశంలో కిరణ్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎలాంటి సవరణలూ ప్రతిపాదించకపోవడం తెలిసిందే. ఈ సవరణలపై ఓటింగ్‌కు ఆస్కారం లేదని, ఒకవేళ నిర్వహించినా సభా నాయకుడైన ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సవరణలు ప్రతిపాదించని కారణంగా ఓటింగ్ ఫలితాన్ని రాష్ట్రపతి గానీ, కేంద్రం గానీ పరిగణనలోకి తీసుకోకపోవచ్చని సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో పలు రాష్ట్రాల విభజన సవుయుంలో ప్రతిపాదించిన సవరణలను కేంద్రం పట్టించుకోలేదని వారు గుర్తు చేస్తున్నారు.
 
 బీహార్, యూపీల్లో పట్టించుకోలేదు:  ఉత్తరాఖండ్ ఏర్పాటు బిల్లుపై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 33 సవరణలు ప్రతిపాదించారు. వాటిలో 29 ప్రభుత్వానివి కాగా, 4 విపక్షాలవి. అయితే అసెంబ్లీ ఆమోదించిన ఆ సవరణల్లో ఒక్కదాన్ని కూడా కేంద్రం ఆమోదించలేదు. జార్ఖండ్ ఏర్పాటు బిల్లుపై బీహార్ అసెంబ్లీలో ఏకంగా 371 సవరణలను ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. వాటిలో కొన్నింటిని అసెంబ్లీయే వుూజువాణి ఓటుతో ఆమోదించి, మరికొన్నింటిని తిరస్కరించింది. అయితే సభ ఆమోదించిన వాటిని కూడా కేంద్రం పట్టించుకోలేదు. పైగా బీహార్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని కూడా తిరస్కరించింది.
 
 అత్యంత విలువైన భూగర్భ వనరులు, అడవులున్న ప్రాంతం జార్ఖండ్‌కు వెళ్లడం వల్ల బీహార్ భారీ ఆదాయూన్ని కోల్పోనుందని, అందుకు పరిహారంగా కేంద్రం రూ.1.79 లక్షల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించినా ఇప్పటికీ రాష్ట్రానికి నయూ పైసా కూడా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని మొత్తం 108 క్లాజులపైనా ఆయా పార్టీల నుంచి స్పీకర్‌కు సవరణ విజ్ఞప్తులు అందాయి. మొత్తంమీద వందల కొద్దీ సవరణలు ప్రతిపాదించినా యూపీ, బీహార్ ఉదంతాల తరహాలోనే వాటన్నింటినీ కేంద్రం తిరస్కరించే ఆస్కారమే ఎక్కువని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభిప్రాయుపడుతున్నారు. ‘‘సీఎం ఉదాహరించిన యూపీ, బీహార్ విభజన బిల్లుల పై కేంద్రం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు. అయినా మన బిల్లును రాష్ట్రపతి అడ్డుకుంటారనో, పార్లమెంటు ఆమోదించదనో కిరణ్ ఎందుకు చెబుతున్నారో తెలియడం లేదు. నిజంగా సవరణలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందన్న నమ్మకమే గనక కిరణ్, బాబులకు ఉంటే సవరణలు ఎందుకు కోరలేదన్న ప్రశ్న తలెత్తుతోంది’’ అని వారంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement