
శక్తివంచన లేకుండా కృషిచేస్తా!
♦ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు
♦ ఎమ్మెల్సీగా ధ్రువీకరణ పత్రం అందుకున్న ఉమ్మారెడ్డి
గుంటూరు ఈస్ట్ : పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఏ విశ్వాసంతో నిలబెట్టారో, దానిని సాకారం చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషిచేస్తానని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తల నడుమ ఉమ్మారెడ్డి జేసీ-1 సీహెచ్ శ్రీధర్ నుంచి ఎమ్మెల్సీగా ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మొహమ్మద్ ముస్తఫా, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము)లతో పాటు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.
ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్న అనంతరం ఉమ్మారెడ్డి మాట్లాడుతూ తాను ఎకగ్రీవంగా ఎన్నిక కావడానికి జిల్లాలో సహకరించిన పార్టీ ఎమ్యెల్యేలు,జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.జిల్లాలో అందరితో కలిసి పార్టీని ముందుకు తీసుకు వెళ్లేందుకు కష్టించి పని చేస్తానన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి శాసన మండలిలో ఉండడం వలన ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయ వచ్చన్నారు.
మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ విలువలు నశించిన నేటి రాజకీయాలలో ఉమ్మారెడ్డి వంటి విలువలు కలిగిన నేతలు ప్రజా ప్రతినిధులవడం హర్షణీయమన్నారు. నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మారెడ్డి ఎన్నికవడం మంచి పరిణామమన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్‌ముస్తఫా మాట్లాడుతూ ఉమ్మారెడ్డి అనుభవం ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), పలు విభాగాల నేతలు కావటి మనోహర్‌నాయుడు, మెట్టు వెంకటప్పారెడ్డి, కిలారి రోశయ్య, సయ్యద్‌మాబు, కొత్తా చిన్నపరెడ్డి, మొగిలి మధు, ఉప్పుటూరి నర్సిరెడ్డి, బండారు సాయిబాబు, పానుగంటి చైతన్య, నగర యువత అధ్యక్షుడు ఎలికా శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మారెడ్డికి అభినందనల వెల్లువ
పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అభినందనలు వెల్లువెత్తాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నిక జేసీ-1 శ్రీధర్ చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్న అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఉమ్మారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం పార్టీ ఎస్టీ, సేవాదళ్ విభాగాల అధ్యక్షులు మొగిలి మధు, కొత్తా చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో గజమాల, పూలకిరీటంతో ఉమ్మారెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పలు విభాగాల నేతలు మెట్టు వెంకటప్పారెడ్డి, కిలారి రోశయ్య, సయ్యద్‌మాబు, ఉప్పుటూరి నర్సిరెడ్డి, మండేపూడి పురుషోత్తం, యనమాల ప్రకాష్, ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు.
రేపు ఉమ్మారెడ్డికి అభినందన సభ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏక గ్రీవంగా విజయం సాధించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఈ నెల 21న అభినందన సభ నిర్వహిస్తున్నట్టు పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి రాజశేఖర్ తెలిపారు. అరండల్ పేటలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10 గంటలకు కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో జరిగే అభినందన సభా కార్యక్రమానికి పార్టీ నేతలు, అన్ని విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు తప్పకుండా హాజరుకావాలని సూచించారు.