టీడీపీకి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా
కర్నూలు : టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలు, అనుచరుల సూచనలతో ఆయన అధికార తెలుగుదేశం పార్టీకి బుధవారం అధికారికంగా రాజీనామా చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. శిల్పా చక్రపాణిరెడ్డి రేపు (గురువారం) నంద్యాల బహిరంగ సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయన హైదరాబాద్ బయల్దేరారు.
కాగా శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులతో శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాలలోని తన నివాసంలో నిన్న సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ మారుదామని కార్యకర్తలంతా మూకుమ్మడిగా ఒకేమాట తేల్చిచెప్పారు. టీడీపీ కోసం మనమంతా కష్టపడుతుంటే, నిన్నా మొన్న వచ్చిన నేతలకు పెద్దపీట వేశారని మండిపడ్డారు. టీడీపీలో అవమానాలే ఎదురయ్యాయని, ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడే ఉందామని అన్నారు. శిల్పా చక్రపాణిరెడ్డితో కలిసి నడుస్తామని వారంతా స్పష్టం చేశారు.