టీడీపీకి శిల్పా చక్రపాణిరెడ్డి గుడ్‌బై?
సీఎం చంద్రబాబుకు వాడుకుని వదిలేయడం మొదటి నుంచీ అలవాటేనని, మన విషయంలోనూ అదే జరిగిందని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం మరోసారి తన తమ్ముడు చక్రపాణిరెడ్డిని కలిశారు. ఉప ఎన్నికలో తనకు సహకరించాలని కోరారు. మరోవైపు చక్రపాణిరెడ్డిని బుజ్జగించేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఎ.వి.సుబ్బారెడ్డి కూడా శిల్పా చక్రపాణిరెడ్డితో భేటీ అయ్యారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు శిల్పా చక్రపాణిరెడ్డి తన భవిష్యత్ నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
టీడీపీలో అన్నీ అవమానాలే...
శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులతో శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాలలోని తన నివాసంలో మంగళవారం సమావేశమయ్యారు. బండి ఆత్మకూరు, మహానంది, వెలుగోడు, ఆత్మకూరు, శ్రీశైలం మండలాల కార్యకర్తల అభిప్రాయాలను విడివిడిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మారుదామని కార్యకర్తలంతా మూకుమ్మడిగా ఒకేమాట తేల్చిచెప్పారు. టీడీపీ కోసం మనమంతా కష్టపడుతుంటే, నిన్నా మొన్న వచ్చిన నేతలకు పెద్దపీట వేశారని మండిపడ్డారు. టీడీపీలో అవమానాలే ఎదురయ్యాయని, ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడే ఉందామని అన్నారు. శిల్పా చక్రపాణిరెడ్డితో కలిసి నడుస్తామని వారంతా స్పష్టం చేశారు.
వేడెక్కిన నంద్యాల రాజకీయం
టీడీపీని వీడాలని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి నిర్ణయించుకోవడంతో ఆ పార్టీలో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. పార్టీ నుంచి బయటకు వెళ్లొదంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే, కార్యకర్తల అభిప్రాయం మేరకు టీడీపీని వీడి, వైఎస్సార్‌సీపీలో చేరాలని శిల్పా చక్రపాణిరెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో నంద్యాల రాజకీయం మరింత వేడెక్కింది.