నంద్యాల విజయాన్ని జగన్‌కు కానుకగా ఇస్తాం
ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టీకరణ... నేడు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక విజయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇస్తామని ఎమ్మెల్సీ శిల్పా చక్రపా ణిరెడ్డి చెప్పారు. అధికార తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశానని ప్రకటించారు. ఈ సమాచారాన్ని ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధిష్టానానికి పంపినట్లు వెల్లడించారు. నేడు (గురువారం) నంద్యాల బహిరంగ సభలో శ్రీశైలం నియోజకవర్గ నాయకుల తో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నామ ని తెలిపారు. చక్రపాణిరెడ్డి బుధవారం నంద్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో చాలా అవమానకర పరిస్థితులు, ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
‘‘టీడీపీలో రెండేళ్ల పాటు పలు హోదాల్లో పనిచేశా. ప్రతి గ్రామంలో పేరు పెట్టి పిలిచే విధంగా సంబంధాలు ఏర్పర్చుకున్నా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేని పరిస్థితుల్లో నాకు అంతకంటే ఎక్కువ అధికారాలను ఇచ్చా రు. నా నాయకత్వంలో కర్నూలు జిల్లాలో ఎన్నికల్లో గెలిచాం. ఆ తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేశా. ఇప్పటివరకు టీడీపీలో చంద్రబాబు దగ్గర పనిచేశా. నేను ఎక్కడ పనిచేసినా ఆ పార్టీకి అంకితభావంతో సేవలందించా. టీడీపీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశా. నేను ఎవరి దగ్గర పనిచేసినా అంకితభావంతో, నిబద్ధతతోనే పనిచేశా.
రండి.. రాజీనామా చేసి తేల్చుకుందాం..
నా సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డి చీమకు కూడా హాని చేయని వ్యక్తి. మా అన్నకు దయాదాక్షిణ్యాలు ఎక్కువ. అటువంటి వ్యక్తిపై విమర్శలు చేస్తారా? నంద్యాలను అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు. మీరు(టీడీపీ) ఏం అభివృద్ధి చేశారు? మేం లాడ్జీల నుంచి డబ్బులు గుంజలేదు, తుపాకులతో కాల్చలేదు. మేం చీమను కూడా చంపలేదు. నంద్యాల విజయాన్ని వైఎస్ జగన్‌కు కానుకగా ఇస్తాం. నేను రాజీనామాకు సిద్ధం.రాజీనామా లేఖను జేబులోనే పెట్టుకొని తిరుగుతున్నా, అందరూ రండి రాజీనామా చేసి తేల్చుకుందాం.’’ అని శిల్పా చక్రపాణిరెడ్డి తేల్చిచెప్పారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జగన్‌తో శిల్పా చక్రపాణి భేటీ
టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్న కర్నూలు జిల్లా నేత ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కలిశారు. పార్టీలో చేరికకు సంబంధించి ఇరువురి మధ్య చర్చ జరిగిందని, టీడీపీకి రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను జగన్‌కు చక్రపాణిరెడ్డి వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నందున చక్రపాణిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరడానికి ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని జగన్ వివరించినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ మొదటి నుంచి ఉన్నతమైన విలువలతో కూడిన రాజకీయాలకే పెద్దపీట వేస్తుందని, పార్టీలో ఎవరు చేరినా అంతకుముందు ఉన్న పదవులకు రాజీనామా చేయడం సంప్రదాయమని జగన్ తెలిపినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి 2011లో వైఎస్సార్సీపీలో చేరడం, తిరిగి పోటీ చేసి గెలవడం వంటి అంశాలను ఆయన గుర్తు చేసినట్లు తెలిసింది.