మాట్లాడుతున్న కలెక్టర్ ధనంజయరెడ్డి ,మాట్లాడుతున్న సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి
శ్రీకాకుళం రూరల్: వైద్య వృత్తి పూర్తిచేసిన వారంతా సమాజంలో పేదల పట్ల సేవకుల్లా పనిచేయాలని ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి అన్నారు. ఏదైనా కొత్త వ్యాధి సోకితే దానిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసి నిర్ధారణ చేయాలని సూచించారు. శ్రీకాకుళం రూరల్ మండలంలో రాగోలు వద్ద ఉన్న జెమ్స్ వైద్య కళాశాలలో 2012–2018వ బ్యాచ్‌కు చెందిన సుమారు 90 మంది వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేశారు. కళాశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన కీరవాణి మాట్లాడుతూ తను పెంచుకున్న అమ్మాయికి ఒక వ్యాధి సోకిందని దానిపై తన భార్య స్టడీచేసిందని ఈ సందర్భంగా తెలిపారు. ఇంటర్మీడియెట్ వరకే చదువుకున్నానని, ఈ కార్యక్రమంలో తనకు గ్రాడ్యూయేట్‌గా గౌరవించడం చాలా ఆనందంగా ఉందన్నారు. వైద్యవృత్తి చేపట్టిన వారిలో డాక్టర్ బొల్లినేని భాస్కర్‌తో పాటు రామోజీరావు అంటే తనకు చాలా ఇష్టమన్నారు. జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ప్రస్తుతం ఎన్‌టీఆర్ వైద్యసేవగా ప్రజలకు సేవలందించడం అభినందనీయమన్నారు.
అప్పట్లో ఆరోగ్యశ్రీను ప్రవేశపెట్టిన సమయంలో దాని విధివిధానాలను బొల్లినేని భాస్కరరావుతో డిజైన్ చేయడం చాలా గొప్ప విషయమన్నారు. అదేవిధంగా జెమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలందరికీ వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి సీఈవో చీఫ్ మెంటర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడుతూ త్వరలోనే టెలీ మెడిషన్ సేవలు నలబై కేంద్రాల్లో తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వీటిని త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తమ బొల్లినేని మెడిస్కిల్స్ ద్వారా జిల్లాలో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, సంవత్సరానికి 5 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా బొల్లినేని మెడిస్కిల్స్ పనిచేస్తోందన్నారు. అనంతరం వైద్య విద్యార్థులకు కలెక్టర్ ధనంజయరెడ్డి, ఎంఎం కీరవాణి చేతులుమీదుగా పట్టాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జెమ్స్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి పద్మజ, డైరెక్టర్ డాక్టర్ అంబేడ్కర్, సూపరింటెండెంట్ గిరిధర్‌గోపాల్, బొల్లినేని ఆస్పత్రుల సీఈవోలు అద్విక్, రామ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.
చాలా ఆనందంగా ఉంది
మాది కేరళ రాష్ట్రం. ఎంసెట్ కోసం విజయవాడలో కోచింగ్ తీసుకున్నాను. జెమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేయడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ప్రజలకు సేవచేసేందుకు ముందంజలోనే ఉంటాను. జనరల్ ఫీజీషియన్ కావడమే నా లక్ష్యం. – జార్జ్ టిసా, వైద్య విద్యార్థిని, కేరళ, జెమ్స్ వైద్య కళాశాల
ఆర్దోపెడిక్ సర్జన్ కావాలని ఉంది
మాది శ్రీకాకుళంలోని పొందూరు గ్రామం. ఐదు సంవత్సరాల పాటు జెమ్స్ వైద్య కళాశాలలో చదివి ఎంబీబీఎస్ పూర్తిచేయడం చాలా ఆనందంగా ఉంది. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు నా వైద్య సేవలందిస్తాను. ఆర్దోపెడిక్ సర్జన్ కావడమే నా లక్ష్యం.– పి.సుమన్ చంద్ర, శ్రీకాకుళం,జెమ్స్ వైద్య కళాశాల
Comments
Please login to add a commentAdd a comment