రిమ్స్ క్యాంపస్:రిమ్స్ ఆస్పత్రిలో వైద్యసేవల తీరు ఎప్పటికప్పుడు ఏదో రకంగా చర్చనీయాంశమవుతోంది. వైద్యులు అందుబాటులో లేకపోవటం.. సిబ్బంది రోగులను పట్టించుకోకపోవటం.. విశాఖపట్నం నుంచి వైద్యులు రాకపోకలు సాగించటం.. వంటి అంశాలు ఆస్పత్రి ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. తాజాగా రిమ్స్ మెటర్నిటీ విభాగంలో జరుగుతున్న వసూళ్ల పరంపర హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఇద్దరు స్టాఫ్‌నర్సుల అండదండలతో సాగుతున్న ఈ వసూళ్ల తంతు మిగిలిన నర్సులకు, సిబ్బందికి చెడ్డపేరు తెస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు ఖర్చుపెట్టి ప్రసవం చేయించలేక ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేదవారి నుంచి ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తున్నారు. ప్రసవం జరిగి ఆపరేషన్ థియేటర్ నుంచి బిడ్డను బయటకు తెచ్చినప్పుడే వసూళ్ల పర్వం మొదలవుతుంది. ఆడబిడ్డ అయితే రూ.600, మగ బిడ్డ అయితే రూ.1000 వెంటనే బొడ్డు తాడు మీద పెట్టాల్సిందే.
లేకుంటే బొడ్డుతాడు కోసే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. అంత ఇచ్చుకోలేం.. కొంచెం తగ్గించమని ఎవరైనా ప్రాధేయ పడితే చాలు.. మీకు తగ్గిస్తే మిగతా వారూ అంతే ఇస్తారు.. తగ్గించడం కుదరదని మొహం మీద కొట్టినట్లు చెప్పేస్తారు. అక్కడితో అగకుండా ‘ప్రైవేటు ఆస్పత్రుల్లో వేలకు వేలిచ్చి ప్రసవాలు చేయించుకుంటారు.. ఇక్కడ వెయ్యి రూపాయలు ఇవ్వటానికి గింజుకుంటారేంటి’.. అంటూ పెద్దపెద్ద అరుపులతో రంకెలు వేస్తారు. దీంతో బిక్కచచ్చిపోయిన పేదలు అప్పోసప్పో చేసి ముడుపులు సమర్పించి బిడ్డలను తీసుకెళుతున్నారు. ఆలస్యంగా తెలిసిన సమాచారం ప్రకారం.. కొన్నాళ్ల కిందట పాలకొండకు చెందిన ఓ వీఆర్‌ఎ తన కుమార్తెను రిమ్స్‌లో చేర్పించారు. ఆడపిల్ల పుట్టడంతో రూ.600 ఇవ్వాలని ఎఫ్.ఎన్.ఓలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడినా వినలేదు. ఇంటికి వెళ్లి మరుసటి రోజు తెచ్చిస్తానని చెప్పినా వినలేదు. దాంతో అప్పటికప్పుడు పాలకొండ వెళ్లి తన కూతురి చెవి దుద్దులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది.
ఆ ఇద్దరే సూత్రధారులు
ఈ వసూళ్ల పరంపరకు ఇద్దరు స్టాఫ్ నర్సులు సూత్రధారులని తెలిసింది. విశాఖపట్నం నుంచి వస్తున్న ఓ స్టాఫ్ నర్సు ఈ వసూళ్ల ‘జ్యోతి’కి అంకురార్పణ చేయగా.. ఓ యూనియన్ నాయకుడి కుమార్తె అయిన మరో స్టాఫ్‌నర్సు వసూల్ల జ్యోతి ఆరిపోకుండా యథాశక్తి ఆజ్యం పోస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఎఫ్.ఎన్.ఓలతో కలిసి వీరు ఈ దందా నడుపుతున్నట్టు సమాచారం. వసూళ్లలో వీరికీ వాటా ఇస్తున్నారు. ఎఫ్.ఎన్.ఓలు డబ్బులడిగినప్పుడు ఎవరైనా ఇవ్వకపోతే, వీరు రంగ ప్రవేశం చేస్తారు. వారికి జీతాలు సరిగ్గా రావు.. అంటూ ఏవేవో చెప్పి ఒప్పిస్తారు. అప్పటికీ వినకపోతే కేకలు మొదలుపెడతారు, కాగా ఇద్దరు స్టాఫ్‌నర్సులు చేస్తున్న తప్పులతో అందరికీ చెడ్డపేరు వస్తోందని, మిగిలిన స్టాఫ్ నర్సులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని అడ్డుకోవడానికి వారు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
వసూళ్ల బాగోతం నా దృష్టికి వచ్చింది
రిమ్స్ మెటర్నటీ విభాగంలో ఆడపిల్లకు ఇంత, మగపిల్లాడికింతా అని డబ్బులు వసూలు చేస్తున్న విషయం నా దృష్టికొచ్చింది. డబ్బులు వసూలు చేయటం సరికాదు. దీనిపై విచారణ జరుపుతాం. వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతాం.
- టి.జయరాజ్, రిమ్స్ డెరైక్టర్
డబ్బు పెడితేనే.. బొడ్డుతాడు కోస్తాం!
Published Sun, Nov 23 2014 3:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement