హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ పలు పేద కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఎంతో మంది బడుగుబలహీన వర్గాలకు చెందిన ప్రతిభావంతులను ప్రభుత్వ ఉద్యోగులుగా నిలిపింది. వీరిలో శ్రీకాకుళం జిల్లా బైరి సారంగపురానికి చెందిన అల్లు లోకేశ్వరరావు అనే యువకుడు కూడా ఉన్నాడు. కాగా జిల్లాలోని గంగిరెడ్ల కులుస్తుల్లో ఇంతవరకు ఏ ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించలేదు. ప్రస్తుతం లోకేశ్వరరావు సచివాలయ ఉద్యోగం సాధించడం ద్వారా ఆ లోటును తీర్చాడు. గ్రామ సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. చిన్నతనంలోనే తండ్రి మరిడయ్య మరణించగా.. తల్లి మరిడమ్మ లోకేశ్వరరావును కష్టపడి చదివించింది. ఈ నేపథ్యంలో తల్లి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సర్కారు కొలువు సాధించిన లోకేశ్వరరావుతో పాటు అతడి తల్లిని గంగిరెడ్ల కులస్తులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాను సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని లోకేశ్వరరావు తెలిపాడు.
ఈ విషయం గురించి లోకేశ్వరరావు మాట్లాడుతూ.. ‘ నేను సంచార జాతికి చెందిన వ్యక్తిని. అనకాపల్లెలో బీటెక్ చదువుతున్నాను. ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నిజానికి మా కమ్యూనిటీలో అక్షరాస్యతా శాతం చాలా తక్కువగా ఉంటుంది. అయితే నన్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనేది మా అమ్మ కోరిక. పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాను. మా అమ్మ కోరిక నెరవేర్చాను’ అని పేర్కొన్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించారని.. అయితే తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తాము గుడిసెల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపాడు.
కాగా లోకేశ్వరరావు స్ఫూర్తితో తమ జాతికి చెందిన యువత విద్యపై ఆసక్తి కనబరుస్తున్నారని గంగిరెద్దుల కమ్యూనిటీ జిల్లా ఉపాధ్యక్షుడు యెడపల్లి విశ్వానందం ఆనందం వ్యక్తం చేశారు. ‘ మా జాతికి చెందిన ఎంతో మంది యువకులు ప్రస్తుతం మెకానిక్, డ్రైవర్ తదితర పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఏడాదిలో మూడు నెలలు యాచిస్తాము. జనవరి నుంచి మార్చి వరకు యాచక వృత్తి ద్వారా సంవత్సరానికి సరిపడా ఆహారం(బియ్యం) సంపాదించుకుంటాము. ప్రభుత్వ ఉద్యోగాల్లో మాకు ప్రత్యేక కోటా కేటాయిస్తే లోకేశ్వరరావు వంటి ఎంతో మంది యువకులు వెలుగులోకి వస్తారు’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆంగ్ల దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment