ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: అదో మోడల్ స్కూల్.. ‘మేలి పండూ చూడు మేలిమై ఉండు.. పొట్టవిప్పీ చూడు పురుగులుండు’ అన్న చందాన పైకి అందంగా కనిపించే ఆ భవనం లోనికి వెళ్లి చూస్తేనే గాని అసలు సంగతి తెలియదు. కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ఈ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫారాలు లేవు. చదువు చెప్పేందుకు పూర్తిస్థాయి బోధనా సిబ్బంది లేరు. పాఠ్యపుస్తకాలు అంతకన్నా లేవు. పిల్లల్ని పాఠశాలకు చేర్చేందుకు సరైన రవాణా సౌకర్యం లేదు. అసంపూర్తిగా మిగిలిన తరగతి గదులు, చెత్తాచెదారంతో కూడిన పాఠశాల ప్లేగ్రౌండ్, నేలబారు చదువులే దర్శనమిస్తాయి. అదే బొంగ్లూర్‌లోని మో‘డల్’ స్కూల్.
ఆర్భాటంగా ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో జిల్లా విద్యా,సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పనా అభివృద్ధి సంస్థ దాదాపు రూ.3కోట్ల వ్యయంతో బొంగ్లూర్ సమీపంలో ఆదర్శ పాఠశాలను నిర్మించింది. ఈ ఏడాది జూన్ 26న రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతులమీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. రిజర్వేషన్ల ప్రకారం లాటరీ విధానంతో 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహించారు. ఒక్కో తరగతిలో 80మంది చొప్పున మొత్తం 320మందిని చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.
నత్తనడకన తరగతి గదుల నిర్మాణం..
మోడల్‌స్కూల్ ప్రారంభమై రెండునెలలు కావస్తున్నా ఇప్పటికీ తరగతి గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఫర్నిచర్ లేకపోవడంతో విద్యార్థులను ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చోబెడుతున్నారు. తరగతి గదుల్లోకి సరైన వెలుతురు కూడా రాకపోవడంతో ఆరుబయటే తరగతులు కొనసాగిస్తున్నారు. సరైన మైదానం కూడా లేకపోవడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు.
బోధన సిబ్బంది కొరత..
సరిపడా బోధనా సిబ్బంది లేకపోవడంతో ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రిన్సిపాల్‌తో సహా ప్రస్తుతం తొమ్మిది మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ) ఉన్నారు. ప్రతీ తరగతిని రెండు సెక్షన్లుగా విభజించి ప్రాథమికోన్నత విద్యార్థులకు ట్రైన్‌డ్ గ్యాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), ఉన్నత స్థాయి విద్యార్థులకు పీజీటీ సిబ్బంది బోధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీజీటీ సిబ్బంది లేక విద్యార్థులను సెక్షన్లుగా విభజించకుండా ఒక్కటే తరగతిలో చేర్చి పీజీటీలే పాఠాలు బోధిస్తున్నారు. మరోవైపు ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సైతం అందలేదు.
బస్సు తుస్సు.. నీటికి పోటీ..
స్కూల్‌కి వెళ్లాల్సిన విద్యార్థులు ప్రయాణ సదుపాయాల్లేక నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు ఆటోల్లో వెళ్తున్న విద్యార్థుల అవస్థల్ని పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఉదయం సాయంత్రం వేళల్లో బస్సు సౌకర్యాన్ని కల్పించారు. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో బస్సులు సరిగా రావడం లేదని.. వచ్చినా కిలోమీటరు దూరంలోనే వదిలేసి వెళ్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తాగునీటికి కటకట ఏర్పడింది. ప్రతిరోజూ మధ్యాహ్న భోజన సమయానికి ఐదు క్యాన్ల నీటిని కొనుగోలు చేస్తున్నారు. నీటికోసం విద్యార్థులు పోటీ పడాల్సి వస్తోంది.
సెక్యూరిటీ కరువు..
వందల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న పాఠశాలలో పరిసరాలను, తరగతి గదులను శుభ్రపరచడానికి ఓ స్వీపర్ కూడా లేడు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాలు, తాగునీటి ఏర్పాట్లను సమకూర్చేందుకు ఆయాను నియమించలేదు. స్కూల్‌కి సెక్యూరిటీ సౌకర్యం కూడా కల్పించలేదు.
ఉన్నంతలో న్యాయం చేస్తున్నాం..
మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో ఆలస్యం జరుగుతున్నప్పటికీ బోధనా విషయంలో విద్యార్థులకు సంపూర్ణ న్యాయం చేస్తున్నాం. సంవత్సరాంతం రాబోయే ఫలితాలతో అది నిరూపిస్తాం. సమస్యలపై అధికారులతో కూడా చర్చించాం. త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
- పి.యాదయ్య, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్
సౌకర్యాల కల్పనకు కృషి..
సమస్యలను రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నెలలోపు బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పన పూర్తవుతుందని చెప్పా రు. స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి బస్సు ట్రిప్పులను పెంచాం. సౌకర్యాల కల్పనకు కృషి చేస్తాం.
- బి.శ్రీనివాస్‌గౌడ్,
మండల విద్యాధికారి, ఇబ్రహీంపట్నం
మో‘డల్’ స్కూల్
Published Sun, Aug 11 2013 4:48 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement