హెచ్‌ఎల్‌ఛీ పనులు | The Modernization Of The HLC Canal Continues Today | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎల్‌ఛీ పనులు

Published Mon, Jul 1 2019 7:34 AM | Last Updated on Mon, Jul 1 2019 7:35 AM

 The Modernization Of The HLC Canal Continues Today - Sakshi

పెనకచెర్ల డ్యాం వద్ద బ్రిడ్జి పనులు జరుగుతున్న దృశ్యం

హెచ్చెల్సీ కాలువ ఆధునికీకరణ పనులు ప్రహాసనంగా మారాయి. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ఈ పనులను ప్రారంభించినా నేటికీ పనులు కొనసా....గుతున్నాయి. సంవత్సరాలు గడచిపోతున్నా నేటికీ 43వ ప్యాకేజీలో 45 శాతం పనులు, 44వ ప్యాకేజీలో 35 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ పనుల వల్ల నీళ్లు సరిగా పారక ఆయకట్టు రైతులు ప్రతి యేడూ నష్టపోతున్నారు. సెప్టెంబర్‌ నెలలోపే పనులు చేసేస్తామని అధికారులు చెబుతున్నా గడువు ముంచుకొస్తుండటంతో అది సాధ్యంకాదనే వాదనలు బలంగా ఉన్నాయి.      – గార్లదిన్నె  

45 వేల ఎకరాల ఆయకట్టు 
గార్లదిన్నె మండల పరిధిలో మిడ్‌పెన్నార్‌ డ్యాంలోని దక్షిణ, ఉత్తర కాలువలు ఉన్నాయి. ఇందులో దక్షిణ కాలువ ద్వారా గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల మండలాల్లో ,తాడిపత్రి బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలో 33 వేల ఎకరాలు ఆయకట్టు భూమి ఉంది. అలాగే ఉత్తర కాలువ ద్వారా గుత్తి, పెద్దడుగూరు మండలాల్లో 12,225 ఎకరాలు ఆయకట్టు భూమి ఉంది.

హెచ్చెల్సీ కాలువ ఆధునీకరణ పనులు ... 
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 సంవత్సరంలోనే దక్షిణ కాలువ ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 84 కిలో మీటర్ల కాలువ పనులు ఆధునీకరణ చేయడానికి 43వ ప్యాకేజీకి రూ.236.65 కోట్లు, 44వ ప్యాకేజీ కి రూ.184.2 కోట్లకు టెండర్లు వేయడంతో నాగార్జున కన్‌స్ట్రక్సన్స్‌ కంపెనీ (ఎన్‌సీసీ)  పనులు దక్కించుకుంది. ఎన్‌సీసీ అంచనా మొత్తం కంటే 4.95 శాతం అధిక మొత్తానికి ఈ టెండర్‌ చేజిక్కించుకుంది.

ప్రధాన ఆటంకాలు ఇవే...  
43వ ప్యాకేజీలో ఆధునికీకరణ పనులు చేయడానికి పాత బ్రిడ్జిలన్నీ పడగొట్టారు. అలాగే బెడ్‌ పనులు చేయకూడదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాంట్రాక్టర్లు లైనింగ్‌ పనులు ఆలస్యంగా చేయడం, పనులు జరుగున్న ప్రదేశంలో నత్తనడక పనులు జరుగుతున్నాయి. 
44వ ప్యాకేజీలో ఆధునికీకరణ పనులు చేయాలంటే మొదట కాలువ వెడల్పు పనులు చేయాలి. కానీ అనంతపురం నగరంలో కాలువకు దగ్గరలోనే కొంత మంది ఇళ్లు నిర్మించుకొని ఉండటం, మరికొందరు కాలువ స్థలాన్ని ఆక్రమించారు.  

ప్యాకేజీ వివరాలు... 
మిడ్‌ పెన్నార్‌ డ్యాంలో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు 84 కిలోమీటర్లు జరగాలి. అందులో 0–40 కిలో మీటర్లు 43వ ప్యాకేజీ, 40–84 కిలో మీటర్లు 44 ప్యాకేజీగా విభజించారు. 43వ ప్యాకేజీ పనులు మిడ్‌పెన్నార్‌ డ్యాం నుంచి అనంతపురములో హెచ్చెల్సీ కాలనీ రైల్వే గేట్‌ వరకు వర్తిస్తుంది. అలాగే రైల్వే గేట్‌ నుంచి నార్పల వరకు 44వ ప్యాకేజీలోకి వస్తాయి.
  
43 ప్యాకేజీలో .
0 – 40 కిలో మీటర్ల వరకు ఇద్దరు కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. కాలువ వెడల్పు పనులు, ఎర్త్‌ పనులు, కాలువ ఇరువైపులా లైనింగ్‌ పనుల్లో ఇప్పటి వరకు 45 శాతం పనులు మాత్రమే చేశారు. ఇంకా 5 కిలో మీటర్లు ఇరువైపులా లైనింగ్‌ పనులు చేయలేదు.అలాగే బ్రిడ్జిలు, పనులు చేయాల్సి ఉంది. గతవారం రోజుల నుంచి 5 బ్రిడ్జీలు పగలగొట్టి , కొత్త బ్రిడ్జీల పనులు చేస్తున్నారు.
 
44వ ప్యాకేజీలో.. 
40 – 84 కిలోమీటర్లు వరకు ఒక కాంట్రాక్టర్‌ పనులు చేస్తున్నారు. అయితే ఈ ప్యాకేజీలో 44 కిలో మీటర్లు పనులు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం బుక్కరాయసము ద్రం మండలం దయ్యాలకుంటపల్లి దగ్గర కేవలం 4 కిలో మీటర్లు మాత్రమే కాలువకు ఇరువైపులా కాలువ లైనింగ్‌ పనులు చేశారు. అయితే గత రెండురోజుల నుంచి నార్పల మండలంలో లైనింగ్‌ పనులు మొదలయ్యాయి.
 
6 నెలలుగా నో వర్క్‌.. 
హెచ్చెల్సీ కాలువకు నీరు విడుదల చేయడానికి సమయం ముంచుకొస్తోంది. కొత్త ప్రభుత్వం ఈ ఏడాది ఆయకట్టుకు సకాలంలో ఆయకట్టుకు నీరు అందించాలని చర్యలు చేపట్టింది. సాధారణంగా జూలై చివరి, ఆగస్టులో తుంగభద్ర డ్యాం జలాలు మిడ్‌ పెన్నార్‌ డ్యాంకు చేరతాయి. కాలువకు నీరు బంద్‌ చేసి 6 నెలలు అవుతున్నా కాంట్రాక్టర్లు పనులు చేయలేదు. తీరిగ్గా ఇప్పుడు పనులు మొదలు పెట్టడంతో రైతులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఆధునికీకరణ పనులు చేయడానికి ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు రెండు ప్యాకేజీల్లో 45 శాతం పనులు జరిగినట్లు తెలుస్తోంది.
    
లైనింగ్‌ పనులు పూర్తయితే... 
హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు పూర్తయితే రైతులకు ఎంతో ఉపయోగకరం. గతంలో ఆయకట్టు కాలువ కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీలు, కాలువలు శిథిలావస్థలో ఉండేవి. దీంతో చివరి ఆయకట్టు భూములకు నీరు అందేది కాదు. ఈ తరుణంలో కాలువ ఆధునికీకరణ పనులు పూర్తయితే చివరి ఆయకట్టు వరకు నీళ్లంది పంటలు బాగా పండుతాయి.   

బెడ్‌ లైనింగ్‌ పనులు జరిగేనా?  
హెచ్చెల్సీ ఆధునీకరణ పనుల్లో కాలువ వెడల్పు చేయడం, ఇరువైపులా, కింద లైనింగ్‌ వేయడం, పాత బ్రిడ్జిలు తొలగించి కొత్త బ్రిడ్జిలు నిర్మించడం వంటి పనులు చేయాలి. కానీ లైనింగ్‌ పనులు చేపడితే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించి ఆందోళనలు చేశారు. దీనిపై అప్పట్లోనే కాలువ ఇరువైపులా లైనింగ్‌ మాత్రమే వేసి కింద బెడ్‌ లైనింగ్‌ పనులు ఆపేశారు. నిజానికి ఎన్‌సీసీ ఒప్పందంలో మాత్రం బెడ్‌ లైనింగ్‌ పనులు చేయాల్సి ఉంది. ఇప్పుడు మళ్లీ పనులు మొదలు కావడంతో కింద బెడ్‌ పనులు చేస్తారా?  చేయరా? అనేది తేలడం లేదు. 

బ్రిడ్జిలు పూర్తి చేసేదేన్నడో? 
నీళ్లొదిలే సమయం దగ్గర పడుతున్నా కాలువ పనులు ఇంకా పూర్తి చేయలేదు. కాంట్రాక్టర్లు ఇప్పుడు పాత బ్రిడ్జిలన్నీ పడగొట్టి నూతనంగా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులన్నీ నత్తనడక సాగుతున్నాయి. సకాలంలో పనులు పూర్తిచేసి ఆయకట్టుకు నీరందించాలి.  – గోవర్ధన్, తిమ్మంపేట, రైతు
 

రైతులకు ఇబ్బంది కలిగించం
హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను భాగంగా 43, 44 ప్యాకేజీల్లో 45 శాతం పనులు జరిగాయి. 43వ ప్యాకేజీలో కేవలం 4 కి.మీ మాత్రమే లైనింగ్‌ పనులు జరగాల్సి ఉంది. ప్రస్తుతం పాత బ్రిడ్జీలన్నీ పగలగొట్టి కొత్తగా నిర్మాణ పనులు చేపట్టారు. త్వరలోనే పనులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.అయితే బెడ్‌ లైనింగ్‌ పనులకు సంబంధించి పనులు చేయాలా? వద్ద అనే విషయం ఉన్నతాధికారుల పరిధిలో ఉంది.                    –  ప్రసాద్, హెచ్చెల్సీ డీఈఈ                       

పనులు సకాలంలో పూర్తి చేయాలి 
హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయాలి.  పనులు పూర్తికాకపోవడంతో ఈ యేడాది కూడా ఆయకట్టుకు నీరు అందించడానికి ఇబ్బందిగా మారింది.  మూడేళ్లుగా ఆయకట్టు నీటి కోసం ఇబ్బంది పడ్డాం. ఇప్పటికైనా పనులు పూర్తిచేసి రైతులను ఆదుకోవాలి.   – నాగలింగారెడ్డి, పెనకచెర్ల, రైతు
                             


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

సంజీవపురం గ్రామం వద్ద కొనసాగుతున్న బ్రిడ్జిపనులు 

2
2/3

బూదేడు క్రాస్‌ సమీపంలో లైనింగ్‌ పనులు చేయని దృశ్యం

3
3/3

సంజీవ పురం గ్రామం వద్ద  బ్రిడ్జి నిర్మాణం పనులు చేపడుతుండడంతో కాలువలో అడ్డంగా ఉన్న మట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement