hlc canal
-
హెచ్‌ఎల్‌ఛీ పనులు
హెచ్చెల్సీ కాలువ ఆధునికీకరణ పనులు ప్రహాసనంగా మారాయి. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ఈ పనులను ప్రారంభించినా నేటికీ పనులు కొనసా....గుతున్నాయి. సంవత్సరాలు గడచిపోతున్నా నేటికీ 43వ ప్యాకేజీలో 45 శాతం పనులు, 44వ ప్యాకేజీలో 35 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ పనుల వల్ల నీళ్లు సరిగా పారక ఆయకట్టు రైతులు ప్రతి యేడూ నష్టపోతున్నారు. సెప్టెంబర్ నెలలోపే పనులు చేసేస్తామని అధికారులు చెబుతున్నా గడువు ముంచుకొస్తుండటంతో అది సాధ్యంకాదనే వాదనలు బలంగా ఉన్నాయి. – గార్లదిన్నె 45 వేల ఎకరాల ఆయకట్టు గార్లదిన్నె మండల పరిధిలో మిడ్‌పెన్నార్ డ్యాంలోని దక్షిణ, ఉత్తర కాలువలు ఉన్నాయి. ఇందులో దక్షిణ కాలువ ద్వారా గార్లదిన్నె, శింగనమల, బుక్కరాయసముద్రం, నార్పల మండలాల్లో ,తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ పరిధిలో 33 వేల ఎకరాలు ఆయకట్టు భూమి ఉంది. అలాగే ఉత్తర కాలువ ద్వారా గుత్తి, పెద్దడుగూరు మండలాల్లో 12,225 ఎకరాలు ఆయకట్టు భూమి ఉంది. హెచ్చెల్సీ కాలువ ఆధునీకరణ పనులు ... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014 సంవత్సరంలోనే దక్షిణ కాలువ ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 84 కిలో మీటర్ల కాలువ పనులు ఆధునీకరణ చేయడానికి 43వ ప్యాకేజీకి రూ.236.65 కోట్లు, 44వ ప్యాకేజీ కి రూ.184.2 కోట్లకు టెండర్లు వేయడంతో నాగార్జున కన్‌స్ట్రక్సన్స్ కంపెనీ (ఎన్సీసీ) పనులు దక్కించుకుంది. ఎన్సీసీ అంచనా మొత్తం కంటే 4.95 శాతం అధిక మొత్తానికి ఈ టెండర్ చేజిక్కించుకుంది. ప్రధాన ఆటంకాలు ఇవే... 43వ ప్యాకేజీలో ఆధునికీకరణ పనులు చేయడానికి పాత బ్రిడ్జిలన్నీ పడగొట్టారు. అలాగే బెడ్ పనులు చేయకూడదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కాంట్రాక్టర్లు లైనింగ్ పనులు ఆలస్యంగా చేయడం, పనులు జరుగున్న ప్రదేశంలో నత్తనడక పనులు జరుగుతున్నాయి. 44వ ప్యాకేజీలో ఆధునికీకరణ పనులు చేయాలంటే మొదట కాలువ వెడల్పు పనులు చేయాలి. కానీ అనంతపురం నగరంలో కాలువకు దగ్గరలోనే కొంత మంది ఇళ్లు నిర్మించుకొని ఉండటం, మరికొందరు కాలువ స్థలాన్ని ఆక్రమించారు. ప్యాకేజీ వివరాలు... మిడ్ పెన్నార్ డ్యాంలో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు 84 కిలోమీటర్లు జరగాలి. అందులో 0–40 కిలో మీటర్లు 43వ ప్యాకేజీ, 40–84 కిలో మీటర్లు 44 ప్యాకేజీగా విభజించారు. 43వ ప్యాకేజీ పనులు మిడ్‌పెన్నార్ డ్యాం నుంచి అనంతపురములో హెచ్చెల్సీ కాలనీ రైల్వే గేట్ వరకు వర్తిస్తుంది. అలాగే రైల్వే గేట్ నుంచి నార్పల వరకు 44వ ప్యాకేజీలోకి వస్తాయి. 43 ప్యాకేజీలో .. 0 – 40 కిలో మీటర్ల వరకు ఇద్దరు కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. కాలువ వెడల్పు పనులు, ఎర్త్ పనులు, కాలువ ఇరువైపులా లైనింగ్ పనుల్లో ఇప్పటి వరకు 45 శాతం పనులు మాత్రమే చేశారు. ఇంకా 5 కిలో మీటర్లు ఇరువైపులా లైనింగ్ పనులు చేయలేదు.అలాగే బ్రిడ్జిలు, పనులు చేయాల్సి ఉంది. గతవారం రోజుల నుంచి 5 బ్రిడ్జీలు పగలగొట్టి , కొత్త బ్రిడ్జీల పనులు చేస్తున్నారు. 44వ ప్యాకేజీలో.. 40 – 84 కిలోమీటర్లు వరకు ఒక కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు. అయితే ఈ ప్యాకేజీలో 44 కిలో మీటర్లు పనులు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం బుక్కరాయసము ద్రం మండలం దయ్యాలకుంటపల్లి దగ్గర కేవలం 4 కిలో మీటర్లు మాత్రమే కాలువకు ఇరువైపులా కాలువ లైనింగ్ పనులు చేశారు. అయితే గత రెండురోజుల నుంచి నార్పల మండలంలో లైనింగ్ పనులు మొదలయ్యాయి. 6 నెలలుగా నో వర్క్.. హెచ్చెల్సీ కాలువకు నీరు విడుదల చేయడానికి సమయం ముంచుకొస్తోంది. కొత్త ప్రభుత్వం ఈ ఏడాది ఆయకట్టుకు సకాలంలో ఆయకట్టుకు నీరు అందించాలని చర్యలు చేపట్టింది. సాధారణంగా జూలై చివరి, ఆగస్టులో తుంగభద్ర డ్యాం జలాలు మిడ్ పెన్నార్ డ్యాంకు చేరతాయి. కాలువకు నీరు బంద్ చేసి 6 నెలలు అవుతున్నా కాంట్రాక్టర్లు పనులు చేయలేదు. తీరిగ్గా ఇప్పుడు పనులు మొదలు పెట్టడంతో రైతులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఆధునికీకరణ పనులు చేయడానికి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు రెండు ప్యాకేజీల్లో 45 శాతం పనులు జరిగినట్లు తెలుస్తోంది. లైనింగ్ పనులు పూర్తయితే... హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు పూర్తయితే రైతులకు ఎంతో ఉపయోగకరం. గతంలో ఆయకట్టు కాలువ కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీలు, కాలువలు శిథిలావస్థలో ఉండేవి. దీంతో చివరి ఆయకట్టు భూములకు నీరు అందేది కాదు. ఈ తరుణంలో కాలువ ఆధునికీకరణ పనులు పూర్తయితే చివరి ఆయకట్టు వరకు నీళ్లంది పంటలు బాగా పండుతాయి. బెడ్ లైనింగ్ పనులు జరిగేనా? హెచ్చెల్సీ ఆధునీకరణ పనుల్లో కాలువ వెడల్పు చేయడం, ఇరువైపులా, కింద లైనింగ్ వేయడం, పాత బ్రిడ్జిలు తొలగించి కొత్త బ్రిడ్జిలు నిర్మించడం వంటి పనులు చేయాలి. కానీ లైనింగ్ పనులు చేపడితే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించి ఆందోళనలు చేశారు. దీనిపై అప్పట్లోనే కాలువ ఇరువైపులా లైనింగ్ మాత్రమే వేసి కింద బెడ్ లైనింగ్ పనులు ఆపేశారు. నిజానికి ఎన్సీసీ ఒప్పందంలో మాత్రం బెడ్ లైనింగ్ పనులు చేయాల్సి ఉంది. ఇప్పుడు మళ్లీ పనులు మొదలు కావడంతో కింద బెడ్ పనులు చేస్తారా? చేయరా? అనేది తేలడం లేదు. బ్రిడ్జిలు పూర్తి చేసేదేన్నడో? నీళ్లొదిలే సమయం దగ్గర పడుతున్నా కాలువ పనులు ఇంకా పూర్తి చేయలేదు. కాంట్రాక్టర్లు ఇప్పుడు పాత బ్రిడ్జిలన్నీ పడగొట్టి నూతనంగా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులన్నీ నత్తనడక సాగుతున్నాయి. సకాలంలో పనులు పూర్తిచేసి ఆయకట్టుకు నీరందించాలి. – గోవర్ధన్, తిమ్మంపేట, రైతు రైతులకు ఇబ్బంది కలిగించం హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను భాగంగా 43, 44 ప్యాకేజీల్లో 45 శాతం పనులు జరిగాయి. 43వ ప్యాకేజీలో కేవలం 4 కి.మీ మాత్రమే లైనింగ్ పనులు జరగాల్సి ఉంది. ప్రస్తుతం పాత బ్రిడ్జీలన్నీ పగలగొట్టి కొత్తగా నిర్మాణ పనులు చేపట్టారు. త్వరలోనే పనులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.అయితే బెడ్ లైనింగ్ పనులకు సంబంధించి పనులు చేయాలా? వద్ద అనే విషయం ఉన్నతాధికారుల పరిధిలో ఉంది. – ప్రసాద్, హెచ్చెల్సీ డీఈఈ పనులు సకాలంలో పూర్తి చేయాలి హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయాలి. పనులు పూర్తికాకపోవడంతో ఈ యేడాది కూడా ఆయకట్టుకు నీరు అందించడానికి ఇబ్బందిగా మారింది. మూడేళ్లుగా ఆయకట్టు నీటి కోసం ఇబ్బంది పడ్డాం. ఇప్పటికైనా పనులు పూర్తిచేసి రైతులను ఆదుకోవాలి. – నాగలింగారెడ్డి, పెనకచెర్ల, రైతు -
పీఏబీఆర్‌లోకి తుంగభద్ర నీరు
కూడేరు: కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి శనివారం తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీ కెనాల్ ద్వారా నీరు చేరినట్లు డ్యాం డీఈ పక్కీరప్ప తెలిపారు. ప్రస్తుతం డ్యాంలోకి 60 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు ఆయన తెలిపారు. పీఏబీఆర్ డ్యాంలో శనివారం నాటికి 1.37 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. డ్యాం నుంచి అనంత, సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 60–70 క్యూసెక్కుల వరకు నీరు వెళుతున్నట్లు వివరించారు. డ్యాంలోకి త్వరలోనే పూర్తి స్థాయిలో నీరు వచ్చే అవకాశాలు ఉన్నట్లు డీఈ విలేకరులకు తెలిపారు. -
హెచ్చెల్సీలో వృద్ధురాలి మృతదేహం
అనంతపురం సెంట్రల్ : నగరంలో రాయల్‌నగర్ సమీపంలోని హెచ్చెల్సీ కాలువలో ఓ వృద్ధురాలు శవమై తేలింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలు సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి నారాయణస్వామి తల్లి శివమ్మ(65)గా గుర్తించారు. శివమ్మకు కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగోలోదు. దీంతో కుటుంబసభ్యులు ఎప్పుడూ ఆమెను పర్యవేక్షిస్తూ ఉండేవారు. కానీ 19వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నగరమంతా గాలించారు. శనివారం సాయంత్రం మూడవపట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఆదివారం మధ్యాహ్నానికి హెచ్చెల్సీలో శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిందా.. లేక ఆత్మహత్యకు పాల్పడిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. నాల్గవ పట్టణ సీఐ శివశంకర్, ఎస్ఐ శ్రీరామ్‌లు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. -
హెచ్చెల్సీలో మహిళ గల్లంతు
బుక్కరాయసముద్రం : మండలంలోని సంజీవపురం గ్రామంలో ఓ మహిâýæ ప్రమాదవ శాత్తూ హెచ్చెల్సీలో పడి కొట్టుకుపోయిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. సంజీవపురం గ్రామంలో ఈశ్వరయ్య, భార్య శ్రీదేవి కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉండేవారు. గురువారం ఆమె కూలి పనుల కు వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వస్తూ ప్ర మాదవశాత్తూ హెచ్చెల్సీలోకి పడింది. చు ట్టుపక్కల వారు చూసేసరికి ఆమె నీటి ప్రవా హంలో కొట్టుకుపోయింది. విషయం తెలు సుకున్న భర్త, బంధువులు, స్థానికులు సా యంత్రం వరకు గాలింపు చేపట్టారు. ఈతగాల్లు కాలువలో వెతికినా ఆమె కనపడలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గొంతు కోసి చిన్నారి హత్య
బుక్కరాయసముద్రం : మండలంలోని హెచ్ఎల్సీ కాలువలో శనివారం గుర్తు తెలియని చిన్నారి(8) మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఎస్ఐ విశ్వనాథ్ చౌదరి తెలిపిన వివరాల మేరకు.. చిన్నారిని ఎక్కడో గొంతుకోసి హత్య చేసి రగ్గులో పెట్టి తాడుతో బిగించి కాలువలో పడేశారు. తాడిపత్రి రహదారి పక్కన హెచ్ఎల్సీలో మృతదేహం తేలి వస్తుండడంతో స్థానికులు సమాచారం ఇచ్చారు. చిన్నారి మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశామని ఆయన తెలిపారు. సుమారు ఐదు రోజుల క్రితం హత్య చేసి కాలువలో పడేయడంతో మృత దేహం బాగా ఉబ్బి ఉందన్నారు. చిన్నారి ఒంటిపై ఎర్రటి గౌను ఉందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. -
గల్లంతైన బాలుడి మృతి
గార్లదిన్నె : హెచ్చెల్సీ కాలువలో గల్లంతైన రాము (16) మృతి చెందాడు. గురువారం గ్రామస్తులు యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మండల పరిధిలోని పెనకచెర్ల డ్యాంకు చెందిన చాకలి లక్ష్మీదేవి, నరసింహుల ఏకైక కుమారుడు రాము బుధవారం దుస్తులు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి వరకు గ్రామస్తులు, పోలీసులు గాలించినా యువకుడి ఆచూకీ తెలియరాలేదు. గురువారం మధ్యాహ్న సమయంలో నీటి ప్రవాహంలో కొట్టుకు పోతు ఉండటాన్ని గ్రామస్తులు గమనించి సస్పెన్సన్ బ్రిడ్జి వద్ద గ్రామస్తులు మృతదేహాన్ని బయటికి తీశారు. రాము మృతదేహం వద్ద తల్లిదండ్రులతో పాటు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరివ్వాలి : శైలజనాథ్
అనంతపురం సెంట్రల్ : హెచ్చెల్సీ ఆయకట్టుకు సాగు నీరివ్వాలని మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు వలన మిడ్‌పెన్నార్, సౌత్, నార్త్ కెనాల్స్‌తో పాటు తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ కింద ఆయకట్టును బీడుపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరిచ్చిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు మళ్లించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, నాయకులు నాగరాజు, వాసు, అగిశం రంగనాథ్ పాల్గొన్నారు. -
వాటా దక్కేనా?
కరువు జిల్లాను అంతో ఇంతో తడుపుతాయనుకుంటే తుంగభద్ర జలాలు కూడా సరిహద్దులకు చేరకుండా మూడో వంతు మాయమవుతున్నాయి. తుంగభద్ర నుంచి న్యాయంగా రావాల్సిన వాటా అయినా దక్కితే ఎంతో కొంత ఊరటగా ఉంటుందన్న అనంత రైతుల ఆశలు ఎండమావులే అవుతున్నాయి. ఈ ఏడాదైనా కేటాయింపుల్లో న్యాయం జరిగేనా అని మరోసారి రైతులు ఎదురు చూస్తున్నారు. బుధవారం కర్ణాటక రాష్ట్రంలోని హొస్పేటలో తుంగభద్ర బోర్డు మొదటి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో గత కేటాయింపులపై సమీక్షిస్తే అన్నీ ఆవేదనలే. అనంతపురం టవర్‌క్లాక్: హెచ్చెల్సీపై ఆధారపడి జిల్లాలో 80 వేల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. ఎగువ కాలువ ద్వారా రాయదుర్గం పట్టణంతో పాటు, పరిసర గ్రామాలకు సాగునీటితో పాటు తాగునీరు అందుతోంది.. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ద్వారా గుంతకల్లు పట్టణానికి, పీఏబీఆర్ తాగునీటి పథకం ద్వారా అనంతపురం, హిందూపురం, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం, సత్యసాయి తాగునీటి పథకం ద్వారా 700 గ్రామాలకు సర ఫరా అవుతోంది. జిల్లాకు ఇంత ప్రధామైన హెచ్చెల్సీకి నీటి కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోంది. అనంతపురం, వైఎస్సార్ జిల్లాలకు తాగునీరు, లక్ష ఎకరాల ఆయకట్టుకు కేటాయించిన 32.5 టీఎంసీల నీటిని ఎన్నడూ విడుదల చేసింది లేదు. డ్యాంలో పూడిక ఎక్కువగా ఉందన్న సాకుతో ఏటా సుమారు 22.5 టీఎంసీల చొప్పున విడుదల చేస్తోంది. ఫలితంగా 0 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వస్తోంది. దీంతో పాటు పులివెందులబ్రాంచ్కెనాల్, ఆలూరుబ్రాంచ్ కెనాల్‌కు నీరు సరఫరా కావాలి. ఈ మొత్తానికి సరిపడా నీరు కావాలంటే దాదాపు 40 టీఎంసీల అవసరమని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే డ్యాం నుంచి 22.5 టీఎంసీల చొప్పున మాత్రమే సరఫరా అవుతున్నాయి. డ్యాంలో నీటిప్రవాహం ఉధృతంగా ఉన్నపుడు కూడా సరిపడా నీటిని తెచ్చుకోలేకపోతున్నాం. దీనికి కారణం హెచ్చెల్సీ కాలువ పూడికతో ఉండటమే! డ్యాం నుంచి జిల్లా సరిహద్దు వరకూ 105 కిలీమీటర్ల మేర కాలువను 4వేల క్యూసెక్కుల ప్రవాహసామర్థ్యంతో నిర్మించారు. కాలువలో పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం 2500-2,800 క్యూసెక్కులకు మించి నీరు ప్రవహించడం లేదు. ఈ ప్రవాహం 105 కిలోమీటరు వరకూ వస్తే మరింత తగ్గుతోంది. దీని కోసం డ్యాం నుంచి సమాంతర కాలువ కావాలని ఏపీ ప్రభుత్వం సుదీర్ఘంగా పోరాడుతోంది. ఇందుకు కర్నాటక ప్రభుత్వం ఒప్పుకోలేదు. కనీసం 105 కిలోమీటరు వరకూ కాలువ సామర్థ్యాన్ని 6వేల క్యూసెక్కుల ప్రవాహసామర్థ్యానికి పెంచాలని అడిగారు. దీనికి ఒప్పుకోవడం లేదు. కేవలం 4వేల క్యూసెక్కులు ప్రవహించేలా కాలువను ఆధునికీకరిస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ‘అనంత’ రైతుల్లో ఆశలు రేపాయి. ఇటీవల మడకశిర సమీపంలోని కర్నాటకలో జరిగిన బహిరంగసభకు వెళ్లిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హెచ్చెల్సీ సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనికి సిద్ధరామయ్య స్పందించి...తప్పకుండా పరిష్కరిస్తామని, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలతో పాటు బోర్డుతో కలిసి చర్చించి సానుకూల నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆరు టీఎంసీలే: 100 టీఎంసీల సామర్థ్యం ఉన్న తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 6.562 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. హెచ్చెల్సీకి నీటిని విడుదల చేయాలంటే డ్యాంలో నీటిమట్టం 1600 అడుగులకు చేరుకోవాలి. అయితే వర్షాకాలం ఇప్పుడే మొదలుకావడంతో 1584.5 అడుగుల నీరు మాత్రమే డ్యాంలో నిలువ ఉంది. జూలై మొదటి వారంలో నీటిమట్టం 1600 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు హెచ్చెల్సీ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పాలకులు, అధికారులు గట్టిగా ప్రయత్నించకపోతే ఈ ఏడాది కూడా మన వాటా నీరు విడుదల చేయడం అనుమానమే. -
కాలువలో పడి వ్యక్తి గల్లంతు
అనంతపురం: ముఖం కడుక్కుందామని కాలువలో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అనంతపురం మండలం తాడ్చర్ల గ్రామానికి చెందిన పుల్లయ్య(55) కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం పనికోసం కేకే అగ్రహారం గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కాళ్లు చేతులు కడుక్కోవడానికి వెంకటాపురం సమీపంలోని హెచ్ఎల్సీ కాలువలోకి దిగాడు. ప్రమాదవశాత్తు అందులో జారిపడి నిళ్లలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గల్లంతయిన వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించారు. (బుక్కరాయసముద్రం) -
గాలింపు చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం: అనంతపురం కణేకల్‌లో హెచ్ఎల్సీ కెనాల్లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం సత్వర చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం హెచ్ఎల్సీ కెనాల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆచూకీ కోసం కణేకల్ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని వై.విశ్వేశ్వరరెడ్డి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబును కోరారు. అలాగే విద్యార్థుల ఆచూకీని త్వరితగతిన కనుక్కోవాలని కర్ణాటక అధికారులకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం ఉదయం బళ్లారి వెళ్లారు. అధికారులను కలిసి విద్యార్థుల ఆచూకీపై అభ్యర్థించారు.