వేడి వేడి ఇడ్లీ..పూరీ..మసాలా దోసె
‘పెదరాయుడు హోటల్’ స్పెషల్
‘మేము సైతం’కోసం అమ్మకాలు సాగించిన డైలాగ్‌కింగ్
పేదవాడికి సాయం చేయడం ఆత్మసంతృప్తన్న మోహన్‌బాబు
చంద్రగిరి: పేదవాడికి సాయం చేయడంలో నిజమైన ఆత్మ సంతృప్తి ఉందని విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు డాక్టర్ మోహన్‌బాబు అన్నారు. తిరుపతికి సమీపంలోని విద్యానికేతన్ విద్యాసంస్థల ప్రాంగణంలో మోహన్‌బాబు తన కుమార్తె లక్ష్మీప్రసన్న తలపెట్టిన మేముసైతం కార్యక్రమానికి ఊతంగా నిలిచారు. ఇందుకు గాను గురువారం ‘పెదరాయుడు హోటల్’ పేరుతో ఆయనే స్వయంగా ఇడ్లీలు, పూరీలు, దోసెలు వేసి విక్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మేము సైతం‘లో భాగంగా ఎవరైనా పేదలు ప్రమాదవశాత్తూ నష్టపోతే వారిని ఆదుకునేందుకు బాధితుల వృత్తినే తాము ఆచరించి తద్వారా సంపాదించిన మొత్తాన్ని వారికి విరాళంగా ఇస్తున్నామన్నారు.
ఇలా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మస్తానయ్య ఆటో నడుపుతూ జీవించేవారన్నారు. ప్రమాదవశాత్తూ ఆయన కాలు విరిగి పోవడంతో ప్రస్తుతం తోపుడు బండిపై ఆయన కుటుంబ సభ్యులు అల్పాహారం విక్రయించి జీవిస్తున్నారని తెలిపారు. వారిని ఆదుకునేందుకు శ్రీవిద్యానికేతన్ ప్రాంగణంలో హోటల్ పెట్టి గురువారం వ్యాపారం చేశామన్నారు. మూడు వేలమంది విద్యార్థులు, ప్రాంగణంలోని హాస్టళ్ల యజమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి తోచిన సాయం చేశారని తెలిపారు. రూ. 2.20 లక్షలు వచ్చిందనీ ఆ మొత్తాన్ని బాధితులకు అందజేస్తామన్నారు.