శంకర్‌పల్లి, న్యూస్‌లైన్: కన్న కొడుకు మృతిని ఆ తల్లి హృదయం తట్టుకోలేకపోయింది. కుమారుడిపై గుండెల నిండా గూడు కట్టుకున్న మమకారం తల్లడిల్లిపోయింది. అతని మరణవార్త విన్న ఆ మాతృమూర్తి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. గుండె ఆగిపోవడంతో విగతజీవిగా మారింది. తల్లీకొడుకు ఒకే రోజు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. హృదయాలను ద్రవింపజేసే ఈ ఘటన ఆదివారం మండలంలోని మహాలింగపురం అనుబంధ గ్రామం బయన్నగూడలో చోటుచేసుకుంది. మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఏనుగు లక్ష్మారెడ్డి (55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం 7 గంటలకు లక్ష్మారెడ్డి చేనుకు వెళ్లాడు. పొలం పనుల్లో నిమగ్నమైన ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.
పొరుగు రైతులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో నగరంలోని నిమ్స్‌కు తరలించే యత్నం చేశారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే లక్ష్మారెడ్డి ప్రాణాలు విడిచారు. కుమారుడి మరణవార్త విన్న ఆయన తల్లి రత్నమ్మ (80) తీవ్ర ఉద్వేగానికి గురై గుండెలు బాదుకుంది. కొద్దిసేపటికే ఆమె అసువులు బాసింది. తల్లీకొడుకుల మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లక్ష్మారెడ్డికి భార్య లలిత, కుమారుడు సుధాకర్‌రెడ్డి ఉన్నారు. ఆదివారం సాయంత్రం స్వగ్రామంలో తల్లీకొడుకులకు అంత్యక్రియలు నిర్వహించారు.
గుండెకోత..
Published Mon, Sep 16 2013 1:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement