హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : స్థానికంగా సంచలనం సృష్టించిన వరలక్ష్మి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మొదటినుంచి అనుమానిస్తున్నట్లుగానే వరలక్ష్మి ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తే సొమ్ము కోసం ఆమెను హత్య చేశాడని పో లీసుల విచారణలో తేలింది. స్థానిక పోలీస్‌స్టేష న్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వై.వి.రమణ ఈ వివరాలు వెల్లడిం చారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. స్థానిక గుడివాడ రోడ్డులో అల్లాడి భానుమూర్తి కుటుంబం నివాసం ఉంటోంది.
ఆయనకు బస్టాండ్ ఎదురుగా ఫ్యాన్సీ షాపు ఉంది. ఈనెల మూడో తేదీ మధ్యాహ్నం భానుమూర్తి ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయి. లోపల వెదగ్గా భార్య కనిపించలేదు. పక్కన అద్దెకు ఉంటున్న గొర్రెల రవికుమార్ పోర్షన్‌కు తాళం వేసి ఉంది. ఆరోజు ఉదయం వరలక్ష్మికి, రవికుమార్‌కు గొడవ జరిగింది. భార్య కనిపించకపోవడంతో భానుమూర్తి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి వివరాలు సేకరించారు. రవికుమార్‌పై అనుమానం వచ్చి ఫోన్ చేయగా వస్తున్నానంటూ ఎంతకూ రాలేదు.
దీంతో పోలీసులకు అనుమానం వచ్చి రవికుమార్ ఇంటి పోర్షన్ తాళం పగులగొట్టారు. లోనికి వెళ్లి చూడగా వరలక్ష్మి మృతదేహం గోనెసంచిలో మూట కట్టి సోఫాలో దాచి ఉంది. ఈ ఘటన జరిగినప్పటినుంచి రవికుమార్ పరారీ లో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవికుమార్ గుడివాడలో తలదాచుకున్నాడని సమాచారం అందడంతో శుక్రవారం సాయంత్రం అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నానని, వరలక్ష్మి అప్పు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను కత్తితో పొడిచి చంపానని రవికుమార్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.
మృతదేహాన్ని గోనెసంచిలో మూట కట్టి తన పోర్షన్‌లో దాచానని, ఎవరికీ అనుమానం రాకుండా రక్తపు మరకలు కడిగివేశానని చెప్పాడు. రాత్రివేళ తీసుకువెళ్లి చెరువులో పడవేద్దామని అనుకున్నానని అతడు తెలిపాడు. దీం తో పోలీసులు రవికుమార్‌ను అరెస్టు చేశారు. వరలక్ష్మి వద్ద అతడు దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నూజి వీడు కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ రమణ తెలిపారు. సమావేశంలో ఎస్సై బి.ప్రభాకరరావు, ఏఎస్సై బాలస్వామి పాల్గొన్నారు.
సొమ్ము కోసమే మహిళ హత్య
Published Sun, Sep 22 2013 1:44 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
Advertisement
Advertisement