
‘పాము’ కాదు.. అవినీతి అనకొండ
రాష్ట్రానికి చెందిన కీలక మంత్రితో పాండురంగారావుకు ఇటీవల పొరపొచ్ఛాలు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాండురంగారావుకు చెక్ పెట్టేందుకు ఆ మంత్రి వ్యూహాత్మకంగా పావులు కదలిపినట్టు అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇది ఇలా ఉంటే కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న వ్యక్తికి పాండురంగారావు అత్యంత సన్నిహితంగా ఉండేవారని చెబుతున్నారు. 2011లో పాండురంగారావు బదిలీని ఆ నేతే స్వయంగా రంగంలోకి దిగి నిలుపుదల చేయించినట్టు సమాచారం. అనంతరం 2014 ఎన్నికల్లో కృష్ణా జిల్లాకు చెందిన ఆ నేతకు పాండురంగారావు ఇతోధిక సాయం అందించినట్టు ప్రచారం జరుగుతోంది. పాండురంగారావుకు ఏపీలోని పలువురు కీలక నేతలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకునిగా వ్యవహరించిన తెలంగాణ నాయకుడు, అప్పట్లో మంత్రిగా కూడా వ్యవహరించిన మరో తెలంగాణ నేతకు ఆయన బినామీగా వ్యవహరించారనేది విశ్వసనీయ సమాచారం. పాండురంగారావు హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లోనూ కీలక స్థానంలో పనిచేశారు.
ఈ అంశాలపై ఏసీబీ, పోలీసు, ఇతర ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతుండటం విశేషం. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరుపర్చడంతో రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇంకా అనేక వివరాలు తెలియాల్సి ఉందని, విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నట్టు సమాచారం. ఆయన్ను సర్వీసు నుంచి తొలగించాలని ఏసీబీ డీజీ ఆర్‌పీ ఠాకూర్ ప్రభుత్వానికి నివేదించనున్నారు.