సాక్షి, తిరుమల: మూడు ముళ్లు.. ఏడడుగులు.. వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో కీలక ఘట్టం.. యువతీ యువకులకు అందమైన కల.. మధురమైన జ్ఞాపకం. ఇంతటి గొప్ప వివాహ వేడుకను నిత్య కల్యాణ చక్రవర్తి శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో చేసుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని అందరూ తపిస్తుంటారు. సప్తగిరీశుడి సన్నిధిలో ఏడాది పొడవునా వివాహబంధంతో కొత్తజంటలు ఒక్కటవుతుంటాయి. సెలబ్రెటీలు సైతం ఈ దివ్యక్షేత్రంలో పెళ్లి చేసుకునేందుకు మొగ్గుచూపుతారు. నాటి మేటి నటి జమున నుంచి రంభ వరకు సెలబ్రిటీ లెందరెందరో ఇక్కడ వివాహం చేసుకున్నారు. తిరుమలలో పెళ్లి చేసుకున్న కొందరు సెలబ్రిటీల వేడుకను మరోసారి మనం తిలకిద్దాం..
జమున–రమణరావు
నాలుగు దశాబ్దాల కిందట అలనాటి నటి జమున,రమణరావు వివాహం తిరుమలలో జరిగింది. శ్రీవారి ఆలయానికి పడమర దిశలోని ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజ సత్రంలో వైభవంగా వేడుక సాగింది. అప్పట్లో చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి పదుల సంఖ్యలో సినీ తారలు విచ్చేశారు. వారిని చూసేందుకు ఏపీ, తమిళనాడు నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండ మీద జరిగిన జమున పెళ్లి వేడుకను నేటికీ స్థానికులు చర్చించుకుంటూ ఉంటారు.
బాలకృష్ణ–వసుంధర
మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల అభిమాన నటుడు, దివంగత ఎన్‌టీ రామారావు కుమారుడు హీరో బాలకృష్ణ, వసుంధర వివాహం తిరుమలలో జరిగింది. రెండున్నర దశాబ్దాల కిందట పడమర మాడ వీధిలోని కర్ణాటక సత్రంలో వారి పెళ్లి జరిగింది. ఇదే సందర్భంలోనే బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ, జయశ్రీ వివాహం జరిగింది. అప్పటికే హీరోగా రాణిస్తున్న బాలకృష్ణ వివాహ మహోత్సవానికి సినీనటులు, రాజకీయ నేతలు విచ్చేసి ఆశీర్వదించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు తరలివచ్చారు.
ఘట్టమనేని రమేష్
సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ్ణ పెద్ద కుమారుడు, హీరో రమేష్‌బాబు వివాహం జూన్ 18,1998లో ఇక్కడి కర్ణాటక సత్రాల్లో జరిగింది. కృష్ణ పెద్దకుమార్తె మంజుల,సంజయ్ స్వరూప్‌ల వివాహం కూడా ఇక్కడి శ్రీశృంగేరి శంకర మఠం లో జరిగింది. సినీ పరిశ్రమలోని పెద్ద లంతా హాజరయ్యారు.
శ్రీకాంత్–ఊహ
పదిహేనేళ్లకు ముందు ఇక్కడి ఎస్‌ఎంసీ కల్యాణ మండపంలో శ్రీకాంత్, ఊహ కల్యాణం జరి గింది. అప్పటికే ఇద్దరూ కూడా సినీస్టార్లుగా చిత్ర పరిశ్రమలో ఉ న్నారు. వివాహ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, నటులు విచ్చేసి ఆశీర్వదించారు.
మీనా–విద్యాసాగర్
నటి మీనా–సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కె.విద్యాసాగర్ వివాహం 2009, జూలై 12న తిరుమలలో జరిగింది. బాలనటిగా, 1990లో సీతా రామయ్య గారి మనుమరాలు’ చిత్రంతో హీరోయిన్‌గా, 2009లో ‘వెంగమాంబ’ వంటి ఎన్నెన్నో విభిన్న పాత్రలతో మెప్పించిన మీనా పెళ్లివేడుక ఇక్కడి ఆల్ ఇండియా ఆర్యవైశ్య సమాజ సత్రంలో జరిగింది. నటులు సంఘవి, రాగిణి, కృష్ణ వేణి, దర్శకుడు చేరన్, నిర్మాతలు వి.దొరస్వామి రాజు, టి.శివ, పలువురు నటులు, ప్రము ఖులు హాజరయ్యారు.
మహేశ్వరి–జయకృష్ణ
గులాబి చిత్రం ఫేమ్ మహేశ్వరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జయకృష్ణ్ణతో 2008, సెప్టెంబర్18న ఇక్కడి ఉడ్సైడ్ హోటల్‌లోని ఆర్యవైశ్య సత్రంలో పెళ్లి జరిగింది. మహేశ్వరి శ్రీదేవికి బంధువు కావడంతో బోనీ కపూర్ కుటుంబ సభ్యులు విచ్చేశారు. నటి మీనా, విజయకుమార్, మంజులతోపాటు వారి కుమార్తె శ్రీదేవి, మరికొందరు నటులు వేడుకల్లో పాల్గొన్నారు.
రంభ–ఇంద్రకుమార్
నటి రంభ, కెనడాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ ఇంద్రకుమార్ వివాహం తిరుమల కర్ణాటక సత్రాల్లో జరిగింది. ఏప్రిల్ 8, 2010లో జరిగిన ఈ వివాహానికి దర్శకులు రాఘవేంద్రరావు, ఆర్‌కే సెల్వమణి, హీరోయిన్ రోజాతోపాటు అనేక మంది నటీనటులు హాజరయ్యారు.
కల్యాణోత్సవ సేవలో నిత్యం 900 జంటలు
తిరుమల క్షేత్రం నిత్య కల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లుతోంది. శ్రీవేంకటేశ్వరుడు నిత్య కల్యాణ చక్రవర్తి. ఆలయంలో లోక కల్యాణార్థం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం నిత్యం జరుగుతుంది. కొత్తగా వివాహం చేసుకున్న జంటలు స్వామి దర్శనానికి వచ్చి శ్రీవారికి కల్యాణోత్సవం జరిపించే సంప్రదాయం క్రమంగా పెరుగుతోంది. ఆలయంలో ఐదు శతాబ్దాల కిందట కల్యాణోత్సవం ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకు 800 నుంచి 900 జంటల వరకు ఈ కల్యా ణోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారు.
ఏడాది పొడవునా వివాహాలే ..
తిరుమల క్షేత్రంలో నిత్యం పెళ్లి మంత్రాలు వినిపిస్తాయి. భాజా భజంత్రీలు మోగుతూనే ఉంటాయి. నవ వధూవరులు సరికొత్త ఆశలతో ఒక్కటవుతూ ఉంటారు. శుభ లగ్నాలతో పనిలేకుండా కూడా రోజూ పెళ్లి వేడుకలు సాగుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఏడాదిలో సుమారు పది వేలకు పైగా పెళ్లిళ్లు జరుగుతుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment