సప్తగిరీశుడి సన్నిధి...సప్తపదికి పెన్నిధి! | free marriages in ttd temple | Sakshi
Sakshi News home page

సప్తగిరీశుడి సన్నిధి...సప్తపదికి పెన్నిధి!

Published Sat, Aug 6 2016 12:07 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

కల్యాణమస్తులో  కొత్త దంపతుల్ని  ఆశీర్వదిస్తున్న   నాటి సీఎం డాక్టర్   వైఎస్ రాజశేఖరరెడ్డి - Sakshi

కల్యాణమస్తులో కొత్త దంపతుల్ని ఆశీర్వదిస్తున్న నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి

శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రం నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లుతోంది. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను అనునిత్యం పెళ్ళాడుతూ మలయప్ప నిత్య కల్యాణ చక్రవర్తిగా భక్తకోటిని కటాక్షిస్తూ పరవశింపచేస్తుంటాడు. నిత్యపెళ్లికొడుకైన ఆ స్వామి సన్నిధిలో వివాహ శుభకార్యాలు చేసుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని భక్తులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఏడాది పొడవునా వివాహ బంధంతో కొత్తజంటలు ఒక్కటవుతుంటారు.

కోర్కెలు తీర్చే కొండలరాయుని ఆలయంలో నిత్య కల్యాణోత్సవం వైభవంగా సాగుతుంటుంది. ఆలయంలో ఐదు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ సంప్రదాయం నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రోజుకు 800 నుండి 900 జంటల వరకు ఈ కల్యాణోత్సవంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.

పచ్చటి తోరణాలతో ఆలయ శోభ
నిత్య కల్యాణ చక్రవర్తికి వేకువజాము సుప్రభాతం మొదలు, రాత్రి ఏకాంత సేవ వరకు నిర్విరామంగా ఉత్సవాలు, సేవలు సాగుతూనే ఉంటాయి. అందుకు చిహ్నంగా ఆలయ మహాద్వారం, కల్యాణ మండపంలో ప్రతి రోజూ అరటిమాకులు, మామిడి ఆకుల తోరణాలతో అలంకరిస్తారు. అందుకే  కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణం ప్రసిద్ధి పొందింది.

వెంకన్న సన్నిధిలో ఏడాది పొడవునా వివాహాలే
దేవదేవుని సన్నిధి అయిన తిరుమల క్షేత్రంలో నిత్యం పెళ్లి మంత్రాలు వినిపిస్తాయి. భాజాభజంత్రీలు మోగుతూనే ఉంటాయి. నవ వధూవరులు సరికొత్త ఆశలతో ఒక్కటవుతుంటారు. ఇలా తిరుమలలో రోజూ వివాహాలు జరుగుతూనే ఉంటాయి. శుభలగ్నాలతో పనిలేకుండా కూడా పెళ్లి వేడుకలు సాగుతుండటం ఇక్కడి ప్రత్యేకత. ఏడాదిలో సుమారు పదివేలకు పైగా పెళ్ళిళ్లు జరుగుతుంటాయి.

‘కల్యాణం’ పథకం ద్వారా  అన్నీ ఉచితం
భారతీయ ఆశ్రమ ధర్మాలకు ఊపిరైన వివాహ బంధం పటిష్టతకు కల్యాణమస్తు పథకంతో టీటీడీ గట్టి పునాదులు వేసింది. అదే తరహాలోనే టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు తిరుమల కల్యాణవేదిక పౌరోహిత సంఘం కేంద్రంగా ఏప్రిల్ 25న ‘కల్యాణం’ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిమూలంగా భక్తులకు ఆర్థిక భారం తప్పటంతోపాటు అదనపు సౌకర్యాలూ అందుబాటులోకి రానున్నాయి. గతంలో పురోహితుడు, మంగళవాయిద్యాలు, పెళ్లివేడుక వీడియో విద్యుత్ చార్జీలకుగానూ రూ.860 నగదు వసూలు చేసే విధానాన్ని కూడా పూర్తిగా రద్దు చేశారు.

వివాహం సందర్భంగా పసుపు, కుంకుమ, అక్షింతలు, కంకణాలు అందజేస్తారు. ఇదే సందర్భంగా రూ.300 టికెట్ల క్యూలైను నుండి కొత్త జంటలతోపాటు వారి తలిదండ్రులతో సహా మొత్తం 6 మందిని ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కొత్త జంటకు శ్రీవారి ప్రసాద బహుమానంగా రూ.25 ధరతో కూడిన పది చిన్న లడ్డూలు ఉచితంగా అందజేస్తారు.

ప్రైవేట్ సత్రాలు, మఠాల్లో కల్యాణ వైభోగం
ఇక ధనవంతులు తమ స్థోమతకు తగ్గట్టుగా పెళ్లిని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇందుకోసం తిరుమలలో 23 మఠాలు, మరికొన్ని ప్రైవేట్ సత్రాలు ఉన్నాయి.

రెండుమూడు మినహాయిస్తే దాదాపుగా అన్నిటిలోనూ వివాహ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా కల్యాణ మండపాలు ఉన్నాయి. ఇక్కడ మండపం  అలంకరణ, పురోహితుడు, బాజాభజంత్రీలు, అల్పాహారం నుండి విందు భోజనాలతో సహా, బస వరకు అన్నీ నిర్వాహకులే (కాంట్రాక్టర్) సమకూరుస్తారు.

కల్యాణ మండపం విస్తీర్ణం, వచ్చే బంధుగణం, వారికి సమకూర్చే సంబారాలు, అలంకరణ, వస్తుసేవలను బట్టి నిర్వాహకులు ధర నిర్ణయిస్తారు. కనీసం రూ. లక్ష లేనిదే వివాహ వేడుక సాగే పరిస్థితులు తక్కువ.

టీటీడీ కాటేజీల్లో కల్యాణాలు చేసుకోవచ్చు
టీటీడీకి సంబంధించిన శంకుమిట్ట కాటేజీ (ఎస్‌ఎంసీ) 6, ట్రావెల్స్ బంగ్లా కాటేజీ (టీబీసీ) 2 కల్యాణ మండపాలు ఉన్నాయి. రోజుకు రూ.200 చొప్పున అద్దె కింద కల్యాణ మండపం కేటాయిస్తుంటారు. విద్యుత్ చార్జీలకు అదనంగా  చెల్లించాలి. ఇతర కాటేజీల్లో అనుమతి లేకుండా వివాహాలు చేయకూడదు.

ఆర్థిక స్థోమతను బట్టి కొందరు సాధారణంగా నిర్వహించుకుంటే, మరికొందరు భారీ ఎత్తున, హంగు ఆర్భాటాలతో ఘనంగా వేడుక చేసుకుంటుంటారు.

కల్యాణమండపం, కాటేజీలు పొందటం ఎలా?
90 రోజుల ముందు కల్యాణ మండపాల బుకింగ్ ప్రారంభిస్తారు. మండపాలు ఖాళీ ఉంటే రోజులతో సంబంధం లేకుండా కేటాయిస్తారు.

కల్యాణ మండపం అద్దెకింద రూ.200 చెల్లించాలి. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుపతి, పేరుతో డీడీ చెల్లించాలి.

మండపం దరఖాస్తు సమయంలో పెళ్లినిశ్చయ పత్రిక, వరుడు, వధువు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేయాలి. వారి ఆధార్ కార్డులు కూడా చూపాలి.

కల్యాణ మండపం మధ్యాహ్నం 3  నుండి మరుసటిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కేటాయిస్తారు. మండపం ఖాళీ చేసే సమయంలో వినియోగించిన విద్యుత్ చార్జీలకు గానూ మీటరు రీడింగ్ ప్రకారం నగదు చెల్లించాలి.

కల్యాణ మండపం పెళ్లి రసీదుతో రూ.300 టికెట్ల క్యూలైను ద్వారా వధూవరులతోపాటు ఆరుమందిని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

టీటీడీ కల్యాణ మండపం రశీదుతో తిరుమలలో రిజిస్రేషన్ కార్యాలయం వద్ద వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

డిక్లరేషన్  ఇస్తే...
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోదలచిన ఇతర మతాల వారు కూడా తిరుమలలో వివాహం చేసుకునే సౌకర్యం టీటీడీ కల్పించింది. అయితే వారు ముందుగా ‘హిందూమతంపై విశ్వాసం ఉంది’’ అన్న డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

వెంకన్న సాక్షిగా ఆలయం వద్దే పెళ్లి తంతు
ఆర్థిక పరిస్థితి, కుటుంబ కారణాలతో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండానే శ్రీవారి ఆలయ మహద్వారం, గొల్ల మండపం, అఖిలాండం వద్దకు పసుపుబట్టలతో వచ్చిన వధూవరులు పూలదండలు మార్చుకుంటారు. తర్వాత వరుడు, వధువు మెడలో మంగళసూత్రాన్ని కట్టడంతో వారి పెళ్లి వేడుక పూర్తైతుంది. తర్వాత కొత్త దంపతులు ఆలయ అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు.

నాడు కల్యాణమస్తుతో ఒక్కటైన 45,954 జంటలు
సనాతన హైందవ ధర్మాన్ని విస్తృతం చేయటమే ధార్మిక సంస్థ లక్ష్యంగా కల్యాణమస్తు  కార్యక్రమం ద్వారా హిందూ వివాహ వ్యవస్థకు టీటీడీ గట్టి పునాదులు వేసింది. ఆర్థిక భారంతో సతమతమవుతూ, పెళ్లివేడుకల పేరుతో పేద కుటుంబాలు ఆర్థికంగా మరింత కుంగిపోకూడదని  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు.

రాష్ట్రంలోని పేదల్ని వివాహ బంధంతో ఒక్కటి చేయాలని ధార్మిక సంస్థకు సూచన చేశారు. పేద కుటుంబాలు  ఆర్థికంగా మరింత చతికిల పడకుండా అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో కల్యాణమస్తు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

2007 ఫిబ్రవరి 22న ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (తెలంగాణా, కోస్తా, రాయలసీమ)లో మొత్తం ఆరు విడతల్లో 45,954 మంది జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఈ కల్యాణమస్తు ద్వారా బంగారు తాళిబొట్టు, వెండి మట్టెలు, కంకణాలు, వధూవరులకు నూతన వస్త్రాలు, పెళ్లి నిర్వహణకు అవసరమైన పూజా సామగ్రి, ధార్మిక గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేశారు. పెళ్లికి హాజరైన వధూవరుల బంధువులకు విందు భోజనాన్ని కూడా  ఉచితంగా సమకూర్చారు. తర్వాత కొత్తజంటతోపాటు వారి తల్లిదండ్రులు ఆరు మందికి ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పించారు.

నిబంధనలు ఇవి...
చట్టప్రకారం వధూవరులు మేజరై ఉండాలి. వారి వయసును నిర్ధారించే 10వ తరగతి మార్కుల జాబితా, ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపాలి. పెళ్లికి పెద్దల అంగీకారం ఉండాలి. వ్యక్తిగతంగా వధువు, వరుడి తల్లిదండ్రులు కూడా ఉండాలి. లేనివారు తగిన ఆధారాలను చూపించడంతోపాటు వారి కుటుంబ పెద్దలను వెంటబెట్టుకెళ్లాలి  ఫొటోమెట్రిక్ పద్ధతిలో అందరూ వేలి ముద్రలు వేసి రిజిస్టర్ చేసుకున్నాకే పెళ్లి వేడుక నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత ఎస్‌ఎంసీలోని 232 కాటేజీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాహ రిజిస్టేషన్ సర్టిఫికెట్ కూడా పొందవచ్చు  పౌరోహిత సంఘంలో సామూహిక పెళ్లి వేడుక నిర్వహించుకునేందుకు టీటీడీ కొత్తగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌక ర్యం కల్పించింది. ww.ttdsevaonline.com ద్వారా భక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- సహదేవ కేతారి, సాక్షి తిరుమల

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement