తిరుమల : టీటీడీ ఉచిత వివాహాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తిరుమలలోని పౌరోహిత సంఘంలోని కల్యాణవేదిక కేంద్రంగా తొలిరోజు సోమవారం మొత్తం 42 వివాహాలు జరిగాయి. ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు పురోహితుడికి రూ.500, మేళం రూ.300, వీడియో తీసుకునేందుకు విద్యుత్ చార్జీలకు వసూలు చేసే రూ.60 లను టీటీడీ రద్దుచేసింది. ఆ మేరకు భక్తుల నుండి ఎలాంటి నగదు తీసుకోకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్న మొత్తం 42 జంటలు వివాహాలు ఉచితంగా నిర్వహించింది.
అలాగే మలివిడతలో కొత్త జంటలకు శ్రీవారి కానుకగా పసుపు, కుంకుమ, అక్షింతలు, కంకణాలు అందజేస్తారు. ఇదే సందర్భంగా రూ.300 టికెట్ల నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కొత్త జంటలకు శ్రీవారి బహుమానంగా 25 గ్రాముల పది చిన్న ఉచిత లడ్డూలు అందజేయనున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా త్వరలోనే అమలు చేయనున్నారు.