అవనిగడ్డలో పెరిగిన పాముకాటు కేసులు! | Most Snake Bite Victims Belong To Avanigadda In Krishna District | Sakshi
Sakshi News home page

కోరలు చాచిన కాలనాగులు

Published Thu, Jul 18 2019 9:10 AM | Last Updated on Thu, Jul 18 2019 9:10 AM

Most Snake Bite Victims Belong To Avanigadda In Krishna District - Sakshi

అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో పాముకాటు బాధితులు

సాక్షి, అమరావతి: జీవన చక్రంలో ఒక జీవి.. మరో జీవికి ఆహారంగా మారడం  గమనిస్తూనే ఉంటాం. వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల హల్‌చల్‌ అధికమవుతుంది. కప్పలు, క్రిమికీటకాలను వేటాడేందుకు సర్పాలు అధికంగా బయట సంచరిస్తాయి. ఈ కాలంలోనే పాము కాట్ల బారిన పడుతున్న మనుషుల సంఖ్య ఏటా పెరుగుతోంది. పాము కాటుకు గురికాకుండా ముందు       జాగ్రత్తలు పాటించడం.. ఒక వేళ పాము కాటేసినా సకాలంలో వైద్యుడిని సంప్రదించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. 

వానాకాలం వచ్చిందంటే చాలు చిరు జల్లులు.. వాటితో పచ్చగా మారే పరిసరాలు.. ఆ పరిసరాల్లో ఏపుగా పెరిగే గడ్డి.. దాన్ని తినడానికి వచ్చే కీటకాలు.. వాటిని వేటాడటానికి వచ్చే కప్పలు.. దీంతో పాటే ప్రకృతి చాలా  ఆహ్లాదకరంగా ఉండే కాలం.. ఈ ఆహ్లాదం వెనుకే  ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. విషసర్పాలు యథేచ్ఛగా  సంచరిస్తుంటాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాటేసి ప్రాణం మీదకు తెస్తాయి. అందుకే వర్షాకాలంలో పాము కాట్లు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివాసాలు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో వర్షాకాలంలో గడ్డి, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. వీటి చాటున పాములు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి సాగించే కాలమిది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన సందర్భంగా పాము కాట్లపై ప్రత్యేక కథనం. 

దివిసీమపై అధిక ప్రభావం  
వర్షాకాలం వచ్చిందంటే చాలు దివిసీమ వాసులకు కంటిపై కునుకులేకుండాపోతోంది. ఎప్పుడు ఎవరు పాము కాటుకు గురవుతారోనని భయపడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ మొదలవడంతో పొలాల్లోకి వెళ్తున్న రైతులు, కూలీలు పాము కాటుకు గురవుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 63 మంది పాము కాటు బాధితులు అవనిగడ్డ ఏరియా ఆస్పత్రిలో చేరారని సమాచారం. ఒక్క అవనిగడ్డ ఏరియా వైద్యశాలలోనే గత ఏడాది 350కి పైగా పాము కాటు కేసులు నమోదయ్యాయంటే వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గన్నవరం, మైలవరం ప్రాంతంలోనూ పాము కాటు ప్రమాదాలు తీవ్రత అధికంగానే ఉంటోంది. కొందరు గ్రామీణులు నాటు వైద్యులను సంప్రదించి కాలహరణం చేయడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.   

పెరిగిన పాముల సంతతి  
కొన్నేళ్లుగా దివిసీమలో పాముల సంతతి అమాంతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం వరి పొలాల్లో వాడే గుళికలను రైతులు మూడేళ్లుగా వాడకపోవడమేనని స్థానికులు పేర్కొంటున్నారు. పాముల సంతతి 2009లో వచ్చిన వరదల తర్వాత ఈ ప్రాంతంలో అధికమయ్యిందని, అప్పటి నుంచి ప్రతి ఏడాది వర్షాకాలంలో పాము కాట్లు అధికంగా ఉంటున్నాయని చెబుతున్నారు. మరోవైపు పాములను పట్టి అడవుల్లో వదిలే స్నేక్‌ లవర్స్‌ కూడా ఈ ప్రాంతంలో అందుబాటులో లేకపోవడం మరో కారణం.  

పాటించాల్సిన జాగ్రత్తలు.. 
పాములు సాధారణంగా ఎవరిని ఏమీ చేయవు. వాటికి కూడా ప్రాణభయం ఉంటుంది. వాటికి ప్రమాదమనిపించినప్పుడు, ఏకాంతానికి భంగం కలిగినా, తొక్కడం, వేటాడటం వంటి చర్యలకు ప్రతి స్పందనగా మాత్రమే కాటు వేస్తాయి. మనం ముందు జాగ్రత్తతో చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. పొలానికి వెళ్లే రైతులు, రైతు కూలీలు జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రి వేళలో తిరిగే వారు, అక్కడే నిద్రించే వారు తమ వెంట తప్పనిసరిగా టార్చిలైట్‌ తీసుకెళ్లాలి. పొలాలు, గడ్డి వాముల్లో తిరిగే వారు మోకాళ్ల దాకా రక్షణనిచ్చే బూట్లను ధరించడం ఉత్తమం. చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. పొదలు, పిచ్చి మొక్కలు లేకుండా చూడాలి. రైతుల కోసం పరిశోధనల ద్వారా బెంగళూరుకు ప్రసాదం ఇండస్ట్రీస్‌ వారు ‘స్నేక్‌ గార్డ్‌’ అనే ఒక కర్రను పోలిన యంత్రాన్ని కనుగొన్నారు. దీనిద్వారా వచ్చే అల్ట్రాసోనిక్‌ తరంగాలకు భయపడి పాములు దూరంగా పారిపోతాయి. వీటివల్ల రైతులకే కాక పాముల జాతికి కూడా మానవుల నుంచి రక్షణ లభిస్తుంది. పెట్రోల్, కిరోసిన్‌ వంటి ద్రావణాల వాసనలను పాములు భరించలేవు. తగు జాగ్రత్తలతో వీటిని ఉపయోగించి కొంత వరకు నిరోధించవచ్చు.

ప్రథమ చికిత్స తప్పనిసరి 
పాము కాటుకు గురైన వ్యక్తికి పాము విషం కన్నా.. అతని భయమే ఎక్కువ ప్రమాదం తెస్తుంది. బాధితులకు పక్కనున్న వారు ధైర్యం చెప్పాలి. కాటు వేసిన చోటుకు పైభాగంలో వెంటనే తాడుతో మిగతా శరీరానికి రక్త ప్రసరణ జరగకుండా బిగించి కట్టివేయాలి. గాయం చేసి రక్తం కారనివ్వాలి. వీలైనంత వరకు కాటుకు గురైన వ్యక్తి నడిపించడం చేయరాదు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement