బంధువుల శూలాల్లాంటి మాటలు ఆ మాతృమూర్తి హృదయాన్ని గాయపరిచాయి. ఇద్దరు కుమారుల అంగవైకల్యం గురించి సూటి పోటీ మాటలు వినలేక ఆమె అఘాయిత్యానికి పాల్పడింది. ఇద్దరు కుమారులకు పురుగుల మందు తాగించి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లీ, ఓ కుమారుడు మృతి చెందగా, మరో కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు.
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘోర విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్మరి సుజాత(24), మద్దిలేటి దంపతులకు మహేశ్ (9), సుబ్బయ్య (7) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ అంగవైకల్యంతో పుట్టారు. ఏ వేడుకకు వెళ్లినా బంధువులు వారి కుమారుల వైకల్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతుండడంతో సుజాత హృదయం తట్టుకోలేకపోయింది. మంగళవారం ఉదయం భర్తతోపాటు అత్త, మామలు పొలం పనులకు వెళ్లగా... ఇంట్లో ఉన్న సుజాత ఇద్దరు కుమారులకు పురుగుల ముందు ఇచ్చి తాను కూడా తాగింది.
ఇది గమనించిన స్థానికులు వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుబ్బయ్య మృతి చెందాడు. వైద్యుల సూచన మేరకు సుజాతను ఢోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా... ఆమె అక్కడ ప్రాణాలు విడిచింది. మహేశ్ ప్రాణాపాయ పరస్థితుల్లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.