
ఐసీడీఎస్ అధికారులతో బాలుడు (ఇన్‌సెట్‌లో) గాయాలు చూపుతున్న ప్రభాకర్
నెల్లూరు,నాయుడుపేటటౌన్: కొడుక్కి భయం పెట్టాలని ఓ తల్లి ఏడేళ్ల కొడుకు చేతులపై వాతలపెట్టిన ఘటన పట్టణంలోని మునిరత్నంనగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరులోని గుంటూరువారితోటకు చెందిన బోంతపూడి ధనలక్ష్మి పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన సురేష్‌ను ప్రేమవివాహం చేసుకుంది. వీరికి 5వ తరగతి చదువుతున్న పవన్, రెండో తరగతి చదువుతున్న ప్రభాకర్, ఒకటో తరగతి చదువుతున్న రోజా అనే ముగ్గురు పిల్లలున్నారు. సురేష్ నాయుడుపేట పట్టణంలో నివాసముంటూ ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తూ భార్యాపిల్లలను పోషించేవాడు. రెండునెలల క్రితం భార్యాభర్తల మధ్య కలహాలు చెలరేగి సురేష్ ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో ధనలక్ష్మి కూలి పనులకు వెళుతూ పిల్లలను పోషిస్తోంది.
ఈ క్రమంలో వారంరోజుల క్రితం ప్రభాకర్ తరచూ ఇంటిపక్కన ఉన్న పిల్లలతో గొడవకు దిగడమే కాకుండా మలవిసర్జనను పక్క ఇళ్లలో పడవేస్తున్నట్లుగా పొరుగింటి వారు వివాదానికి దిగారు. దీంతో కొడుక్కి భయపెట్టాలని ధనలక్ష్మి అట్లకాడను కాల్చి ప్రభాకర్ రెండు చేతులపై వాతలు పెట్టింది. అయితే చేతులకు పెద్దఎత్తున బొబ్బలు లేసి చీముపట్టి ఉండటాన్ని స్థానికులు బుధవారం గుర్తించి విచారించారు. అంతేకాకుండా బాలుడికి సరైన వైద్యచికిత్స సైతం అందించకుండా ఇంటి వద్ద వదిలేసి ధనలక్ష్మి ఉదయం వెళ్లి సాయంత్రం వస్తుండటంతో స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై అక్కడ ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త సూపర్‌వైజర్ ఉమామహేశ్వరికి విషయం తెలియజేసింది. ఆమె మునిరత్నంనగర్‌కు వెళ్లి ప్రభాకర్ పరిస్థితి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లితో పాటు బాలుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. కుమారుడికి భయం పెట్టేందుకే కాల్చానని ఇంత గాయమవుతుందని తెలియదని ధనలక్ష్మి వాపోయింది. తన కోపం కారణంగానే భర్త కూడా వెళ్లిపోయాడని చెప్పడంతో వారు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బాలుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment