మహోగ్రరూపం | Movement, a new excise officials | Sakshi
Sakshi News home page

మహోగ్రరూపం

Published Thu, Oct 10 2013 1:57 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

Movement, a new excise officials

=ఉద్యమంలోకి కొత్తగా ఎక్సైజ్ అధికారులు
 = నేటి నుంచి మద్యం విక్రయాలకు బ్రేక్
 = విద్యుత్ కోతలతో జనం విలవిల
=  గన్నవరం ఎయిర్‌పోర్టుకూ ‘కట్’కట

 
సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం మహోగ్రరూపు సంతరించుకుంటోంది. బుధవారం ఎక్సైజ్ అధికారులు విజయవాడలో ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డారు. రేపటి నుంచి సమ్మెలోకి దిగాలని, మద్యం సరఫరా బంద్ చేయాలని నిర్ణయించారు. మరోవైపు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కూడా జేఏసీగా ఏర్పడి 17న సాగునీటిని 24 గంటలపాటు బంద్ చేసి రైతులను చైతన్యవంతం చేయాలని నిర్ణయించారు. దీంతో సీమాంధ్రలో ఉద్యమ ఉధృతి పెరిగింది. జిల్లాలో విద్యుత్ కోతలతో జనం విలవిలలాడుతున్నారు. మంచినీరు కూడా అందక ప్రజలు అగచాట్లకు గురవుతున్నారు. విద్యుత్ లేకపోవటంతో చిరు వ్యాపారాలు గణనీయంగా తగ్గిపోయాయి. పరిశ్రమలు వరుసగా మూడోరోజూ మూతపడ్డాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమలు నడపటం కష్టమని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.
 
విమానాశ్రయానికీ విద్యుత్ సెగ...

విద్యుత్ సెగ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు కూడా తగిలింది. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కోత విధించారు. విమాన సర్వీసులకు ఎటువంటి అంతరాయం కలగలేదు. రాష్ట్ర విభజన ప్రక్రియకు నిరసనగా సమైక్య ఆందోళనలు కొనసాగాయి. ఏపీ ఎన్‌జీఓ జేఏసీ పిలుపు మేరకు జిల్లాలో ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. బ్యాంకులు, పోస్టాఫీసులు పనిచేయలేదు. టెలిఫోన్ ఎక్ఛేంజ్‌లు మూతపడ్డాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైద్య సిబ్బంది విధులు బహిష్కరించటంతో ఆస్పత్రిలో కాన్పులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కుంటుపడ్డాయి.

కొనసాగిన రిలే దీక్షలు...

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణదీక్షకు మద్దతుగా అవనిగడ్డలో నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయం ముందు చేపట్టిన రిలేదీక్షలు ఐదోరోజుకు చేరాయి. కోడూరు, నాగాయలంక మండలాల్లో దీక్షలు కొనసాగుతున్నాయి. చల్లపల్లిలో జేఏసీ చేపట్టిన దీక్షలు 61వ రోజుకు చేరాయి. చల్లపల్లి ప్రధాన సెంటర్‌లో జేఏసీ నాయకులు జిలేబీలు, సమోసాలు అమ్మి నిరసన తెలియజేశారు. అవనిగడ్డ న్యాయవాదుల సమైక్యాంధ్ర చైతన్యయాత్ర చల్లపల్లి మండలంలో సాగింది. స్థానిక హీరోహోండా షోరూం సిబ్బంది దీక్ష చేశారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 49వ రోజుకు చేరాయి.

జేఏసీ పిలుపు మేరకు దివిసీమలో ప్రభుత్వ రంగ సంస్థలు బంద్ పాటించాయి. జేఏసీ నాయకులు బ్యాంకులు, ఎల్‌ఐసీ, టెలికాం, పోస్టాఫీస్‌లను మూసివేయించారు. గుడివాడలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో జరుగుతున్న దీక్షలలో రెవెన్యూ అసోసియేషన్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు దీక్షలు, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగుతున్నాయి.

గుడ్లవల్లేరు సెంటర్‌లో గాదేపూడి పంచాయితీ పాలకవర్గ సభ్యులు బుధవారం రిలేదీక్షలలో పాల్గొన్నారు. నందివాడ మండలం టెలిఫోన్ నగర్ వద్ద ఉపాధ్యాయులు దీక్షలు కొనసాగుతున్నాయి. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు బుధవారానికి 64వ రోజుకు చేరాయి. కలిదిండి, మండవల్లి మండలాల్లో ఆదర్శరైతులు దీక్షలు చేపట్టారు. కైకలూరు తాలూకా సెంటర్‌లో ఎన్జీవో దీక్షలు 57వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా కైకలూరు వివేకానంద యూత్ సభ్యులు రిలే దీక్షలు చేశారు.

ముదినేపల్లిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 48వ రోజుకు చేరాయి. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల పరిధిలో సమైక్యాంధ్ర కోసం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని మున్సిపల్ కూడలి సమీపంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో విద్యుత్ ఉద్యోగులు కూర్చున్నారు. జేఏసీ రిలేదీక్షలు 51వ రోజుకు చేరుకున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
 
జగ్గయ్యపేటలో రైల్‌రోకో

జగ్గయ్యపేటలో రైల్వే స్టేషన్ వద్ద రైల్‌రోకో నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు పట్టాలపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. మైలవరంలో జోగి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ సీపీ రిలే నిరాహారదీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 44వ రోజుకు చేరుకున్నాయి.

తిరువూరులో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల బంద్ రెండోరోజు కూడా నిర్వహించారు. టెలిఫోన్ ఎక్ఛేంజ్, బ్యాంకులు, పోస్టాఫీసు, ఎల్‌ఐసీ కార్యాలయాల్ని జేఏసీ నాయకులు మూసివేయించారు. తిరువూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలేదీక్షలు ఎనిమిదోరోజూ కొనసాగాయి. బోస్‌సెంటర్, సినిమాహాల్స్ సెంటర్లలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించిన రిలేదీక్షల్లో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 63వ రోజుకు చేరాయి. చిన్నగాంధీబొమ్మ సెంటరులోని రిలేదీక్ష శిబిరంలో ప్రింటర్స్ అసోసియేషన్ నాయకులు కూర్చున్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జంక్షన్‌రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 44వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను వైఎస్సార్‌సీపీ నేత అభినేష్ ప్రారంభించారు. విజయవాడలో ఉద్యోగ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మాసివేయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement