వాడి.. వేడి | movement continueing very rapidly in ysr district | Sakshi
Sakshi News home page

వాడి.. వేడి

Published Sat, Sep 21 2013 2:35 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM

జిల్లాలో సమైక్య ఉద్యమం చెక్కు చెదరని సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఏపీ ఎన్జీఓలు, ఉద్యోగులు ఉద్యమంలో కదం తొక్కుతున్నారు.

సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఉద్యమం చెక్కు చెదరని సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఏపీ ఎన్జీఓలు, ఉద్యోగులు ఉద్యమంలో కదం తొక్కుతున్నారు.  వివిధ వర్గాల వారు ఉద్యమంలో పాలుపంచుకుంటూ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే పన్నాగాన్ని సాగనీయబోమని హెచ్చరిస్తున్నారు. మంత్రి సి.రామచంద్రయ్య గురువారం ఎన్జీఓలు, ఉపాధ్యాయుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం లేపాయి.
 
 జిల్లా వ్యాప్తంగా మంత్రి రామచంద్రయ్య దిష్టిబొమ్మలకు చెప్పుల దండలతో శవయాత్ర నిర్వహించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అలాగే కడప బంద్ విజయవంతమైంది. ఎన్జీఓలపెపైట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని  ఉద్యమకారులు హెచ్చరించారు. వైవీయూ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది వర్శిటీ నుంచి కలెక్టరేట్ వరకు 20 కిలోమీటర్ల మేర వేలాది మందితో పాదయాత్ర చేపట్టి సమైక్య నినాదాలతో హోరెత్తించారు.
 
 డప నగరంలో ఏపీ ఎన్జీఓలు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ, మున్సిపల్ కార్మికులు మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యల పట్ల నిప్పులు చెరిగి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉదయం నుంచే పట్టణంలో కలియ తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. స్వల్ప ఘటనలు మినహా బంద్ ప్రశాంతంగా సాగింది.
 
  నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నీటిపారుదలశాఖ ఇంజినీర్లు, సిబ్బంది, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ ఉద్యోగులు రాస్తారోకోతో కదం తొక్కారు. నగరంలో రిలే దీక్షలు కొనసాగాయి. డీఆర్‌డీఏ రిలే దీక్షా శిబిరానికి  ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీఆర్వో ఈశ్వరయ్య, ఆర్డీఓ వీరబ్రహ్మం, డీఆర్‌డీఏ పీడీ వెంకట సుబ్బయ్య,  సంఘీభావం తెలిపి మాట్లాడారు.
 
 జమ్మలమడుగులో క్రిస్టియన్లు రిలే దీక్షల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. ప్రైవేటు పాఠశాలలు, ఎస్వీడీసీ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి గాంధీజీ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. మంత్రి రామచంద్రయ్య వెంటనే రాజీనామా చేయాలని, ఉద్యోగ సంఘాల నాయకులపై కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.
 
 
  రాజంపేట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు  సంపూర్ణ బంద్ చేపట్టారు. రోడ్లపైనే వంటా వార్పు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పలపత్తూరుకు చెందిన 40 మంది కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బియ్యం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సాగింది. ఎమ్మెల్యే సోదరులు అనిల్‌రెడ్డి, మురళిరెడ్డి సంఘీభావం తెలిపారు.
 
  బద్వేలులో ఎమ్మార్పీఎస్ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. మోకాళ్లపై నడుస్తూ నిరసన తెలిపారు. మంత్రి  రామచంద్రయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోరుమామిళ్లలో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు చొక్కాలు విప్పి రోడ్డుపై బైఠాయించి మంత్రి రామచంద్రయ్య తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేతృత్వంలో రాజా అనే పేరుగల వ్యక్తులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
 
  ప్రొద్దుటూరులో ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి రామచంద్రయ్య దిష్టిబొమ్మను పట్టణంలో ఊరేగించి దీక్షా శిబిరం వద్ద చెప్పుల దండలు వేసి దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో తాళ్లమాపురానికి చెందిన 30 మందికి పైగా మహిళలు దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు నేతృత్వంలో ఇందిరాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి సోనియాకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు.
 
  రైల్వేకోడూరు పట్టణంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపైన నిలబడి నిరసన తెలిపారు. వీరికి కాకతీయ పాఠశాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. జాతీయ నాయకుల వేషధారణలు ఆకట్టుకున్నాయి.
 
 పులివెందులలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, వరప్రసాద్ నేతృత్వంలో సాగింది. పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఏపీ ఎన్జీఓల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. చక్రాయపేటలో వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ కొండారెడ్డి నేతృత్వంలో రాస్తారోకోతో నిరసన తెలిపారు.
 
 రాయచోటిలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి రామచంద్రయ్య దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. కేజీబీవీ విద్యార్థులకు రోడ్డుపైనే పాఠాలు బోధించి నిరసన తెలిపారు.
 
  మైదుకూరులో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, స్కూలు విద్యార్థులు  ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. వీరికి ముస్లింలు సంఘీభావం తెలిపారు.
 
 కమలాపురంలో జేఏసీ నేత రామ్మోహన్ నేతృత్వంలో పాపాఘ్ని నదిలో జలదీక్ష చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement