మన గడ్డంటే ‘మూవీ మొఘల్’కు ఎంత మక్కువో..
అమలాపురం టౌన్ :వెండితెరకు ‘ప్రేమనగర్, జీవనతరంగాలు’ వంటి ఎన్నో కళాఖండాలను నజరానాగా ఇచ్చిన మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడికి గోదావరి జిల్లాలంటే వల్లమాలిన అభిమానం. ఇక్కడి గోదావరి పరవళ్లు, ప్రకృతి అందాలంటే ప్రాణం. గ్రామీణ వాతావరణంతో ముడిపడ్డ కథ అయితే గోదావరి , ఏటిగట్లు, లంకలు, పల్లెపట్టుల్నే ఎంచుకుని చిత్రీకరించే వారు. జిల్లాలో ముఖ్యంగా కోనసీమలో షూటింగ్ జరిగేటప్పుడు రామానాయుడు చిత్రీకరణ పర్యవేక్షణపై కంటే గోదావరి పరవళ్లనే చూస్తూ మురిసిపోయేవారు. నూటయాభై చిత్రాల ఆ మహానిర్మాత మరణం జిల్లావాసులను కలచివేస్తోంది.
దాదాపు నలభైఏళ్ల క్రితం శోభన్‌బాబు హీరోగా, 2005లో తరుణ్ హీరోగా ‘సోగ్గాడు’ పేరుతో రామానాయుడు తీసిన రెండు సినిమాలను జిల్లాలోని గోదావరి తీరాల్లో చిత్రీకరించారు. ఇక 1982లో శోభన్‌బాబు, శ్రీదేవి, జయప్రదలతో నిర్మించిన ‘దేవత’ చాలా వరకూ కోనసీమలోని గోదావరిపాయల్లో, లంకల్లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ‘వెల్లువొచ్చి గోదారమ్మా... వెల్లాకిలా పడ్డాదమ్మా’ అనే పాట కోనసీమవాసుల నోట నేటికీ పల్లవిస్తూనే ఉంటుంది. మామిడికుదురు మండలం పెదపట్నంలంకను ఆనుకుని ప్రవహించే వైనతేయ నదీ తీరాన..లంకలో ఆ పాటను పూర్తిగా చిత్రీకరించారు. పాట ఆద్యంతం గోదావరిలో తేలియాడుతూ కనిపించే బిందెలను అమర్చినప్పుడు దర్శకుడు రాఘవేంద్రరావుకు రామానాయుడు పలు సూచనలు ఇచ్చారని ఆ గ్రామస్తులు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
అమలాపురం వచ్చి బాలయోగికి నివాళులు
‘చంటి’ సినిమాకు కె.ఎస్.రామారావు నిర్మాతైనా అందులో తన కుమారుడు సురేష్ కూడా భాగస్వామి కాావటంతో రామానాయుడు కోనసీమలో ఆ చిత్రం షూటింగప్పుడు వారం రోజులు రాజోలులో మకాం చేశారు. మలికిపురం మండలం కేశనపల్లిలోని శంకరగుప్పం కౌశిక కాల్వలో ‘ఎన్నెన్నో అందాలు’ అనే పాటను చిత్రీకరించినప్పుడు ఆ గ్రామంలో రామానాయుడు నాలుగు రోజులు గడిపారు. 1998లో రాజశేఖర్ హీరోగా ‘శివయ్య’ సినిమాను అల్లవరం మండలం కోడూరుపాడు, బోడసకుర్రు వైనతేయ ఒడ్డున చిత్రీకరించారు. ఈ సినిమాలోని పలు దృశ్యాలకు అప్పటి రాష్ట్ర మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు క్లాప్ కొట్టారు. ‘అహనా పెళ్లంట, ముందడుగు, నాయుడుగారి కుటుంబం, నువ్వులేక నేను లేను, హిందీ చిత్రం అనారీ’ల షూటింగ్ కూడా వంటి కోనసీమలో ఎక్కువశాతం జరిగింది. 2002లో అప్పటి లోక్‌సభ స్పీకర్ బాలయోగి మృతి చెందినప్పుడు రామానాయుడు అమలాపురం వచ్చి ఎస్‌కేబీఆర్ కళాశాలలో ఉంచిన బాలయోగి భౌతికకాయానికి నివాళులర్పించారు.
‘అన్నదాతా! సుఖీభవ’ అని దీవించారు..
మండపేట రూరల్ : ముందు వచ్చిన ‘సోగ్గాడు’లో హీరో శోభన్‌బాబు రైతు బిడ్డగా ఎడ్లబండిపై పంట పొలాల్లో వెళుతున్న దృశ్యాలను మండపేట తదితర ప్రాంతాలతో పాటు కోనసీమలోనూ చిత్రీకిరించారు. మండపేటలో చౌదరి అనే రైతుకు చెందిన ఎడ్లను, బండిని ఆ సినిమాలో ఉపయోగించారు. రామానాయుడు ఆ ఎడ్లను చూసి మురిసిపోవటమే కాక వాటితో సరదాగా గడిపేవారని మండపేట ప్రాంత వాసులు చెబుతున్నారు. అప్పట్లో తెల్లదుస్తులు, నల్లకళ్లజోడుతో హుందాగా కనిపించే రామానాయుడుని చూసి ‘ఈయనా సోగ్గాడే’ అని ఇక్కడి వారు వ్యాఖ్యానించేవారు. మూడేళ్ల కిందట ‘బెండు అప్పారావు’ చిత్రీకరణ సమయంలో కూడా రామానాయుడు రాజమండ్రి, తాపేశ్వరరం వంటి ప్రదేశాల్లో కొద్దిరోజులు ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ శ్రీభక్తాంజనేయ స్వీట్‌స్టాల్‌లో మూడు రోజులు జరిగింది. అక్కడే ఉండి పర్యవేక్షించిన రామానాయుడు ఆ మూడురోజులూ శ్రీభక్తాంజనేయస్వీట్‌స్టాల్‌లోనే భోజనం చేశారు. ఆయన సమయపాలనను, భోజనం చేసిన అనంతరం ‘అన్నదాతా సుఖీభవ’ అని దీవించారని శ్రీభక్తాంజనేయస్వీట్‌స్టాల్ యాజమాన్యం, సిబ్బంది ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆయన మృతి పట్ల స్వీట్‌స్టాల్ అధినేత సలాది శ్రీనుబాబు, సిబ్బంది సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనకు మూడు రోజులు భోజనం పెట్టే అవకాశం కలగడం మరువలేని అనుభూతి అన్నారు.
మొక్కలంటే తగని మక్కువ
కడియం : రామానాయుడికి మొక్కలంటే అమితమైన ఆసక్తి అని కడియం నర్సరీ రైతులు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణవార్త విని దిగ్భ్రాంతి చెందిన వారు పలు సినిమా షూటింగ్‌లకు ఆయన తమ నర్సరీలకు వచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు. వచ్చినప్పుడల్లా వివిధ రకాల మొక్కలను గురించి ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకునే వారని చెప్పారు. ‘నాయుడుగారికుటుంబం, పరువుప్రతిష్ట’ వంటి చిత్రాల్లో పలు సన్నివేశాలతోపాటు, ఏవీఎస్ దర్శకత్వంలో నిర్మించిన ‘శ్రీకట్నలీలలు’ అధికభాగం పల్ల వెంకన్న నర్సరీలోనే చిత్రీకరణ జరుపుకొంది. ఈ నేపథ్యంలో రామానాయుడితో ఏర్పడిన అనుబంధాన్ని పల్లవెంకన్న గుర్తు చేసుకున్నారు.