
‘పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా అన్నారు’
‘ప్రత్యేక హోదా’ అమలు చేయాలి: ఎంపీ బుట్టా రేణుక
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక కేంద్రాన్ని కోరారు. ఎన్‌ఐటీ, ఎస్‌ఈఆర్ సవరణ బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విభజన చట్టంలో ఇచ్చిన ఒక్కో హామీని కేంద్రం నెరవేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అశాంతికి గురిచేస్తోందని చెప్పారు. అందువల్ల ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడంతో పాటు పార్లమెంటులో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ను నెలకొల్పడం సంతోషకరమని పేర్కొన్నారు. తిరుపతిని విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధిపరచాలని కోరారు. సైన్స్ ఎడ్యుకేషన్‌ను అందరికీ అందుబాటులోకి తేవాలన్నారు. శాస్త్రీయ పరిశోధనలపై అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న వ్యయంతో పోలిస్తే మన దేశం చేస్తున్న ఖర్చు చాలా స్వల్పమని చెప్పారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థల సంఖ్య పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ బుట్టా రేణుక కోరారు.