విజయనగరం జిల్లా టీడీపీ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్న విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానం, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హోదా హామీని అమలు చేయని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 30న విశాఖలో చేపట్టనున్న ‘వంచన దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కోరారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నాయకులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. వంచన దినం సందర్భంగా ఆ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు 12 గంటల పాటు పార్టీ నేతలు నిరాహార దీక్ష చేపడతారని చెప్పారు.
ఈ కార్యక్రమానికి ఇటీవల రాజీనామాలు చేసిన పార్టీ ఎంపీలు, రాజ్యసభ్యులతో పాటు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర జరుగుతున్న జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనాయకులంతా హాజరవుతారని వివరించారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాపై ప్రజలను ఎలా మోసం చేస్తున్నది, తప్పుదారి పట్టిస్తున్నదీ ఆయా నియోజకవర్గాల్లో వివరించాలని కోరారు. వంచన దీక్షకు వేదిక స్థలాన్ని ఎక్కడ ఖరారు చేయాలన్న దానిపై నాయకులతో విజయసాయిరెడ్డి చర్చించారు. అందరి సూచనల మేరకు ఏకాభిప్రాయంతో పాత జైల్‌రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న మహిళా కళాశాల ఎదురుగా ఉన్న స్థలం అనువైనదిగా ఉంటుందని నిర్ధారణకు వచ్చారు.
చివరకు ఆ స్థలాన్ని ఖరారు చేశారు. వంచన దినం కార్యక్రమానికి తరలి వచ్చే వేలాది మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత సమన్వయకర్తలు, నాయకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్సార్‌సీపీ ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగిస్తుందని, ఇందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధులై ఉండాలని చెప్పారు. సమీక్షా సమవేశంలో మాడుగుల ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ శాసనసభ పక్ష ఉపనేత బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ, అనకాపల్లి, అరకు పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్‌నాథ్, పరీక్షిత్‌రాజు, అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాదరాజు, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, సత్తిరామకృష్ణారెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, అదీప్‌రాజు, పెట్ల ఉమాశంకర్ గణేష్, చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, శెట్టి ఫల్గుణ, అక్కరమాని వెంకట్రావు, సీఈసీ సభ్యులు శ్రీకాంత్‌రాజు, కంపా హనోకు, రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, అదనపు కార్యదర్శులు జి. రవిరెడ్డి, పక్కి దివాకర్, నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఫరూఖీ, బోని శివరామకృష్ణ, వాసు, షరీఫ్, బర్కత్ ఆలీ, పాత్రుడు, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన టీడీపీ నేతలు
విజయనగరం టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, చినశ్రీను సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. గుత్తిరాల వెంకటేశ్వరరావు, కొండపల్లి సునీల్, కోకర్ల మస్తాన్ చౌదిరి,మయనేన మోషన్‌సాయి,పెలిశేటి రమేష్,పర్వతనేని సత్యనారాయణ,కడియాల రామకృష్ణ(ఆర్.కె) పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment