'జైల్లో పెట్టినా వెనక్కు తగ్గను.. పాదయాత్ర ఆపను'
- ఈ నెల 26 నుంచి పాదయాత్ర కొనసాగుతుంది
- చంద్రబాబుపై మండిపడిన ముద్రగడ పద్మనాభం
కాకినాడ: కాపుల రిజర్వేషన్ కోసం ఈ నెల 26న తాను తలపెట్టిన పాదయాత్ర యథాతథంగా కొనసాగుతుందని కాపుల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. పాదయాత్ర విషయంలో జైల్లో పెట్టినా వెనుకకు తగ్గబోనని, నిరవధికంగా పాదయాత్ర కొనసాగి తీరుతుందని ఆయన చెప్పారు. కాపులకు రిజర్వేషన్ అడుగటం తాను చేసిన నేరమా? అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
'చంద్రబాబు బాటలోనే నేను పాదయాత్ర చేస్తా. గతంలో చంద్రబాబు పాదయాత్రకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారో.. ఆ ఫార్మాట్‌ను నాకు పంపించండి' అని ముద్రగడ విలేకరులతో అన్నారు. కాపుల రిజర్వేషన్లపై జీవో 30ని అమలు చేస్తానని చెప్పిన చంద్రబాబు.. తన ఉద్యమాన్ని అణిచేందుకు సెక్షన్ 30ఏను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ఇంటి చుట్టూ, జిల్లా అంతటా పోలీసులను మోహరించారని తెలిపారు.
'చంద్రబాబు, మీ పాలనను చూసి సిగ్గుపడుతున్నాం. మీ పరిపాలనను చూసి మీరే సిగ్గుతో తలదించుకోవాలి' అని వ్యాఖ్యానించారు. తుని ఘటనకు సంబంధించి 69 కేసుల్లో 330 మందిని ముద్దాయిలను చేశారని విమర్శించారు. ఈ కేసులనే తమకు రిజర్వేషన్‌గా భావించమంటే సంతోషంగా భావిస్తామని అన్నారు. తుని సభకు వచ్చిన 15లక్షలమంది కాపులపై కేసులు నమోదుచేసి ఉరిశిక్ష వేసినా తాము భయపడబోమన్నారు. తన జాతి కోసం పోరాడుతుంటే ఎందుకు అడ్డుతలుగుతున్నారని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మీ రాక్షసపాలనలో ఇది భాగమా? అని అడిగారు.
ముద్రగడ కంటతడి
కాపుల రిజర్వేషన్ విషయంలో మీడియాతో మాట్లాడిన ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. తనకు, తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నట్టు తెలిపారు. గతంలో తన భార్య, కోడలు, కొడుకుతో పోలీసులు వ్యవహరించిన తీరు తనను ఇప్పటికీ బాధిస్తోందన్నారు. అందుకే వారంలో రెండు రోజులు నేను ఏడుస్తున్నానని చెప్పారు. ఒక్కోసారి ఎందుకు బతికి ఉన్నానా అనిపిస్తోందని తెలిపారు. తన కుటుంబాన్ని అవమానించిన వారికి శిక్షలు పడేవరకు తానుండాలనే ఆలోచనతోనే బతుకుతున్నట్టు చెప్పారు.