పాదయాత్రతో సత్తా చూపించాం
‘పాదయాత్ర ద్వారా కాపుల సత్తా చూపాం. మీ సవాల్‌కు పాదయాత్రతో కనువిప్పు కలిగించా’మని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు.
- నంద్యాల ఉప ఎన్నికలో ధనప్రవాహం
- మీడియా సమావేశంలో కాపు ఉద్యమనేత ముద్రగడ
జగ్గంపేట : ‘పాదయాత్ర ద్వారా కాపుల సత్తా చూపాం. మీ సవాల్‌కు పాదయాత్రతో కనువిప్పు కలిగించా’మని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్రపై హేళన చేశారని, దీనిపై సర్కార్‌కు బొప్పి కట్టేలా ఐదారు కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టి సత్తా చాటామన్నారు.
ఇంటెలిజెన్స్ బాస్‌దే వైఫల్యం : పాదయాత్ర చేపట్టడంతో డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బలిపశువులను చేయాలని చూస్తున్నారని, వారి వైఫల్యం లేదని, మొత్తం మీ ఇంటెలిజెన్స్ బాస్ వైఫల్యమేనన్నారు. కాగా, పాదయాత్ర తదుపరి కార్యాచరణపై ఈనెల 30న కాపు జేఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామన్నారు. ఇందుకోసం పాదయాత్రకు తాత్కాలికంగా రెండు రోజులు విరామం ప్రకటించామన్నారు. నంద్యాల ఉపఎన్నికపై మాట్లాడుతూ... అక్కడ విచ్చలవిడిగా నోట్లు పంచారని, అధికార దుర్వినియోగం బాగా జరిగిందన్నారు. ఉప ఎన్నిక ప్రభావం 2019 సాధారణ ఎన్నికల్లో ఉండదన్నారు. కాగా, ఆదివారం నాటి ఘటనతో పోలీసులు కిర్లంపూడిలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.