
పసిమొగ్గను చిదిమేశారు..
మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన కిరాతకులు నిర్దాక్షిణ్యంగా చిదిమేశారు. సజీవంగా వస్తాడనుకొని ఆశగా ఎదురు చూసిన ఆ తల్లికి గర్భశోకమే మిగిలింది.
ముండ్లమూరు : బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చీరాని మాటలతో ముద్దుముద్దుగా మాట్లాడే పసివాడిని కిడ్నాపర్లు అతి కిరాతకంగా చంపారు. ఆ వివరాల్లోకెళ్తే... మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి చెందిన ముకిరి సునీతను అదే మండలం వలపర్ల గ్రామానికి చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేశారు. వారికి ప్రస్తుతం ఐదేళ్ల కుమార్తె హారిక, కుమారుడు ముకిరి ఆకాష్ (3) సంతానం కాగా, ఇటీవల సునీత భర్త మృతిచెందాడు. అప్పటి నుంచి పిల్లలిద్దరినీ తీసుకుని కోలలపూడి గ్రామంలోని పుట్టింటికి వచ్చి నివాసం ఉంటోంది.
ఈ నేపథ్యంలో ముండ్లమూరు మండలం వేముల గ్రామంలోని బంధువుల ఇంట్లో అన్నప్రాసన కార్యక్రమానికి గత సోమవారం పిల్లలతో కలిసి సునీత వచ్చింది. సాయంత్రం సమయంలో ఆకాష్ ఆడుకుంటూ రోడ్డుమీదకు వెళ్లడంతో గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై ఎత్తుకెళ్లారు. కొందరు గమనించి సునీతకు చెప్పడంతో ఆమెతో పాటు బంధువులంతా చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఐదురోజులుగా చిన్నారి కోసం కుటుంబ సభ్యులంతా ఎదురుచూస్తుండగా శనివారం స్థానిక చిలకలేరు వాగులో శవమై కనిపించాడు.
గడ్డి కోసుకుని అటుగా వస్తున్న మహిళ గమనించి ఆకాష్ బంధువులకు సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాలుని మృతదేహాన్ని బయటకు తీయించారు. దర్శి సీఐ టీవీవీ ప్రతాప్‌కుమార్, ఎస్సై ఎన్.రాఘవరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చిన్నారి తల, కాళ్లపై గాయాలుండటాన్నిబట్టి కిడ్నాపర్లు హత్యచేసి చిలకలేరులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
అంతుచిక్కని కారణం...
ఆకాష్‌ను కిడ్నాప్‌చేసి హత్యచేయడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. కిడ్నాప్ అనంతరం వారి నుంచి ఎలాంటి డిమాండ్ కూడా లేదు. ఎవరు కిడ్నాప్ చేశారో కూడా తెలియడం లేదు. గుంటూరు జిల్లా నూజెళ్ల మండలం ముప్పరాజువారిపాలెం ప్రాంతానికి చెందిన కొందరు ఈ ప్రాంతంలో కాగితాలు ఏరుకుంటూ గతంలో ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారు. దీంతో ప్రస్తుతం వారిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికీ మూడేళ్ల బాలుడిని ఘోరంగా హతమార్చడాన్ని ఆ కుటుంబంతో పాటు ప్రజలంతా జీర్ణించుకోలేకపోతున్నారు.