యాంకర్, గన్మన్లకు మంత్రిగారి కోటింగ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మంత్రి మృణాళిని ప్రసంగానికి అడ్డు తగిలిందెవరు? సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించాలని గన్‌మన్ ద్వారా స్లిప్పు పంపించిన యాంకర్ వెనక ఉన్న వ్యక్తి ఎవరు ? గన్‌మన్ చేసిన పాపమేంటి? ఇప్పుడిదే టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. అయోధ్య మైదానంలో గురువారం జరిగిన చంద్రన్న సంక్షేమ అవగాహన సభలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి కిమిడి మృణాళినికి అవమాన కర పరిస్థితి ఎదురైంది. మంత్రి ప్రసంగిస్తుండగా ఆ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్న మహిళ ముగింపు పలకాలంటూ గన్‌మెన్ ద్వారా స్లిప్పు పంపించారు. దీంతో మంత్రి అసహనానికి లోనై కాసేపు తర్వాత ప్రసంగాన్ని ముగించారు. ఇంకేముంది ఆ తర్వాత చిర్రెత్తిపోయారు. స్లిప్పు ఇచ్చిన గన్‌మన్‌పై విరుచుకుపడ్డారు. ఎవరిచ్చారని గన్‌మన్‌ను గట్టిగా నిలదీశారు.
నీ స్థాయి తెలుసుకుని ప్రవర్తించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంకర్ ఇచ్చారని చెప్పినా గన్‌మన్ కు మందలింపు తప్పలేదు. ఆ తర్వాత యాంకర్‌కి కోటింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా సభ నిర్వాహకులైన సాంఘి క సంక్షేమ శాఖ డీడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలీ యాంకర్ల సంస్కృతేంటి? పెట్టమన్నదెవరని కడిగి పారేశారు. మంత్రికిచ్చే గౌరవమిదేనా? మీ హద్దుల్లో ఉండకపోతే బదిలీ తప్పదని గట్టిగా హెచ్చరించినట్టు కూడా తెలిసింది. ఇకపై యాంకర్లను పెడితే ఊరుకునేది లేదని గట్టిగా మందలించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సాక్షాత్తు మంత్రి ప్రసంగాన్నే ఆపాలంటూ స్లిప్పు పంపించడం వెనక ఎవరున్నారన్నదానిపై టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రూపుల పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నేతలెవరో చెప్పడం వల్లే అధికారులు ఈ సాహసం చేశారని, ఆ క్రమంలో యాంకర్ ద్వారా స్లిప్పు పంపించి ఉండొచ్చన్న వాదనలు విన్పిస్తున్నాయి. అయితే, వెనుకున్న వ్యక్తులెవరో ప్రస్తుతానికి బయటికి రాకపోయినా ఏదో ఒక రోజు అధికారులు బయటపెట్టక మానరని చర్చించుకుంటున్నారు. అంత సులువుగా మంత్రి వదిలేయరని గుసగుసలాడుతున్నారు. ఇదిలా ఉండగా స్లిప్పు మాటెలా ఉన్నా మంత్రి సుదీర్ఘ ప్రసంగాలు కాసింత విసుగు తెప్పిస్తున్నాయన్నది వాస్తవమని కూడా చర్చించుకుంటున్నారు.