సాక్షి ప్రతినిధి, కాకినాడ:
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. షెడ్యూల్ విడుదలై మరో మరో మూడురోజుల్లో నామినేషన్ల ఘట్టానికి తెరలేవనుంది. సమర్థులైన అభ్యర్థుల కోసం పార్టీలు వేట మొదలు పెట్టాయి. రాజమండ్రి నగరపాలక సంస్థ సహా ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు పోటీచేసే అభ్యర్థుల నామినేషన్లను ఈ నెల 10వ తేదీ నుంచి అధికారులు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు సమర్థుల కోసం డివిజన్లు, వార్డుల్లో భూతద్దం పెట్టి మరీ వెతుకుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లలో ఉండగా, హఠాత్తుగా మున్సిపల్ ఎన్నికలు వచ్చిపడ్డాయని ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్‌లో అభ్యర్థులే కరువవ్వగా, టీడీపీలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థుల కోసం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు, ముఖ్యనేత ఎంవీ మైసూరారెడ్డి ఎన్నికలు జరిగే రాజమండ్రి కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీ కోఆర్డినేటర్‌లు, అనుబంధ విభాగాల కన్వీనర్‌లతో సుదీర్ఘ కసరత్తు చేశారు.
కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ అంటేనే ఆమడదూరం పరుగెడుతున్నారు.
టీడీపీలో తలనొప్పి కోనసీమలోని ఏకైక మున్సిపాలిటీ అమలాపురంలో తెలుగుదేశం అభ్యర్థి ఎంపికలో మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుకు తలబొప్పి కడుతోంది. తన అనుచరులే ఇద్దరు పోటీపడుతుండటంతో ఎవరికి బొట్టు పెట్టాలో తెలియని అయోమయంలో ఆయన ఉన్నారు. కాంగ్రెస్‌లో అయితే పార్టీ తరఫున పోటీ చేయమని బతిమలాడుతున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థులుగానైనా బరిలోకి దిగుతాము తప్పితే కాంగ్రెస్ నుంచి పోటీచేసేది లేదని చాలామంది తెగేసి చెబుతున్నారు. తుని, పెద్దాపురంలలో టీడీపీ, తునిలో చైర్మన్ అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించాయి. పెద్దాపురం నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు. తన రాజకీయ భవితవ్యంపై ఎటూ తేల్చుకోలేకపోతున్న తరుణంలో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ మున్సిపల్ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు.
మండపేట మున్సిపాలిటీలో 29 వార్డులుండగా ఇంతవరకూ ఏ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయింది. పార్టీ నాయకులతో వార్డు స్థాయిలో రోజుకు నాలుగైదు ప్రాంతాల్లో భేటీలు జరుగుతున్నాయి. ఈ రకంగా దాదాపు అన్ని మున్సిపాలిటీలలోను అభ్యర్థుల ఎంపిక కోసం నేతలు తలలు పట్టుకుంటున్నారు
వేట మొదలు
Published Sat, Mar 8 2014 2:09 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement