సాక్షి, కాకినాడ :
సార్వత్రిక పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్న నేతలకు ‘స్థానిక’ పోరు తలనొప్పిగా మారుతోంది. ఊహించని రీతిలో ముంచుకొచ్చిన మున్సిపల్ ఎన్నికల నుంచి ఏవిధంగా గట్టెక్కాలో తెలియక ప్రధాన పార్టీలలో టికెట్లు ఆశిస్తున్న నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తమ గెలుపు కంటే తమవారి గెలుపుకోసం ‘కోట్లు’ కుమ్మరించాల్సిన పరిస్థితులు ఏర్పడడం వారిని కలవరపెడుతోంది.
వారంతా టికెట్ల కోసం అధినాయకులు.. ఓట్ల కోసం ప్రజల చుట్టూ కాళ్లకు చక్రాలు కట్టుకొని మరీ తిరిగారు. గెలుపునకు బాటలు వేసుకున్నారు. అయినా టికెట్లు వస్తాయో రావో తెలియదు. చివరి నిముషంలో ఎవరు తెరపైకి వస్తారో తెలియని సందిగ్దత. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే తమ పరిస్థితి ఏమిటో తేలిపోతుందని ఇన్నాళ్లు ఆశగా ఎదురుచూశారు.
సమయం రానే వచ్చింది. రేపోమాపో షెడ్యూల్ విడుదలవుతుందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన మున్సిపల్ పోరు వారికి కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. లోక్‌సభ బరిలో నిలిచే వారి కంటే అసెంబ్లీ గోదాలోకి దిగాలనుకొనేవారే ఎక్కువగా వణికిపోతున్నారు.
కాకినాడ కార్పొరేషన్ మినహా రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీల్లో జరుగనున్న మున్సి‘పోల్స్’ బరిలో నిలిచే అభ్యర్థుల కంటే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారికే ప్రతిష్టాత్మకంగా మారాయి. నిన్నమొన్నటి వరకు ఈ ఎన్నికలు జరుగుతాయో లేదో అనే సందిగ్దత నెలకొనడంతో పురపోరులో నిలవాలని ఉవ్విళ్లూరినా ఎప్పుడొస్తే అప్పుడు చూద్దాంలే అన్నరీతిలో నిరుత్సాహానికి గురయ్యారు. కోర్టుల జోక్యంతో అనుకోని విధంగా తెరపైకి వచ్చిన ఈ ఎన్నికల్లో ద్వితీయ శ్రేణినేతలంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. తమకు టికెట్ కావాలంటే తమకు కావాలంటూ వీరంతా నియోజకవర్గ నేతల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నప్పటికీ ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వారు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపోటములపై పడుతుందనే భయం వారిని కలవరపెడుతోంది.
ముఖ్యంగా పార్టీ టికెట్ తమకే ఖరారైపోతుందనే ధీమాతో ఉన్న వారిలో ఈ గుబులు మరీ ఎక్కువగా ఉంది. సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పురపోరు ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కచ్చితంగా ఉంటుందనే ఆందోళన వారిని వేధిస్తోంది. మొన్నటి వరకు టికెట్ ఇస్తే ఎంతఖర్చుకైనా వెనుకాడమని ముందుకొచ్చిన ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పుడు టికెట్‌తో పాటు ఆర్థిక సహకారం కూడా కోరుతున్నారు. మామూలు సమయంలో తమ శక్తి మేరకు సాయం అందిస్తే సరిపోతుంది. కానీ ఇపు్పుడున్న పరిస్థితుల్లో అభ్యర్థులను గెలిపించుకోవల్సిన బాధ్యత అసెంబ్లీ బరిలో దిగాలనుకొనే నేతలపై ఉంది.
ఖర్సవుద్ది మరి!
మున్సిపాల్టీల్లో ఒక్కొక్క వార్డుకు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు ఖర్చవుతుందని అంచనా. కొన్ని వార్డుల్లో రూ.15లక్షల వరకు ఖర్చయ్యే అవకాశాలు లేకపోలేదు. కార్పొరేషన్లలో అయితే రూ.10లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చవుతుంది. కొన్నిడివిజన్లలో రూ.25 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశాలు న్నాయి. ఎంత తక్కువ లెక్కేసుకున్నా మున్సిపాల్టీల్లో రూ.2 కోట్లు, కార్పొరేషన్‌లో కనీసం రూ.3కోట్ల వరకు ఖర్చవుతుందని భావిస్తున్నారు.
ఈ మొత్తంలో కనీసం మూడవ వంతైనా అసెంబ్లీ ఆశావహులు సమకూర్చాల్సి ఉంటుందట! ఏమాత్రం చేయూతనివ్వకపోయినా రానున్న ఎన్నికల్లో వీరు ఎక్కడ తమకు సహకరించరోనన్న ఆందోళన వారిలో నెలకొంది. ఎమ్మెల్యే ఆశావహుల పరిస్థితి ఇలా ఉంటే మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ టికెట్లు ఆశిస్తున్న వారు నిజంగానే సంబరపడిపోతున్నారు. భలే సమయంలో ఈ ఎన్నికలు వచ్చిపడ్డాయంటూ వారంతా ఎగిరి గంతేస్తున్నారు. తమ గెలుపు.. తమ కంటే అసెంబ్లీ అభ్యర్థులకే కీలకమైనందున తామేమీ టెన్షన్ పడనక్కర్లేదనే ధోరణిలో కూల్‌గా ఉన్నారు.
మున్సిబెల్స్
Published Wed, Mar 5 2014 1:04 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement