-కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం
సాక్షి, కాకినాడ: హామీలు అమలు చేయని వారికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడ ఓటర్లకు పిలుపునిచ్చారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నమ్మఘాట్ సెంటర్ లో వైఎస్ జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారని అన్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేస్తే ముగిరిగిపోయినట్టేనని చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని, కానీ, చంద్రబాబుకు ఓటు వేస్తే అది మురిగిపోతుందని జగన్ పేర్కొన్నారు. 'ఏడాదిన్నర తర్వాత ఎన్నికలు వస్తాయని చంద్రబాబే చెబుతున్నారు. ఆ లెక్కన్న రాబోయేది మన పాలనే. మన పాలనలో కాకినాడ కౌన్సిల్‌ను అన్నిరకాలుగా అభివృద్ధి చేసుకుందాం' అని జగన్ ప్రకటించారు.
'జాబు రావాలంటే బాబు రావాలన్నారు. లేకుంటే 2 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామని ప్రకటించారు. ఒక్క ఉద్యోగం లేదు. ఇప్పటికీ 39 నెలలు గడిచింది. అ లెక్కన్న ప్రతీ ఇంటికి చంద్రబాబు 78 వేలు బాకీ పడ్డార'ని జగన్ గుర్తు చేశారు. బెల్ట్ షాపులన్నీరద్దు చేస్తామన్నారు. కానీ, ఇప్పుడు వీధికొక బెల్ట్ షాపు కనిపిస్తోంది. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ఒక్క రూపాయైనా మాఫీ చేశారా? పొదుపు మహిళలను బాబు దారుణంగా మోసం చేశారని జగన్ ధ్వజమెత్తారు.
'రైతులకు భేషరతుగా రుణ మాపీ హామీ ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చకపోగా కరెంట ఛార్జీలు విపరీతంగా పెంచారు. గతంలో 200 రూపాయలు వస్తే ఇప్పుడది 500 కి చేరింది. ఇది చాలదన్నట్లు ఇంటి పన్ను వెయ్యి రూపాయలకు పెంచారు. పేద పిల్లల ఉన్నత చదువు కోసం మహానేత వైఎస్‌ఆర్ ఫీజు రియంబర్స్ ను అమలు చేస్తే, ఈ ప్రభుత్వం దానిని నీరుగార్చేసింది. ఆరోగ్యశ్రీ, 108లను నిర్విర్యం చేసేశారు. అందుకే హామీలు అమలు చేయని వాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి' అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. న్యాయం, ధర్మం వైపు నిలబడాలని ప్రజలను కోరిన వైఎస్ జగన్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే కురక్షేత్ర సంగ్రామానికి నంద్యాల, కాకినాడలే నాంది కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇంకా జిల్లాకు ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన హమీలను జగన్ ప్రస్తావిస్తూ...
తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోలియం వర్సిటీ స్థాపిస్థామని చెప్పారు. చేశారా?
కాకినాడలో మరో పోర్ట్.. నిర్మించారా?
పెట్రో కారిడర్ ఏర్పాటు.. జరిగిందా?
కాకినాడ స్మార్ట్ సిటీ హమీ.. ఏమైంది?
కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రలు.. ఏమయ్యాయి?
నౌక నిర్మాణ ఫ్యాక్టరీ తెచ్చారా?
సముద్రతీరంలో ఆక్వాప్రాసెసింగ్ యూనిట్.. తీసుకొచ్చారా?
రాజమండ్రిలో ఐటీహబ్ సంగతేంటి?
ఇలా ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని వైఎస్ జగన్ వివరించారు.