సమర సన్నాహకం..స్ఫూర్తిదాయకం
సాక్షి ప్రతినిధి, కాకినాడ :రైతులు, డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయని చంద్రబాబు సర్కారుపై పోరుకు సిద్ధమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో పార్టీ ముఖ్యనేతలు స్ఫూర్తిని నింపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయామనే భావనను అధిగమించి, స్వల్పకాలంలోనే ప్రజల్లో బలహీనపడ్డ అధికార పార్టీని ఎండగట్టాలంటూ దిశా నిర్దేశం చేశారు. కాకినాడ సూర్యకళామందిరంలో ఆదివారం జరిగిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఇందుకు వేదికగా నిలిచింది. పార్టీ అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి జిల్లాలో తొలిసారి పార్టీ వేదిక నుంచి మాట్లాడారు. ఏలేరు, గోదావరిపై నాలుగో వంతెన, గోదావరి గట్లు, పంట కాలువలు, గ్రోయిన్‌ల ఆధునికీకరణ, భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇళ్లు...ఇలా జిల్లాలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తలపెట్టి, మధ్యలో నిలిచిన వాటిని వివరించినప్పుడు కేడర్ ‘వైఎస్ అమర్ రహే’ అంటూ మహానేతపై ఉన్న అభిమానాన్ని చాటారు.
ఇవన్నీ పూర్తి కావాలంటే 2019లో పార్టీని అధికారంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్న నేతలు పార్టీ శ్రేణుల్లో భవిష్యత్‌పై ఆశలను రెట్టింపు చేశారు. ‘పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్న ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం ఉంటుందని పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఈ వేదిక ద్వారా చెప్పమ’న్నారని విజయ సాయిరెడ్డి అనడం ప్రతి కార్యకర్తకూ ఉత్తేజాన్నిచ్చింది. విజయసాయిరెడ్డికి ముందు మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రసంగం కేడర్‌లో ఉత్సాహాన్ని నింపింది. 45 నిమిషాలు ఏకధాటిగా సాగిన ధర్మాన ప్రసంగం చంద్రబాబు సర్కార్ వైఫల్యాలపై చెణుకులు, ఆయన తీరుపై చమక్కులతో నిండిపోయింది.
సామాన్య కార్యకర్తలకు సైతం అర్థమయ్యే రీతిలో సాగిన ధర్మాన ప్రసంగం, ఆయన హావభావాలు చంద్రబాబును ఎండగట్టిన తీరు విలక్షణంగా ఉండి పార్టీ శ్రేణుల్ని అలరించాయి. పార్టీ ఎస్సీ, ట్రేడ్, విద్యార్థి తదితర విభాగాల రాష్ట్ర అధ్యక్షులు ఆయా వర్గాల ప్రజలకు చంద్రబాబు సర్కార్ ద్రోహాన్ని జీఓలతో సహా పూస గుచ్చినట్టు వివరించారు. ప్రభుత్వ విధానాలపై భవిష్యత్ ఆందోళన చేపట్టాల్సిన అవసరాన్ని నూరిపోశారు.చాలా కాలం తరువాత జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశం కావడంతో తరలివచ్చిన పార్టీ అభిమానులు, నాయకులతో సమావేశపు హాలు కిక్కిరిసిపోయింది.
కుర్చీలన్నీ నిండిపోవడంతో సమావేశం జరుగుతున్నంత సేపూ పలువురు నేతలు, కేడర్ నిలబడే నేతల ప్రసంగాలు ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. సమావేశం చివరి వరకు ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెహ్రూ ప్రారంభంలో ఇచ్చిన పిలుపును తు.చ. తప్పకుండా పాటించడం ద్వారా కేడర్ తమది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చాటారు. సమావేశంలో ముఖ్య అతిథులైన విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావులతో ముందుగా మాట్లాడించి కొత్త సంప్రదాయానికి తెర తీశారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మల్లిపాముల గణపతి తదితరులు ఏర్పాటు చేసిన విందు పసందుగా నిలిచింది. మొత్తం మీద సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో, భవిష్యత్తుపై భరోసాతో తిరిగి వెళ్లారు.